బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మహత్యాన్ని యమునికి వివరించి, అనంతరం వారివురు కలిసి విష్ణువు దగ్గరకు వెళ్లి యముని విచారం పోగొట్టిన వైనాన్ని శ్రుతకీర్తి మహారాజుతో శృతదేవ మహాముని ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
నారదుడు అంబరీషునితో శృతదేవ మహామును, శ్రుతకీర్తి మహారాజుల సంవాదాన్ని వివరిస్తున్నాడు.
శ్రీహరి మహత్యాన్ని వివరించిన బ్రహ్మ
తీవ్రమైన విచారంతో తనను ఆశ్రయించిన యమునితో బ్రహ్మ "ఓ యమధర్మరాజా! నీకు ఈ విచారం ఎందుకు? కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతం చేసి సకల జనులు విష్ణులోకాన్ని పొందడంలో ఆశ్చర్యం ఏముంది? ఒక్కసారి గోవిందా నామం పలికితే నూరు అశ్వమేధయాగాలు తరువాత చేసే అవభృదస్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఎన్ని యజ్ఞాలు చేసినవారైనా పుణ్యఫలాన్ని అనుభవించిన తరువాత తిరిగి జన్మించాల్సిందే! కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామస్మరణ చేసినవారికి నరకబాధలు ఉండవు. ప్రయాగాది తీర్థాల్లో, గంగ సరస్వతి వంటి పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మరణ సమయంలో నారాయణ నామం ఉచ్చరిస్తే విష్ణులోకానికి పోతారు.
వైశాఖ వ్రత ఫలం
ఇక శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించి, వైశాఖ పురాణాన్ని విన్నంతనే సర్వపాపాలు పోగొట్టుకుని విష్ణులోకాన్ని చేరడంలో ఆశ్చర్యమేముంది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు" అని పలికిన బ్రహ్మ మాటలకు యముడు ఈ రకంగా తన బాధను వివరించాడు.
యముడు తన బాధను వ్యక్తం చేయుట
యముడు బ్రహ్మతో "ఓ మహానుభావా! ఇక నేను తిరిగి యమలోకానికి వెళ్లి నా కర్తవ్యాన్ని నిర్వహింపలేను! కీర్తిమంతుడు ఈ విధంగా పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను ధర్మాన్ని నిర్వర్తించలేను. ఎలాగైనా కీర్తిమంతునిచే వైశాఖ వ్రతాన్ని మానేట్లుగా చేస్తే తప్ప నేను నా విధులను నిర్వహించలేను" అని యముడు పలికిన మాటలక బ్రహ్మ ఇలా సమాధానం చెప్పాడు.
తరుణోపాయం చెప్పిన బ్రహ్మ
బ్రహ్మ యమునితో "యమధర్మరాజా! విష్ణుభక్తుడగు కీర్తిమంతునితో విరోధం తగదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు వెళ్లి జరిగినదంతా శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన ఎలా చెబితే అలాగే చేద్దాం" అనుకుని బ్రహ్మ, యముడు వైకుంఠానికి చేరుకున్నారు.
శ్రీహరికి విన్నవించిన బ్రహ్మ
వైకుంఠాన్ని చేరిన బ్రహ్మ, యముడు- శ్రీహరిని పరిపరివిధాలుగా స్తుతిస్తారు. శ్రీహరి ప్రసన్నుడై యముడు, బ్రహ్మను చూసి ఇలా అడుగుతాడు.
వివరం అడిగిన శ్రీహరి
శ్రీహరి- బ్రహ్మ, యముని చూసి "మీ రాకకు కారణం ఏమిటి? యముని ముఖం వాడిపోయి ఉంది. తలదించుకుని ఉన్నాడు? అసలేం జరిగింది? అని వివరం అడిగెను.
శ్రీహరికి వివరించిన బ్రహ్మ
శ్రీహరితో బ్రహ్మ "ఓ పురుషోత్తమా! భూలోకంలో నీ భక్తుడు కీర్తిమంతుడు తనతో పటు ప్రజలందరితో వైశాఖ వ్రతాన్ని ఆచరింపజేస్తున్నాడు. ఆ వ్రత ప్రభావం వలన అందరు విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. అక్కడ యమలోకం శూన్యమైపోయింది. విచారంతో కీర్తిమంతునిపై యుద్ధానికి వెళ్లిన యమునికి నీ సుదర్శన చక్రం కారణంగా పరాభవం జరిగింది. అందుకే యముడు ఇంత విచారంగా ఉన్నాడు. నీ భక్తులను శిక్షించుట మా వాళ్ళ కాదు. ఎలాగైనా కీర్తిమంతుని శిక్షించి అతను, అతని ప్రజలు వైశాఖ వ్రతం మానేట్లు చూడకపోతే యముని విచారం తగ్గదు" అని బ్రహ్మ జరిగిందంతా శ్రీహరికి విన్నవిస్తాడు.
