ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ విశిష్టతతో భక్తులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఒకటి నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం.
చుట్టూ నల్లమల అడవులు, పచ్చని కొండలు, జలపాతాలు, ప్రశాంతమైన ప్రకృతి మధ్య వెలసిన ఈ దేవాలయం ఆధ్యాత్మికతతో పాటు రహస్యభరితమైన విశేషాలకు కూడా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దేవాలయాలు ప్రతిరోజూ తెరిచి ఉంటాయి. గ్రహణాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొంతసేపు మూసివేస్తారు. కానీ ఈ ఆలయం మాత్రం వారంలో కేవలం శనివారం మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది.
అంతేకాదు… ఈ క్షేత్రానికి వెళ్లాలంటే భక్తితో పాటు ధైర్యం కూడా అవసరమని స్థానికులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ ఆలయానికి కాపలాదారుల్లా తేనెటీగలు ఉంటాయని విశ్వాసం.
ఎక్కడ ఉంది?
ఈ పవిత్ర క్షేత్రం నల్లమల అడవులు పరిసర ప్రాంతంలోని జె. పుల్లలచెరువు గ్రామంలో, రాచర్ల మండల పరిధిలో ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని భక్తుల విశ్వాసం.
నెమలిగుండం పేరుకి కారణం
స్థల పురాణం ప్రకారం, “మయూర” అనే మహర్షి నల్లమల అటవీ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సు సమయంలో తన ముక్కుతో ఒక గుండాన్ని తవ్వాడట.
మహర్షికి నెమలి శిరస్సు ఉండటంతో ఆయన తవ్విన ఆ గుండానికి “నెమలిగుండం” అనే పేరు వచ్చిందని చెబుతారు.
రంగలక్ష్మి భక్తి – రంగనాయకస్వామి అవతారం
అదే ప్రాంతంలోని ఇసుకగుండంలో చెంచు జాతికి చెందిన బయన్న–బయ్యక్క దంపతులు తమ కుమార్తె రంగలక్ష్మితో కలిసి నివసించేవారు.
చిన్నప్పటి నుంచే విష్ణుభక్తురాలైన రంగలక్ష్మి, పెద్దయ్యాక మహావిష్ణువునే వివాహం చేసుకోవాలని సంకల్పించుకుంది. కుటుంబ సంప్రదాయాలను కూడా పక్కనబెట్టి, తన కోరిక నెరవేర్చుకోవాలనే తపనతో నెమలిగుండం చేరుకుంది.
అక్కడ తపస్సులో ఉన్న మయూర మహర్షిని కలిసి తన మనసులోని కోరికను తెలిపి, ఆయనతో కలిసి దీక్ష చేపట్టిందట. ఆమె భక్తి, తపస్సుకు ప్రసన్నుడైన మహావిష్ణువు రంగనాయకస్వామిగా అవతరించి ఆమెను పరిణయం చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది.
తరువాత మయూర మహర్షి స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించడంతో ఈ ప్రాంతం “నెమలిగుండ్ల రంగనాయక క్షేత్రం”గా ప్రసిద్ధి చెందింది.
లక్ష్మీదేవి శిలగా మారిన కథ
వైకుంఠాన్ని విడిచి వచ్చిన విష్ణుమూర్తిని వెతుకుతూ లక్ష్మీదేవి నెమలిగుండం చేరుకుందట. అయితే ఇక్కడికి వచ్చాక స్వామివారి వివాహం గురించి తెలుసుకుని తీవ్రంగా విలపించిందని చెబుతారు.
ఆ బాధతో ఆలయ సమీపంలోనే ఆమె శిలగా మారిపోయిందని స్థానిక కథనం. ఆమె కార్చిన కన్నీళ్లకు నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ బొట్టుబొట్టుగా నీరు కారుతూనే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
తేనెటీగల కాపలా
ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత విశేషమైన నమ్మకం తేనెటీగల గురించే.
గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే ఈ స్వామివారికి తేనెటీగలే కాపలాదారులని చెబుతారు. భక్తులు పవిత్రత, నియమనిష్ఠలు పాటించకుండా లేదా అపవిత్ర స్థితిలో ఆలయానికి వస్తే తేనెటీగలు దాడి చేస్తాయని స్థానికుల విశ్వాసం.
అలా తేనెటీగల దాడికి గురైన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయని గ్రామస్థులు చెబుతుంటారు. అందుకే ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, నియమాచారాలతో దర్శనానికి వెళ్తారు.
బ్రహ్మోత్సవాల వైభవం
ప్రతి సంవత్సరం చైత్రమాస శుద్ధ పౌర్ణమి నుండి తదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ – విజయవాడ వైపు నుంచి
- రోడ్డు మార్గం ద్వారా కంభం చేరుకోవాలి
- అక్కడి నుంచి అటవీ మార్గం ద్వారా నెమలిగుండం చేరుకోవచ్చు
రాయలసీమ ప్రాంతం నుంచి
- గిద్దలూరు మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు
భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది.
