కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని చెల్లెలిగా పూజలందుకుంటున్న చల్లని తల్చి తాతయ్యగుంట గంగమ్మ. సూర్యుడు మేషరాశిలో ఉండే నెలలో ప్రతి సంవత్సరం చివరి మంగళవారం ప్రారంభమై తొమ్మిదిరోజుల పాటు గంగమ్మ జాతర జరుగుతుంది.
గంగమ్మ జాతర వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం తిరుపతి ప్రాంతం పాలెగాళ్ల పాలనలో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఒకడు కామాంధుడు. కంటబడిన కన్యలందరినీ చెరపట్టేవాడు. దీనితో మహిళలందరూ సకల దేవతలనూ ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని స్త్రీలను రక్షించేందుకు గంగమ్మతల్లి జన్మించింది. కన్య అయిన అమ్మవారిని కూడా పాలెగాడు బలాత్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మవారు ఆగ్రహించింది. ఆ పాలెగాణ్ణి అంతమొందించేందుకు సిద్ధమైంది. వాడు ప్రాణభయంతో తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాను మారువేషం ధరిస్తే పాలెగాడు గుర్తుపట్టలేడని భావించిన గంగమ్మ పలురకాల వేషాలు ధరించి, పాలెగాణ్ణి తిడుతూ వీధుల్లో తిరగసాగింది. అయినా వాడు బయటకు రాలేదు. చివరకు గంగమ్మ ఒకరోజు దొరవేషం ధరించింది. సామంతుడైన పాలెగాడు ప్రభువు వచ్చాడని భావించి బయటకు వచ్చాడు. అందుకోసమే వేచివున్న గంగమ్మ అతడి తల నరికివేసింది. మరునాడు గంగమ్మ మాతంగి వేషం ధరించి పాలెగాడి భార్యకు ఊరట కలిగించింది. అప్పటినుంచి జాతర జరుపుకోవడం ప్రారంభమైంది. గంగమ్మ వివిధ వేషాలు ధరించినందుకు నిదర్శనగా భక్తులు కూడా వివిధ వేషాలు ధరించడం ప్రారంభమైంది.
తమిళమాసమైన చిత్తిరైనెల చివరి మంగళవారం నాడు చాటింపు వేస్తారు. గంగమ్మ జన్మస్థలమైన అవిలాల నుంచి సారె తీసుకువస్తారు. గంగజాతర ముగిసేవరకూ ఊరిలో ఉన్నవారు బయటకు వెళ్లరాదని ప్రకటించడంతో జాతర ప్రారంభమవుతుంది. మరుసటిరోజు నుంచి యువకులు, పిల్లలు వివిధ వేషాలు ధరిస్తారు. రెండోరోజు బైరాగివేషం ధరిస్తారు. శరీరమంతా నాముకొమ్ము రాచుకుని, వేపమండలు చేతధరించి, వూరేగింపుగా సందడిచేస్తూ ఆలయాన్ని చేరి అమ్మవారిని దర్శిస్తారు. మూడోరోజు బండవేషం ఉంటుంది. శరీరమంతా ఎర్రనిబొట్లు, నలుపు బొట్లు, తెల్లని పుష్పాలతో కూడిన మాలలు శిరస్సుకు చుట్టుకుని, చేతిలో కర్రను ధరించి వివిధ వాయిద్యాల మధ్య లయబద్ధంగా అడుగులు వేస్తూ అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకుంటారు.
నాలుగోరోజు తోటివేషం ఉంటుంది. ఐదోనాడు దొరవేషం, ఆరోరోజు మాతంగి వేషం ఉంటాయి. ఏడోరోజు సున్నపు కుండల వేషాలుంటాయి. ఎనిమిదోరోజు సప్పరాలు జరుగుతాయి. తొమ్మిదోరోజు మట్టి ప్రతిమను తొలగిస్తారు. దీనితో జాతర ముగుస్తుంది. తిరుపతి గంగజాతరలో వేషాలు ధరించడమే ప్రత్యేకత.
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఉంది.
జాతర తేదీలు - 2026
మే 05 – చాటింపు
మే 06 – బైరాగి వేషం
మే 07 – బండ వేషం
మే 08 – తోటి వేషం
మే 09 – దొర వేషం
మే 10 – మాతంగి వేషం
మే 11 – సున్నపు కుండలు
మే 12 – గంగమ్మ జాతర
మే 13 – విశ్వరూప దర్శనం

Comments
Post a Comment