Papmochani Ekadasi: పాపవిమోచని ఏకాదశి 2026 – పాపనాశని వ్రత మహిమ

 

ఉగాదికి ముందు వచ్చే ఫాల్గుణ మాస కృష్ణపక్ష ఏకాదశికు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అంటారు. దీనిని పాపనాశని ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే మనిషి చేసిన పాపాలను తొలగించి పుణ్యఫలాలను ప్రసాదించే పవిత్రమైన ఏకాదశి అని అర్థం.

పాపవిమోచని ఏకాదశి స్థలపురాణం

పురాణ కథనం ప్రకారం పూర్వం మేధావి మహర్షి గాఢమైన తపస్సు చేస్తున్నారు. ఆయన తపస్సును భంగం చేయాలని దేవేంద్రుడు సంకల్పించి మంజుఘోష అనే అప్సరసను పంపాడు.

మంజుఘోష తన నాట్యంతో మహర్షి తపస్సుకు విఘ్నం కలిగించింది. ఆమె నాట్యానికి ఆకర్షితుడైన మేధావి కొంతకాలం తపస్సును విరమించాడు. తరువాత తన తపస్సుకు విఘ్నం కలిగిందని తెలుసుకున్న మహర్షి కోపంతో మంజుఘోషను రాక్షసిగా మారిపోవాలని శపించాడు.

ఆ శాపం వల్ల మంజుఘోష రాక్షసిగా మారిపోయింది. తరువాత మహర్షి మళ్లీ తన తపస్సులో లీనమయ్యాడు. కొంతకాలం తరువాత ఆయన తపస్సు పూర్తయినప్పుడు మంజుఘోష ఆయన వద్దకు వచ్చి క్షమాపణ కోరింది.

అప్పుడు మేధావి మహర్షి ఆమెకు ఇలా ఉపదేశించాడు:

“ఫాల్గుణ మాస కృష్ణపక్ష ఏకాదశి రోజున ఉపవాసం చేసి శ్రీమన్నారాయణుని భక్తితో ఆరాధిస్తే నీ శాపం తొలగి మళ్లీ అప్సరస రూపాన్ని పొందుతావు.”

మహర్షి చెప్పిన విధంగా మంజుఘోష ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుడిని ప్రార్థించింది. దాంతో ఆమె రాక్షస రూపం తొలగిపోయి తిరిగి తన అసలు అప్సరస రూపాన్ని పొందింది.

ఇలా పాపాలను తొలగించే శక్తి ఉన్నందున ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని పిలుస్తారు.

వ్రత విధానం

పాపవిమోచని ఏకాదశి రోజున భక్తులు ఈ విధంగా ఆచరించడం శ్రేయస్కరం.

  • సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి.
  • శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి స్వామివారిని భక్తితో ఆరాధించాలి.
  • స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించడం శుభప్రదం.
  • 11 పసుపు పువ్వులు సమర్పించాలి.
  • 11 రకాల తీపి పదార్థాలను నైవేద్యంగా అర్పించాలి.
  • విష్ణు నామాలు, మంత్రాలను జపించాలి.
  • రోజంతా ఉపవాసం ఉండి భక్తితో పూజలు చేయాలి.

పురాణ వచనం ప్రకారం ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయి. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని చెబుతారు.

2026లో పాపవిమోచని ఏకాదశి

2026 సంవత్సరంలో పాపవిమోచని ఏకాదశి మార్చి 15న వస్తుంది.

No comments