తిరుమల ఉచిత వివాహాలు – నమోదు విధానం, అర్హతలు, దర్శనం, వసతి వివరాలు


కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల లో 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 26,500కు పైగా వివాహాలు నిర్వహించబడినట్లు సమాచారం. ఈ సమస్త ఉచిత వివాహాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

ఉచిత వివాహంలో టీటీడీ అందించే సదుపాయాలు

తిరుమల కొండపై కళ్యాణ వేదికలో వివాహం చేసుకునే వారికి టీటీడీ తరఫున క్రింది సదుపాయాలు ఉచితంగా అందిస్తారు:

  • కళ్యాణ మండపం
  • మంగళ వాయిద్యాలు
  • పసుపు, కుంకుమ, కంకణాలు
  • పురోహితుడు

అయితే వివాహానికి అవసరమైన మిగతా సామాగ్రిని వధూవరులే తీసుకురావాలి. వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలి. రాలేని పక్షంలో సంబంధిత ఆధార పత్రాలు సమర్పించాలి.

ఎలా నమోదు చేసుకోవాలి?

టీటీడీ 2016 మే 9వ తేదీ నుండి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. నమోదు విధానం ఇలా ఉంటుంది:

  1. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో “కళ్యాణ వేదిక” కాలమ్‌ను ఎంచుకోవాలి.

  2. వధూవరుల పూర్తి వివరాలు నమోదు చేయాలి.

  3. తల్లిదండ్రుల వివరాలు మరియు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.

  4. వయసు ధృవీకరణ కోసం క్రింది పత్రాలలో ఏదో ఒకటి నమోదు చేయాలి:

  • బర్త్ సర్టిఫికేట్
  • 10వ తరగతి మార్కుల లిస్టు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
  • పంచాయతీ కార్యదర్శి / మున్సిపల్ అధికారుల ధృవీకరించిన జనన పత్రం

వివాహ తేదీ, సమయాన్ని ఎంపిక చేసి అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది.

వివాహానికి ముందు చేయాల్సినవి

  • వధూవరులు ఇద్దరూ తమ తమ ప్రాంతానికి చెందిన ఎమ్మార్వో (తహసిల్దార్) వద్ద నుంచి “Unmarried Certificate” (ఇదే మొదటి వివాహమని ధృవీకరణ పత్రం) పొందాలి.
  • వివాహానికి కనీసం 6 గంటల ముందే తిరుమల చేరుకోవాలి.
  • అక్నాలెడ్జ్మెంట్ పత్రం మరియు అవసరమైన అన్ని పత్రాల జిరాక్స్ కాపీలు కళ్యాణ వేదిక కార్యాలయంలో సమర్పించాలి.
  • అక్కడి సిబ్బంది పత్రాలను మరోసారి పరిశీలిస్తారు.

అర్హత నిబంధనలు

  • వధూవరులు తప్పనిసరిగా హిందువులు కావాలి.
  • వధువు వయస్సు 18 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
  • వరుడు వయస్సు 21 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
  • ద్వితీయ వివాహాలు మరియు ప్రేమ వివాహాలు నిర్వహించబడవు.

ఇతర వివరాలకు:  0877-2263433

వివాహ రిజిస్ట్రేషన్

తిరుమలలో వివాహం అనంతరం, వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హిందూ వివాహ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేయబడింది.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు:

  • వయస్సు ధృవ పత్రాలు
  • నివాస ధృవ పత్రం
  • వివాహ ఫోటోలు
  • పెళ్లి పత్రిక
  • కళ్యాణ మండపం రసీదు
  • ఎమ్మార్వో జారీ చేసిన అవివాహిత ధృవీకరణ పత్రం

సమయం: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఫోన్: 0877-2263433

దర్శనం మరియు వసతి సదుపాయం

తిరుమలలో ఉచిత వివాహం చేసుకున్న వధూవరులు మరియు వారి తల్లిదండ్రులు (మొత్తం ఆరుగురు వరకు) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

  • దర్శనం అనంతరం మ్యారేజ్ రిసిప్ట్‌లో ఉన్న సంఖ్య మేరకు ఉచిత లడ్డూలు అందజేస్తారు.
  • అవకాశం ఉంటే రూ.50 గదిని CRO/ARP కార్యాలయం వద్ద కేటాయిస్తారు.

No comments