Simhachalam Chandanotsavam: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం 2026 – పురాణ గాథ, నిజరూప దర్శనం

 

ఏటా వైశాఖ శుక్ల తదియ రోజున సింహాచలం క్షేత్రంలో జరిగే చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజు స్వామివారిపై ఏడాది పొడవునా పూసిన చందన లేపనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు.


2026 సంవత్సరంలో చందనోత్సవం – ఏప్రిల్ 20

సంవత్సరంలో ఒక్కరోజే స్వామివారి నిజ స్వరూప దర్శనం లభించడంతో లక్షలాది మంది భక్తులు ఈ పర్వదినాన సింహాద్రికి తరలివస్తారు.

చందనోత్సవం వెనుకున్న పురాణ గాథ

హిరణ్యాక్షుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు నృసింహావతారాన్ని ధరించాడు. అన్నదమ్ములైన ఈ రాక్షసులను సంహరించేందుకు శ్రీహరి వరుసగా అవతరించినట్లు పురాణాలు చెబుతాయి.

హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత వరాహరూపాన్ని విరమించేలోపే, భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీహరి వరాహ స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుణ్ని సంహరించిన అనంతరం నృసింహుడు జ్వాలామాలికలతో, ఉగ్రరూపంతో దర్శనమివ్వగా సమస్త లోకాలు భయాందోళనకు గురయ్యాయి.

బ్రహ్మాది దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా ఉగ్రత తగ్గలేదు. అప్పుడు బ్రహ్మకు చందన వృక్షానికి ఇచ్చిన వరం గుర్తొచ్చింది — ఉష్ణం, తాపం, ఉగ్రతను శాంతింపజేసే శక్తి చందనానికి ఉందని. బ్రహ్మ సూచనతో ప్రహ్లాదుడు స్వామివారికి చందన సేవ చేయగా నృసింహుడు శాంతించాడు.

ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహ–నరసింహ స్వరూపంలో సింహగిరిపై కొలువయ్యాడు. ఈ మహద్ఘటన అక్షయ తృతీయ రోజున జరిగినదిగా పురాణగాథ తెలియజేస్తుంది.

స్వామివారి పాదాలు ఎందుకు కనిపించవు?

“పాహీ! శ్రీమన్నారాయణ!” అని ప్రహ్లాదుడు పిలిచిన వెంటనే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగిపోయాయని చెబుతారు. అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు.

పురూరవ చక్రవర్తి పునరుద్ధరణ

కాలక్రమంలో స్వామివారి విగ్రహం మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. అనంతరం పురూరవ చక్రవర్తి పుష్పక విమానంలో ఊర్వశితో ప్రయాణిస్తుండగా సింహగిరిపై విమానం ఆగిపోయింది. ఊర్వశి దివ్యదృష్టితో ఈ గిరి మహిమాన్వితమని తెలిపింది.

ఆ రాత్రి స్వామివారు కలలో ప్రత్యక్షమై తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని తెలిపాడు. విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్లు కథనం. ఆ గుర్తుగా ఇప్పటికీ 12 మణుగుల చందనాన్ని దశల వారీగా సమర్పించే ఆచారం కొనసాగుతోంది.

నిజరూప దర్శనం – లింగాకార స్వరూపం

వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భూమిలో దాగిన పాదాలు — ఇదే స్వామివారి అసలు స్వరూపం. ఈ దర్శనం అక్షయ తృతీయనాడు కొద్ది గంటలపాటు మాత్రమే లభిస్తుంది.

ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందన లేపనం చేయడంతో స్వామివారు శివలింగాకారంగా దర్శనమిస్తారు. ఇది హరి–హర ఏకత్వానికి ప్రతీకగా భావిస్తారు.

అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో కూడా విడతల వారీగా చందన సమర్పణ జరుగుతుంది. మొత్తం 12 మణుగుల చందనాన్ని సమర్పించడం ఈ ఉత్సవం విశిష్టత.

No comments