భారతీయ సంస్కృతిలో గర్భధారణను అత్యంత పవిత్రమైన దశగా భావిస్తారు. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం, ఆమె మానసిక స్థితి, ఆహారవిహారాలు, ఆలోచనలు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాయని మన పురాణాలు, శాస్త్రాలు ఎంతో ప్రాముఖ్యతతో వివరించాయి.
పురాణ కథనాల ప్రకారం, ఒకసారి కశ్యప ప్రజాపతి తన భార్య దితి గర్భవతిగా ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలు వివరించాడని చెబుతారు. అప్పట్లో చెప్పిన ఈ నియమాలలో అనేక అంశాలు ఈ రోజుల్లో కూడా ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తాయి.
- సంధ్యా సమయంలో భోజనం చేయకూడదు
- చెట్టు మొదల్లో నిలబడకూడదు
- అతిగా నిద్రపోకూడదు, నీళ్ళలో దిగరాదు.
- రోలు రోకలి వీటి జోలికి వెళ్ళకూడదు
- శూన్యంగా ఉన్న ఇంటిలోకి వెళ్ళకూడదు
- పుట్టలున్న చోట నిలబడకూడదు.
- మనసుని ఆందోళనకి గురికాకుండా చూసుకోవాలి
- నేలమీద బొగ్గులతో, బూడిదలో గోళ్ళతో రాయకూడదు.
- ఎప్పుడూ పడుకునే ఉండకూడదు.
- వ్యాయామం, అధిక శారీరక శ్రమ చేయకూడదు
- ఊక, బొగ్గులు, బూడిద, ఎముకలు పుర్రెలున్న చోట కూర్చోకూడదు
- ఇతరులతో కలహమాడకూడదు. తలంటుకోకూడుదు
- తల విరబోసుకుని తిరగకూడదు
- అపరిశుభ్రంగా ఉండరాదు. ఉత్తరం వైపు తల పెట్టకూడదు
- తల కిందకి వాల్చి పడుకోకూడదు
- బట్టవిప్పుకొని, తడికాళ్ళతో ఉండరాదు
- అమంగళకరమైన మాటలు అనకూడదు
- ఎక్కువగా పరిహాసాలాడకూడదు
- మాంగల్య అభివృద్ధి కోరి అగరుధూపాలతో దైవపూజ చేయాలి
- అన్ని రకాల మూలికలు వేసి స్నానం చేయాలి
- భర్త క్షేమాన్నే నిత్యం కోరుతూ చిరునవ్వుతో ఉండాలి.
- ఎలాంటి స్థితిలోనూ భర్తని అసహ్యించుకోకూడదు
ఈ విధంగా గర్భిణీ స్త్రీలు నియమాల్ని శ్రద్ధగా పాటించినట్లైతే సకల శుభలక్షణాలు కలిగిన సంతానాన్ని అనాయాసంగా పొందుతారు.