Nava Narasimha Temples: నవ నరసింహ క్షేత్రాలు: స్వయంభూ స్వామి దర్శనానికి తొమ్మిది పవిత్ర స్థలాలు
నరసింహావతారంలో స్వామిని పూజించే దేవాలయాలు చాలా ఉన్నప్పటికీ, ఈ తొమ్మిది క్షేత్రాలు స్వయంభూగా వెలసినవిగా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.
1. యాదగిరిగుట్ట (తెలంగాణ)
స్థల పురాణం: పూర్వం యాద రుషి తపస్సు చేయగా, స్వామి ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యారు. యాద రుషి కోరిక మేరకు స్వామి శాంతించి, లక్ష్మీసమేతుడై కొండపై వెలిశారు.
విశిష్టత: ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు.
2. ధర్మపురి (తెలంగాణ)
స్థల పురాణం: కరీంనగర్‌కు సమీపంలో గోదావరి నదీతీరంలో ఉన్న ఈ క్షేత్రంలో, రాక్షస సంహారం తర్వాత స్వామి తపస్సు చేసి యోగానందుడిగా స్వయంభూగా వెలిశాడని చెబుతారు. ధర్మవర్మ అనే రాజు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి ధర్మపురి అని పేరు వచ్చిందని మరో కథనం.
3. అహోబిలం (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: కర్నూలు జిల్లాలోని ఈ క్షేత్రం నవ నరసింహ క్షేత్రాలలో ప్రధానమైనది. హిరణ్యకశిపుని చీల్చి సంహరించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన దేవతలు "అహోబలం" (అద్భుతమైన బలం) అని ఆశ్చర్యపోయారట. అదే పేరు అహోబిలంగా మారిందని పురాణం.
విశిష్టత: ఇక్కడ స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా చూడవచ్చు.
4. సింహాద్రి (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: విశాఖపట్నానికి సమీపంలో కొండపై వెలసిన ఈ ఆలయంలో స్వామివారు వరాహ ముఖం, మానవ ఆకారం, సింహపు తోకతో దర్శనమిస్తారు.
విశిష్టత: ఇక్కడ స్వామిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. ఇతర ఆలయాలకు భిన్నంగా ఈ క్షేత్రం పశ్చిమ ముఖంగా ఉంటుంది.
5. అంతర్వేది (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: హిరణ్యాక్షుడి కుమారుడు రక్తావలోచనుని సంహరించిన తర్వాత, వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో లక్ష్మీనృసింహస్వామిగా వెలిశారని పురాణ గాథ. వశిష్ఠుడు యాగం చేసినందువల్ల ఈ ప్రాంతానికి అంతర్వేది అని పేరు వచ్చిందని చెబుతారు.
విశిష్టత: మాఘమాసంలో ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి.
6. మంగళగిరి (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: గుంటూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో కొండ కింద లక్ష్మీనరసింహస్వామి, కొండపై పానకాల నరసింహస్వామిగా రెండు ఆలయాలు ఉన్నాయి.
విశిష్టత: పానకాల స్వామికి పానకం అంటే చాలా ఇష్టం. స్వామివారికి ఎంత పానకం సమర్పించినా సగం మాత్రమే తాగి మిగతా సగం వదిలేయడం ఈ ఆలయ ప్రధాన విశేషం.
7. వేదాద్రి (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారు జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహస్వామి అవతారాలలో దర్శనమిస్తారు.
8. మాల్యాద్రి (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: ప్రకాశం జిల్లాలోని ఈ ఆలయం ఉన్న కొండ పూలమాల ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ ప్రదేశానికి మాలకొండ లేదా మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని తపస్సు చేయగా స్వామి జ్వాలారూపుడై దర్శనమిచ్చారని పురాణం.
9. పెంచలకోన (ఆంధ్రప్రదేశ్)
స్థల పురాణం: నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో స్వామి చెంచులక్ష్మీ సమేతుడై వెలిశారు. కృతయుగంలో హిరణ్యకశిపుని సంహారం తర్వాత ఉగ్రరూపంలో ఉన్న స్వామిని చెంచులక్ష్మి శాంతింపజేసిందని, అనంతరం ఆమెను వివాహం చేసుకుని ఆమెను పెనవేసుకున్నట్లుగా శిలారూపంలో వెలిశాడని కథనం.
విశిష్టత: ఇక్కడి స్వామిని పెనుశిల లక్ష్మీనృసింహస్వామిగా కూడా కొలుస్తారు.

Comments
Post a Comment