Aragonda Anjaneya Temple: అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం – సంజీవరాయ తీర్థ మహత్యం, పౌర్ణమి ప్రత్యేక ఉత్సవాలు
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాక వినాయక స్వామి ఆలయానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం అతి మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది.
ఈ ఆలయంలో కొలువైన హనుమంతుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశిస్తాయని భక్తుల అచంచల విశ్వాసం.
స్థల పురాణం
త్రేతాయుగంలో రామ–రావణ యుద్ధ సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాఘాతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవని మూలికలను తెచ్చేందుకు వాయువేగంతో హిమాలయాలకు బయలుదేరుతాడు. సంజీవని పర్వతానికి చేరుకున్నప్పటికీ మూలికలను గుర్తించలేక, ఆ పర్వతాన్నే పెకిలించుకుని తీసుకువస్తుండగా మార్గమధ్యంలో ఒక ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది.
ఆ అర్ధ పర్వతం పడిన ప్రాంతమే నేటి అరగొండ. ‘అర కొండ పడిన ప్రదేశం’ కావడంతో కాలక్రమేణా అది అరగొండగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం తెలియజేస్తుంది.
సంజీవరాయ తీర్థ మహిమ
సంజీవని పర్వత భాగం విరిగి పడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఒక కొలను ఏర్పడింది. అదే నేటి సంజీవరాయ తీర్థం. ఈ తీర్థ జలాల్లో సంజీవకరణి, విషల్యకరణి వంటి మహిమాన్విత వనమూలికలు, ఔషధ గుణాలు కలిసివుండటంతో, అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు.
ఇక్కడి మట్టిని శరీరానికి రాసుకుంటే భయంకరమైన చర్మవ్యాధులు సైతం నశిస్తాయని నమ్మకం. త్రేతాయుగం నాటి ఈ సంజీవరాయ తీర్థంలో స్నానం చేయడానికి, తీర్థ జలాలను సేవించడానికి దేశ విదేశాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు.
హనుమ విగ్రహ ప్రతిష్ఠ విశేషం
ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. అందువల్ల సకల ఐశ్వర్యాలు, విజయాలు చేకూరాలనే సంకల్పంతో సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి, సంజీవరాయ తీర్థం పక్కన హనుమంతుని విగ్రహాన్ని ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది.
భక్తుల విశ్వాసం
ఎవరైనా కొత్తగా ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే, ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సిద్ధిస్తుందని భక్తుల గాఢ విశ్వాసం.
పౌర్ణమి ప్రత్యేకత
ప్రతి పౌర్ణమి రోజున సంజీవరాయ తీర్థంలో చంద్రకిరణాలు ప్రసరించి, తీర్థ జలాల మహిమ వెయ్యిరెట్లు పెరుగుతుందని నమ్మకం. ఆ రోజున తీర్థ జలాలను సేవిస్తే ఏ అనారోగ్య బాధలైనా దూరమవుతాయంటారు. అందుకే పౌర్ణమి రోజున ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
అలాగే ఒక నియమం ప్రకారం తొమ్మిది పౌర్ణములు వరుసగా ఈ క్షేత్రాన్ని దర్శించి తీర్థ జలాలను సేవించే సంప్రదాయం కూడా ఉంది.
పౌర్ణమి రోజున జరిగే పూజలు
ప్రతి పౌర్ణమి ఉదయాన స్వామికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవ, విశేష అభిషేకాలు భక్తిశ్రద్ధలతో జరుగుతాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి.
దర్శన సమయాలు
భక్తులు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి దర్శనం చేసుకోవచ్చు.

Post a Comment