Margashira Vratam: మార్గశిర లక్ష్మివార వ్రతం – పూజ విధానం, నైవేద్యాలు, వ్రతకథ, ఫలాలు

లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఋణ బాధలు తొలగి, సంపద, ఆరోగ్యం మరియు శ్రేయస్సు సిద్ధిస్తాయని విశ్వాసం.

వ్రత విశిష్టత

  • తిథి: మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు.

  • ప్రాశస్త్యం: ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు.

  • ఫలితం: మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల:

    • ఋణ సమస్యలు తొలగి,

    • శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

వ్రత ప్రారంభ నియమాలు

  • రోజు: మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఈ వ్రతాన్ని ఆచరించాలి.

  • స్నానం, శుభ్రత: ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను.

  • వ్రత నియమం: ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనె రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు.

  • పూజా సన్నద్ధత: చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవాలి.

పూజ మరియు నైవేద్య క్రమం

మార్గశిర లక్ష్మీవార వ్రతం యొక్క విజయవంతమైన ఆచరణకు ఇక్కడ చెప్పబడిన పూజా క్రమం, కథా పఠనం, మరియు వ్రత విస్తరణ నియమాలు ముఖ్యమైనవి.

పూజా క్రమం

  • ప్రథమ పూజ: మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను.

  • లక్ష్మీ పూజ: గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి.

  • కథ పఠనం: మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.

వ్రత విస్తరణ విశేషం

  • వారాల సంఖ్య: లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు. సాధారణంగా కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి.

  • విశేషం: ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషం. (దీని ద్వారా వ్రతం ఐదు గురువారాలు ఆచరించబడుతుంది).

లక్ష్మీదేవికి సమర్పించవలసిన నైవేద్యములు

వ్రత కాలంలో, ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి

వారంనైవేద్యం
1 వ గురువారంపులగం
2 వ గురువారంఅట్లు, తిమ్మనం
3 వ గురువారంఅప్పాలు, పరమాన్నము
4 వ గురువారంచిత్రాన్నం, గారెలు
5 వ గురువారంపూర్ణం బూరెలు

మార్గశిర లక్ష్మివార వ్రత కధ:

పూర్వం కళింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం బెల్లం ఇచ్చేది. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీపూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు, పూలతో పూజచేసి..తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది. కొన్నాళ్లకి సుశీలకు పెళ్లి జరిగింది. తనతో పాటూ లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటినుంచి తీుసుకెళ్లింది సుశీల. అప్పటినుంచి మెట్టినిల్లు వృద్ధి చెందింది కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయంది. విధిలేక సవతి తల్లి తన కుమారుడిని సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది. 

పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల..సోదరుడు వచ్చిన ప్రతిసారీ బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది. ఓసారి వెదురుకర్రలో పెట్టి వరహాలు ఇచ్చింది, మరోసారి మూటకట్టి..ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించింది. అయితే ప్రతిసారీ మార్గమధ్యలో సేదతీరుతున్న సమయంలోనో, చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనూ  ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు. ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల..విధిగా నోమునోచుకుందాం అంది. పాటించాల్సిన నియమాలన్నీ చెప్పుకొచ్చింది..అన్నిటికీ సరే అందామె.

తెల్లవారేసరికి పిల్లలకు చద్దన్న పెడుతూ నోటిలో ఓ ముద్ద వేసుకుంది..ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమైంది.

రెండోవారం పిల్లల తలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది...రెండో వారం నోము నోచుకునే అవకాశం లేకుండాపోయింది.

మూడోవారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు. మూడువారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది. ఇక నాలుగోవారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల..సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి లక్ష్మివారం వ్రతం పూర్తిచేయించింది. అయినప్పటికీ లక్ష్మీ  కటాక్షం సిద్ధించలేదు. 

అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన సుశీల..ఏం జరిగింది? నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది. అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి. నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది. లక్ష్మీసమానురాలైన ఆడపిల్లను..లక్ష్మీరూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపదలేదని చెప్పింది. క్షమించమని ప్రార్థించిన సుశీల.. మరోసారి తల్లితో భక్తిశ్రద్ధలతో వ్రతం చేయించింది. అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సిరిసంపదలు కలిగాయి.  

Comments

Popular Posts