వ్యాధవిముక్తి వృత్తాంతము, దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం
వశిష్ఠుడు మరల ఇట్లనెను, ఓ జనకమహారాజా! వినుము. కార్తిక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను స్నానము చేయించువాడు, పదివేల అశ్వమేధ యాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును బొందును. కార్తికమాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీవ దానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. కార్తికమాసమందు దీపదానము జేసినవారు జ్ఞానమునుబొంది విష్ణులోకమును బొందుదురు. కార్తిక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తినిచేసి బియ్యపు పిండితోగాని, గోధుమపిండితోగాని పాత్రనుజేసి గోఘృతమునుబోసి వత్తినితడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను.
ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగార ముతో పత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈక్రింది మంత్రమును జెప్పుచు. ఆ దీపమును దానము జేయవలెను.
మంత్రార్ధము దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయ కము. కనుకనేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. ఈ దీనివల్ల నాకు నిరంతరముశాంతి గలుగుగాక, ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసమందాచరించిన యెడల అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టినవారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తిక దీపదానమువలన మనోవాక్యాయ ములచేత చేయబడిన తెలిసి తెలియక జేసిన పాపములు నశించును.
పూర్వకాలమున ద్రావిడదేశమందు సుత బంధు విహీనయైనయొక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది. ఎప్పుడు దూషితాన్న మును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసికొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెదిది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది.
ఆ స్త్రీ విష్ణుపాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు. పుణ్యతీర్ధములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారములచేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు. పరులకు పెట్టలేదు.
ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె యింటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని జూచి అయ్యో ఈ చిన్నది అన్యాయముగా నరకమేలపాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియె.
ఛీ మూఢురాలా ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములకు నిలయము, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరు లందుపడిన వర్షబిందువులవలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము.
నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్ట మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మనుకార, అహం కారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానము చేయుము.
కార్తికమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానమ చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహమువలదు.
ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తికవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తికమాసము నెలరోజులుచేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుటచేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది.
కాబట్టి కార్తికమాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్య ప్రదము. కార్తిక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింప జేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా! ఈరహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.
Comments
Post a Comment