పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఆచరించాల్సిన వైశాఖ వ్రతాన్ని గురించి, ఆ వ్రతమహత్యం గురించి వైశాఖ పురాణం 6వ అధ్యాయంలో నారదుడు అంబరీషునికి ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
నారద మహర్షి అంబరీషుల మహారాజుల సంవాదం
శ్రీహరికి వైశాఖ మాసమంటే ఎందుకు అంత ఇష్టమో వివరించిన నారదునికి నమస్కరించి అంబరీషుడు ఇలా అన్నాడు. "ఓ మహర్షి! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరించమని కోరిన అంబరీషుని మాటలకు నారదుడు "ఓ రాజా! వైశాఖ మాసంలో జలదానం విశిష్టతను తెలిపే ఓ రాజు కథను చెబుతాను శ్రద్ధగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
హేమాంగద మహారాజు వృత్తాంతం
పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడను రాజు ఉండేవాడు. అతడు మంచి పరిపాలనా దక్షతతో ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు గొప్ప దానకర్ణుడు. హేమాంగదుడు భూమియందలి ఇసుక రేణువులెన్ని ఉండునో, నీటిలో ఎన్ని జలబిందువులు ఉంటాయో, ఆకాశమున ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని గోవులను దానం చేశాడు. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మొదలగు దానములు విశేషంగా చేసి బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను.
జలదానం చేయని రాజు
కానీ ఎందుచేతనో అతను జలదానం మాత్రం చేయలేదు. జలం చాలా సులభంగా దొరికేది కదా! దానిని దానం ఇవ్వడం ఏమిటని అతనికి ఒక చిన్నచూపు ఉండేది. ఇక్ష్వాకు వంశ కులగురువు అయిన వశిష్ఠుడు రాజుకు ఎన్నో సార్లు జలదానం చేయమని చెప్పిన అతను పట్టించుకోలేదు.
అపాత్రదానం
అంతేకాదు హేమాంగదుడు ఉత్తమమైన, పండితులైన బ్రాహ్మణులని విడిచిపెట్టి వికలాంగులు, పేదవారిని, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. వారికే దానాలు ఇచ్చేవాడు. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఎన్నడూ ఆదరింపలేదు! గౌరవింపలేదు. అందరూ పండితులను ఆదరిస్తే మిగిలినవారిని ఎవరు చూస్తారని తాను చేసే దానాలన్నీ అర్హత లేనివారికి దానం చేసేవాడు. ఆ దానం పుచ్చుకున్న వారు కూడా వాటి విలువ గ్రహించక పోవడంతో హేమాంగదుడు చేసిన దానాలన్నీ దుర్వినియోగమయ్యేవి. ఈ విధంగా అపాత్రదానం చేసిన హేమాంగదుని కులగురువు వశిష్ఠుడు వైశాఖంలో జలదానం చేయమని ఎన్నోసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది.
చాతక పక్షిగా జననం
ఇలా వైశాఖంలో జలదానం చేయక, చేసిన దానాలు కూడా అపాత్రులకు చేయడం వలన హేమాంగదుడు మరణానంతరం చాతక పక్షిగా జన్మించాడు. చాతక పక్షి అంటే భూమి స్పర్శ తగిలిన నీటి చుక్క తాగితే మరణిస్తుంది. అందుకే ఆ పక్షి ఆకాశం నుంచి పడే వర్షపు చుక్కలు భూమికి తగలక ముందే ఒడిసి పట్టుకుని ప్రాణం నిలుపుకుంటుంది.
ఇతర నీచ జన్మలు
ఇలా చాతక పక్షిగా మూడు సార్లు జన్మించిన హేమాంగదుడు అటు తరువాత గ్రద్దగా, కుక్కగా ఏడుసార్లు జన్మించాడు. చివరకు మిథిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారాజు గృహంలో గోడపై నివసించే బల్లిగా జన్మించి గోడపై ఉండే కీటకములను తింటూ జీవనము గడుపుచుండెను. ఈ విధముగ 87 సంవత్సరముల కాలం గడిచింది.
శ్రుతకీర్తి మహారాజు గృహానికి విచ్చేసిన శ్రుతి దేవ మహాముని
కొంతకాలం గడిచిన తర్వాత శ్రుతకీర్తి మహారాజు గృహానికి శ్రుతదేవమహాముని ఓ వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో వస్తాడు. ప్రయాణ శ్రమతో అలిసిపోయి ఉన్న శ్రుతదేవమహామునిని చూసి శ్రుతకీర్తి మహారాజు అతనికి ఎదురెళ్లి సగౌరవంగా తీసుకు వచ్చి అతనికి సకల ఉపచారాలు చేసి అతని పాదాలు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుంటాడు.
