Srisailam Pilgrimage Routes: శ్రీశైలం యాత్ర మార్గాలు – శిఖరేశ్వరం, భీమునికొలను, నీలిగంగ, జాతర రేవు


నేటిలా రవాణా సౌకర్యాలు లేని కాలంలో Srisailam Temple క్షేత్రానికి చేరుకోవడం భక్తులకు ఎంతో కష్టసాధ్యమైన పని. దట్టమైన నల్లమల అడవులు, ఎత్తైన కొండలు, క్రూరజంతువుల భయం—ఇవన్నింటిని తట్టుకుని భక్తులు వందల మైళ్ల దూరం కాలినడకన ప్రయాణించి స్వామివారిని దర్శించుకునేవారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు నల్లమల పాదాల వద్దకు చేరుకున్న తర్వాత శ్రీశైలానికి తీసుకెళ్లే నాలుగు ప్రధాన యాత్రామార్గాలు ఉండేవి.

శిఖరేశ్వరం మార్గం – తూర్పు ద్వారం

ఈ మార్గాన్ని ప్రధానంగా తీరాంధ్ర ప్రాంత భక్తులు ఉపయోగించేవారు. ముందుగా భక్తులు
Tripurantakam Temple చేరుకుని అక్కడి నుండి యర్రగొండపాలెం, వేంకటాద్రిపాలెం, గంజివారిపల్లి, దుద్దనల నాగూరు మీదుగా తెలగవారి చెరువుకు చేరేవారు.

అక్కడి నుండి కొండ మార్గంలో చింతల, పెద్ద ఆరుట్ల, చిన్న ఆరుట్ల మీదుగా
Sikhareswaram Temple చేరుకుని వీర శంకరస్వామిని దర్శించేవారు.

ఇక్కడి నంది కొమ్ముల మధ్య నుంచి శ్రీశైల ఆలయాన్ని దర్శించేవారు. శ్రీశైలానికి వెళ్లలేని వారు ఇక్కడే శిఖర దర్శనం చేసుకుని తిరిగి వెళ్తారు. అందుకే “శ్రీశైల శిఖరం దర్శించినంతనే పునర్జన్మ ఉండదు” అనే నమ్మకం ప్రచారంలో ఉంది.

భీమునికొలను మార్గం – రాయలసీమ భక్తుల మార్గం

రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని అనుసరించేవారు.

కొంతమంది
Siddavatam Temple నుంచి, మరికొందరు
Alampur Jogulamba Temple నుంచి బయలుదేరి నంద్యాల, ఆత్మకూరు మీదుగా కృష్ణాపురం, వెంకటాపురం, సిద్ధాపురం మీదుగా నాగలూటి చేరేవారు.

అక్కడి నుంచి భీముని కొలను దాటి కైలాస ద్వారం చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం చేరి స్వామివారిని దర్శించేవారు. అప్పట్లో ఈ మార్గం అత్యంత ప్రసిద్ధి చెందినది.

నీలిగంగ మార్గం – తెలంగాణ భక్తుల యాత్ర

తెలంగాణ ప్రాంత భక్తులు నాగర్‌కర్నూల్, ఆమ్రాబాద్, తెలకపల్లి ప్రాంతాల నుంచి ప్రయాణించి ముందుగా శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన
Uma Maheswaram Temple చేరుకునేవారు.

అక్కడి నుంచి అప్పాపురం, భ్రమరాంబచెరువు, మేడిమాకుల, సంగడిగుండల మీదుగా నీలిగంగ రేవు చేరుకుని తెప్పల ద్వారా కృష్ణా నదిని దాటి చుక్కల పర్వతం ఎక్కి శ్రీశైలానికి చేరుకునేవారు.

జాతర రేవు మార్గం

ఈ మార్గం కూడా
Uma Maheswaram Temple నుంచే ప్రారంభమవుతుంది.

భ్రమరాంబచెరువు, మేడిమాకుల మీదుగా అక్కగని ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి కృష్ణా నదీ తీరంలోని జాతర రేవు దాటి చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలానికి చేరుకునేవారు.

శ్రీశైలంలో ప్రత్యేక ఆచారం

అప్పటి యాత్ర చాలా కఠినమైనది. భక్తులు వేలాది మైళ్లు కాలినడకన ప్రయాణిస్తూ అడవుల్లో క్రూరజంతువుల నుంచి, ఆటవికుల నుంచి తమను తాము రక్షించుకుంటూ ఇలా ప్రార్థిస్తూ వచ్చేవారు:

“చేదుకో మల్లన్న… దరిచేర్చుకో మల్లన్న…”

ఇంతటి కష్టయాత్ర అనంతరం స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులు ఆలయంలోని సాధారణ నియమాల్లా కాకుండా స్వామివారిని స్పర్శించి దర్శించుకునే ఆచారం ఏర్పడింది.

తమ ఆత్మీయులను ఆలింగనం చేసుకున్నట్టు స్వామివారిని తాకి దర్శించుకోవడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసించేవారు. మార్గమధ్యంలో తమ ప్రాణాలను కాపాడి తన సన్నిధికి చేర్చిన స్వామివారికి కృతజ్ఞతగా ఈ విధంగా దర్శించుకునే సంప్రదాయం ఏర్పడింది.

భారతదేశంలోని ఇతర క్షేత్రాల్లో ఇలాంటి స్పర్శ దర్శనం అరుదుగా కనిపిస్తుండగా, శ్రీశైలంలో మాత్రం ఇది విశిష్టమైన ఆచారంగా నిలిచింది.

No comments