భవిష్యత్తును చెప్పిన శ్రీహరి
బ్రహ్మ మాటలకు శ్రీహరి మందహాసంతో "ఓ బ్రహ్మదేవా! నన్ను ఆశ్రయించిన భక్తుని నేను ఎన్నటికీ వీడను!" అని అంటూ యమునితో "యమధర్మరాజా! నేను నా భక్తుడైన కీర్తిమంతునిపై అనుగ్రహంతో అతనికి పదివేల సంవత్సరాల ఆయుర్ధాయాన్ని ఇచ్చాను. ఇప్పటికి ఎనిమిది వేల ఏళ్ళ ఆయువు పూర్తయింది. కీర్తిమంతుని తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు అవుతాడు. ఈ రాజు సకల దురాచారాలు, సదాచారాలు నశింపజేస్తాడు. తరువాత అతడు కూడా తాను చేసిన పాపాలకు నశిస్తాడు. ఈ కాలంలో వైశాఖ వ్రతం ఆచరించేవారు లేక యమలోకం పాపులతో నిండిపోతుంది. నీకు చేతినిండా పని ఉంటుంది" అని చెప్పెను.
ధర్మసంస్థాపన కోసం పృథువుగా జన్మించనున్న శ్రీహరి
"వేణుడి తరువాత ధర్మసంస్థాపన కోసం నేను తిరిగి పృథువు అనే పేరుతో జన్మిస్తాను. అప్పుడు మరల వైశాఖ ధర్మాలను ప్రచారం చేసి ప్రజలంతా ఆచరించేలా చేస్తాను. అయితే వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఈ ధర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది. మిగిలిన వారంతా కామోపభోగాలపై ఆసక్తితో ఉంటారు. కావున ఓ యమధర్మరాజా! ప్రజలు ఆచరించే వైశాఖ వ్రతంలో నీ భాగం నీకు ఇప్పిస్తాను. కీర్తిమంతుడు కూడా నీ వంతు భాగం నీకు ఇచ్చేలా చేస్తాను. అనుకోసం నా దూత సునందుని ఇప్పుడే కీర్తిమంతుని వద్దకు పంపుతాను" అని పలికి ఆ శ్రీహరి వైశాఖ వ్రతంలో యమునికి భాగం ఎలా వస్తుందో వివరించాడు.
వైశాఖ వ్రతంలో యమభాగం ఇలా
"వైశాఖ వ్రతం ఆచరించే వారు ప్రతిరోజూ నదీస్నానం చేసి యమునికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే వైశాఖ వ్రతం చివరి రోజున జలంతో నిండిన కలశాన్ని, పెరుగన్నంను యమప్రీతికి కోసం యమునికి నివేదించి అనంతరం సద్భ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అలా చేయని వారికి వైశాఖ వ్రతం ఆచరించిన ఫలం దక్కదు. అలాగే ఇప్పుడే సునందుని కీర్తిమంతుని వద్దకు పంపి నీ భాగం నీకు అందేలా చేస్తాను" అని ఆ శ్రీహరి సునందుని కీర్తిమంతుని వద్దకు పంపుతాడు. శ్రీహరి పంపగా వచ్చిన సునందుడు చెప్పినట్లుగా తాను చేసే వైశాఖ వ్రతంలో యముని భాగం ఇవ్వడానికి కీర్తిమంతుడు అంగీకరిస్తాడు.
తమ లోకాలు చేరిన బ్రహ్మ యముడు
ఈ విధంగా శ్రీహరి యముని ఊరడించి అంతర్ధానమయ్యాడు. జరిగిన సంఘటనలు తలపోసుకుంటూ బ్రహ్మ తన లోకానికి చేరుకుంటాడు. యముడు కూడా కొంచెం సంతోషముతో యమలోకానికి చేరుకుంటాడు.
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "రాజా! వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారు ప్రతిరోజూ స్నానం చేసే సమయంలో యమునికి అర్ఘ్యం సమర్పించాలి. వైశాఖ పూర్ణిమ రోజు కానీ, వైశాఖ వ్రతం చివరి రోజు కానీ జలంతో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని ముందుగా యమునకు నివేదించి తరువాత శ్రీమహావిష్ణువుకు సమర్పించాలి. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజించాలి. తరువాత శ్రీమహావిష్ణువు ప్రీతికోసం చల్లని నీరు పెరుగు కలిపిన అన్నాన్ని, దక్షిణతాంబూలాలను, మామిడిపండులో కంచుపాత్రలో ఉంచి పేదవాడైన సద్బ్రాహ్మణునకు దానం చేయాలి. ఆ బ్రాహ్మణుని శక్తికొద్దీ గౌరవించిన శ్రీహరి ప్రీతి చెందుతాడు. అని చెబుతూ తరువాత జరిగిన విషయాలను వివరించాడు.
వేణుడి పాలనలో అంతరించిన వైశాఖ ధర్మాలు
కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యెను. యితడు సర్వధర్మాలను నశింపజేస్తాడు. ఇతని పాలనలో ప్రజలెవరూ వైశాఖ వ్రతాన్ని ఆచరించలేదు. వైశాఖ ధర్మాలు నశించాయి. కేవలం పూర్వజన్మ పుణ్యం ఉన్నవారికి మాత్రమే వైశాఖ వ్రత ధర్మాల పట్ల ఆసక్తి ఉండేది. కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత కారణంగా వేయి మందిలో ఒక్కరికి మాత్రమే విష్ణులోకప్రాప్తి కలిగేది. మిగిలిన వారంతా యమలోకాన్ని చేరడంతో యమధర్మరాజు తన ధర్మాన్ని నిర్వర్తిస్తుండేవాడు. అని శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన విధానాన్ని నారదుడు అంబరీష మహారాజుకు వివరిస్తూ వైశాఖ పురాణం పద్దెనిమిదో అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం 18వ అధ్యాయం సమాప్త.