బల్లిపై పడిన నీటి తుంపరలు
దైవవశాత్తు శ్రుతకీర్తి మహారాజు తన శిరసుపై చల్లుకున్న నీటి తుంపర్లలో కొన్ని బిందువులు గోడపై ఉన్న బల్లిపై పడుతాయి. మహర్షి పాదస్పర్శతో పునీతమైన ఆ నీటి తుంపరలు పడగానే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషములు తెలిసివచ్చి పశ్చాత్తాపం కలుగుతుంది. 'నన్ను రక్షింపుము, 'నన్ను రక్షింపుము' అంటూ మానవునివలె ఆ మునిని ప్రార్థించెను.
శ్రుత దేవ మహాముని విస్మయం
బల్లి మానవుని వలే మాట్లాడడం చూసి విస్మయం చెందిన శ్రుతదేవమహాముని బల్లితో 'నీవు ఎవరు? నీకు ఈ గతి పట్టడానికి కారణమేంటి? నీకు ఈ కష్టం రావడానికి కారణం ఏంటో చెబితే నీకు సహాయం చేస్తాను' అని అంటాడు.
తన వృత్తాంతం చెప్పిన హేమాంగదుడు
శ్రుతదేవుని మాటలను విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగదమహారాజు "మహాత్మా! నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. లెక్కలు మిక్కిలిగా దానాలు చేశాను. ధర్మముగా రాజ్యమును పాలించితిని. కానీ నేను ఎన్ని దానధర్మాలు చేసినా మూడుసార్లు చాతకపక్షిగా, ఏడూ సార్లు గ్రద్దగా, కుక్కగా జన్మించాను. ఇప్పుడు బల్లిగా జన్మించాను. ఇంకను ఈ బల్లిగా ఇరవై ఏడు జన్మలు ఎత్తాల్సి ఉంది. శ్రుతకీర్తి మహారాజు మీ పాదాలు కడిగిన జలం శిరస్సున చల్లుకునే క్రమంలో ఆ నీటి తుంపరలు పడి నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నేను చేసిన పాపమేమిటో, నాకు ఈ జన్మలు ఎందుకు కలుగుతున్నాయో వివరించి నా పాపాలు పోయే మార్గం తెలిపి పుణ్యం కట్టుకోండి" అని బల్లి రూపంలో ఉన్న హేమాంగదుడు శృతదేవ మహామునిని ప్రార్థించెను.
దివ్యదృష్టితో హేమాంగదుని వృత్తాంతం తెలుసుకున్న ముని
శృతదేవ మహాముని తన దివ్యదృష్టితో హేమాంగదుని వృత్తాంతం తెలుసుకుని హేమాంగదునితో "ఓ రాజా! నీవు ఎన్నో దానాలు చేశావు కానీ శ్రీమహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసంలో ఎవరికీ జలదానం చేయలేదు. జలమంటే ఊరికే దొరికేది కదా అన్న చులకన భావంతో నువ్వు దానం చేయలేదు. అలాగే బ్రాహ్మణోత్తములను, పండితులను విడిచి పెట్టి అయోగ్యులకు అపాత్రదానం చేశావు. అందుకు ఫలితంగానే నీకు ఈ జన్మలు కలిగాయి. సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినా ప్రయోజనం లేదు" అని వివరించాడు.
హేమాంగదునికి పుణ్యఫలాన్ని ధారపోసిన ముని
శృతదేవ మహాముని ఇంకను బల్లితో "ఓ హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము ఆచరించలేదు. జలదానం చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. ఈ రోజు నీకు నేను ఆచరించిన వైశాఖ వ్రతం నుంచి కొంత భాగాన్ని దానం చేస్తాను. దానితో నీకు ఉత్తమ గతులు కలుగుతాయని" చెప్పి ఆ ముని తాను ఆచరించిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును హేమాంగదునికి ధారపోసెను.
విష్ణులోకం చేరిన హేమాంగదుడు
శృతదేవ మహాముని ధారపోసిన పుణ్యఫలంతో హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి ఆజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. హేమాంగద మహారాజు పదివేల సంవత్సరాలు దివ్యలోక భోగాలు అనుభవించి, అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగా జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించి వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. వైశాఖ మాసంలో చేయాల్సిన దానధర్మములను శ్రద్దాసక్తులతో భక్తి శ్రద్ధలతో చేసి, సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము పొంది శ్రీమహావిష్ణువు సాయుజ్యము పొందెను.
నారద అంబరీషుల సంవాదం
నారదుడు అంబరీషునితో "ఓ రాజా! చూశావుగా! వైశాఖ వ్రతఫలం ఎంతటి గొప్పదో! కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము" అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరిస్తూ ఆరో అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం 6వ అధ్యాయం సమాప్తం
