నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలో ఏడవ అధ్యాయంలో శ్రుతకీర్తి మహారాజు శ్రుత దేవమహామునుల సంవాదాన్నివివరించిన తీరును ఈ కథనంలో తెలుసుకుందాం.
నారద అంబరీషుల సంవాదం
అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి "మహర్షి! మీరు వివరించిన సత్పురుషుల చరిత్ర ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి పొందిన ధర్మమును మరింత వివరముగా తెలియజేయమని" కోరిన అంబరీషునితో నారదుడు శ్రుతకీర్తి శృతదేవ మహామునుల సంవాదాన్ని ఈ విధంగా వివరించాడు.
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో హేమాంగదుడు ముక్తిని పొందిన ధర్మాన్ని గురించి వివరంగా చెప్పమని కోరగా ముని ఈ విధంగా చెప్పసాగెను. "ఓ శ్రుతకీర్తి మహారాజా!
శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను గురించి తెలుసుకోవాలన్న నీ ఆసక్తి సంతోషం కలిగిస్తోంది. నీవు యువకుడవు రాజాధిరాజువు. జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరిస్తాను శ్రద్ధగా వినుము" అంటూ ఇలా చెప్పెను.
శృతదేవ మహాముని వివరించిన వైశాఖ ధర్మములు
వైశాఖమాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములలోను వైశాఖవ్రత ధర్మం ఉత్తమం, సాటిలేనిది. వైశాఖ ధర్మములు ఎంతో సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. ఈ మాసంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలో చెబుతాను వినుము" అంటూ చెప్పడం ప్రారంభించాడు.
వైశాఖ మాసంలో అన్ని ఆశ్రమముల వారు నీటితో నిండిన పాత్రను దానం చేయుట, చలివేంద్రాలు ఏర్పరచి బాటసారుల దాహార్తిని తీర్చుట పుణ్యప్రదం.
వైశాఖ మాసంలో పావుకోళ్ళు, గొడుగు, విసనకర్ర, శయ్య, పరుపు దానం చేయుట శ్రేయస్కరం.
వైశాఖ మాసంలో నువ్వులతో కూడిన తేనె, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, చెరుకు గడలు, కొబ్బరి నీరు, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము, పానకం దానం చేయడం వల్ల మరుసటి జన్మలో చక్రవర్తులుగా పుడతారు.
వైశాఖ పౌర్ణమి రోజు పులిహోర దానం చేయడం, వైశాఖ మాసంలో ప్రతిరోజూ దధ్యోదనం అంటే పెరుగన్నం దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
వైశాఖ మాసంలో లభించే ఫలపుష్పాలను దానం చేయడం వల్ల విష్ణువు ప్రీతి చెందుతాడు.
ఇలా వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలు గురించి చెప్పిన శృతదేవ మహాముని వైశాఖ మాసంలో పాటించాల్సిన మరికొన్ని నియమాలను కూడా ఇలా వివరించాడు.
వైశాఖ మాసంలో సద్బ్రాహ్మణులను విష్ణు స్వరూపంగా భావించి ఆదరించాలి.
ప్రతిరోజూ సూర్యోదయమునకు ముందుగా స్నానం చేసి శ్రీమహావిష్ణును పూజించి, తరువాత వైశాఖ పురాణ శ్రవణము చేయాలి.
ఈ మాసమంతా అభ్యంగన స్నానం చేయరాదు. అంటే నూనె అంటుకుని తల స్నానం చేయరాదు.
లోహపు పాత్రలలో భుజించరాదు. అరటి ఆకులో, విస్తరాకులో మాత్రమే భోజనము చేయాలి.
సుగంధ పుష్పములతో, ధూపదీపాలతో ప్రతి దినము విష్ణుపూజ చేసి, పండ్లు, పెరుగన్నం నివేదించాలి.
గోవులకు ప్రతిరోజూ గ్రాసం అందించాలి.
సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట ముఖ్యకర్తవ్యములు.
'ఈ విధంగా వైశాఖ మాసంలో శాస్త్రం చెప్పిన దానాలు చేయకుండా, బ్రాహ్మణులను, పండితులను ఆదరించకుండా, వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించక వ్యర్ధంగా కాలక్షేపం చేసేవారు పిశాచ జన్మ ఎత్తుతారు. అలా వైశాఖ వ్రతాన్ని ఆచరించకుండా పిశాచుడైన వారి కథను చెబుతాను జాగ్రత్తగా వినుము' అంటూ శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు చెప్పిన విషయాలను నారదుడు అంబరీషునికి చెబుతూ ఏడవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం సమాప్తం
