Vijaya Ekadasi: విజయ ఏకాదశి 2026 – తేదీ, వ్రత విధానం, మహత్యం


విజయ ఏకాదశి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. ఈ పవిత్ర ఏకాదశి మహత్యం స్కంద పురాణంలో విస్తృతంగా వివరించబడింది. ఈ ఏకాదశి వ్రత ఆచరణ విధానాన్ని బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.

విజయ ఏకాదశి – పౌరాణిక ప్రాశస్త్యం

పౌరాణిక కథనం ప్రకారం, శ్రీరామచంద్రమూర్తి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన తరువాతే సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణుడిని సంహరించాడు అని విశ్వాసం. అందుకే ఈ ఏకాదశిని ఆచరించిన వారికి విజయం తప్పక లభిస్తుంది అని శాస్త్రవచనం.

విజయ ఏకాదశి వ్రత విధానం

ఏకాదశి ముందురోజు చేయవలసిన విధి

  • రాగి లేదా మట్టికుండలో శుభ్రమైన నీటిని నింపాలి
  • ఆ పాత్రను మామిడాకులతో అలంకరించాలి
  • సప్తధాన్యాలతో అలంకరించిన వేదికపై ఆ పాత్రను ఉంచాలి
  • ఆ పాత్రపై నారాయణుని ప్రతిష్ఠించాలి

ఏకాదశి రోజు ఆచరణ

  • తెల్లవారుజామునే స్నానమాచరించాలి
  • తులసీదళాలు, గంధం, పూలు, పూలమాలలు సమర్పించాలి
  • ధూపదీప నైవేద్యాలతో శ్రీమన్నారాయణుని పూజించాలి
  • ఆ రోజంతా ఉపవాసం, బ్రహ్మచర్యం పాటించాలి
  • రాత్రి జాగరణ చేయడం విశేష ఫలదాయకం

ద్వాదశి రోజు విధానం

  • మరునాడు ఆ పాత్రను నదీ తీరంలో లేదా పవిత్ర జలాశయం వద్ద యథావిధంగా పూజించాలి
  • అనంతరం ఆ పాత్రను బ్రాహ్మణుడికి దానం చేయాలి

వ్రత ఫలితం

విజయ ఏకాదశి మహత్యాన్ని చదివినవాడు,విన్నవాడు, లేదా ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవాడు వాజపేయ యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు అని పురాణాల్లో చెప్పబడింది.

ఈ రోజున సాధారణంగా ఏకాదశికి పాటించే నియమాలు అన్నీ కూడా విధిగా పాటించాలి.


విజయ ఏకాదశి వ్రత కథ
శ్రీరామ చంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథని చదవడం వలన ఏకాదశి వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుందంటారు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు. సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కొరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరించి ఆ రుషి ఆశ్రమానికి వెళతారు. తన ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుడిని చూసి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదళాభ్యుడు. అయినప్పటికీ రావణుడిని జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ తర్వాత సముద్రంపై సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు. శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే ఈ విజయం సిద్ధించిందని చెబుతారు.


2026: ఫిబ్రవరి 13.

No comments