శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో ఇలా చెప్పసాగాడు. పూర్వం మా తండ్రిగారు మరణానంతరం రేవా నదీతీరంలో పిశాచ రూపంలో నీడలేని ఒక బూరుగు చెట్టు కింద నివసిస్తూ ఉండేవాడు.
దీనస్థితిలో పిశాచం
చేసిన పాపకర్మల వలన పిశాచ రూపం పొందిన మా తండ్రిగారు తన ఆకలి దప్పికలతో తన మాంసం తానే తింటూ శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు కింద నివసిస్తూ ఉండేవాడు. తీవ్రమైన ఆకలి దప్పికలచేత అతని కంఠంలో సన్నని రంధ్రం ఏర్పడింది. ఈ కారణం చేత అతను చెరువులోని చల్లని నీరు త్రాగినా కూడా అది కాలకూట విషమువలె బాధించుచుండెను.
గంగాయాత్రకు బయలు దేరిన శృతదేవ మహాముని
శృతదేవ మహాముని తన తండ్రి దీనగాథను ఇంకను ఇలా వివరిస్తూ 'నేను గంగాయాత్రకు చేయాలన్న కోరికతో బయలుదేరి దైవవశాత్తు నా తండ్రి పిశాచ రూపంలో ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. నీడలేని బూరుగు చెట్టు వద్ద ఉంటూ ఆకలిదప్పికల బాధను భరింపలేక తన మాంసం తానే తింటూ దుఃఖభారమున, కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి ఇదేమి అద్భుతమా! అని అబ్బురపడితిని.
మునిపై దాడి చేయబోయిన పిశాచం
పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్ను ఏమి చేయలేకపోయాడు. నేనును వానిని చూసి జాలిపడి 'ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు? నీకు ఈ పిశాచ రూపం కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్ను ఈ కష్టం నుంచి కాపాడుతాను అని చెప్పాను. ఆ పిశాచం నేనతని పుత్రుడనని గుర్తింపలేదు. నాకు కూడా ఆ పిశాచం నా తండ్రి అని తెలియలేదు.
తన వృత్తాంతం తెలిపిన పిశాచం
అప్పుడు పిశాచం రూపంలో ఉన్న మా తండ్రిగారు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. 'నేను భూవరమను పట్టణమున నివసించే వాడను. నా పేరు మైత్రుడు. నేను సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున ఎవరికీ అన్నదానం చేయలేదు. లోభంతో ఇంటికి వచ్చిన వారికిని భిక్షమునైన ఇయ్యలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. నాకు శ్రుతదేవుడను పుత్రుడు కలడు. అతడు సకల శాస్త్రములు నేర్చిన ధర్మాత్ముడు. గొప్ప పండితుడు. నేను వైశాఖమున అన్నదానము చేయక ఇలా పిశాచరూపంలో దురవస్థలో ఉన్నానని నా కుమారునికి తెలియజేయుము. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి, సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ పిశాచ జన్మ నుంచి విముక్తి పొంది శ్రీమహావిష్ణు సాన్నిధ్యమును పొందగలను. కావున దయచేసి నా వివరాలు నా పుత్రునికి తెలుపుము. అని దీనంగా ప్రార్థిస్తున్న నా తండ్రిని గుర్తించి అతని పాదములకు నమస్కరించి అక్కడే కొంతకాలం ఉన్నాను. నా తండ్రికి పిశాచ రూపం ఎలా పోతుందో తెలిపామని ప్రార్థించాను.
పుత్రునికి వైశాఖ వ్రతమహత్యం తెలిపిన పిశాచం
నేను అతని పుత్రుని అని తెలుసుకుని నా తండ్రి ఎంతో సంతోషించాడు. దుఃఖిస్తున్న నన్ను ఓదార్చి 'నాయనా! నీవు తలపెట్టిన గంగాయాత్ర పూర్తిచేసికొని యింటికి పొమ్ము. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ వ్రతమును చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఆ అన్నాన్ని ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును.' అని చెప్పగా నేను నా యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి నా తండ్రి చెప్పినట్లుగా మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేసి శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.
కావున "ఓ మహారాజా! వైశాఖంలో అన్నదానం శ్రేష్టమైనది. నీవు ఇంకను ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడుగు చెబుతాను' అంటూ శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెబుతూ ఎనిమిదవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం
