అంబరీష మహారాజుకు నారదుడు శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదాన్ని ఈ విధంగా తెలియజేసాడు.
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం
శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజు "ఓ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు కేవలం జలదానం చేయకపోవుట వలన చాతక పక్షిగా, గ్రద్దగా, బలిగా జన్మించాడు. కానీ అతను సజ్జనులను ఆదరించకపోయినా ఎన్నో పుణ్యకార్యాలు, యజ్ఞయాగాదులు కూడా చేసాడు కదా..! మరి ఆ పుణ్యఫలమంతా ఏమైంది? హేమాంగదుడు పరులను పీడించలేదు కదా మరి అతనికి శునక జన్మలు ఎందుకు ప్రాప్తించాయి ? దయచేసి వివరించండి"...! అని ప్రార్థించగా శృతదేవ మహాముని శ్రుతకీర్తికి ఈ విధంగా చెప్పసాగెను.
శృతదేవ మహాముని శృతకీర్తితో "రాజా! ఈ విషయములు కైలాసంలో పార్వతికి పరమశివుడు వివరించినవి. వారి మాటలలోనే నీ సందేహానికి సమాధానాలు కలవు. శ్రద్ధగా వినుము" అంటూ చెప్పసాగెను.
శివపార్వతుల సంవాదం
కైలాసంలో పరమ శివుడు పార్వతితో "పార్వతి! భగవంతుడు సృష్టించిన లోకంలో ఇహలోక సుఖస్థితి, పరలోక సుఖస్థితి అని రెండు కలవు. అందులో ఇహలోక సుఖస్థితి కోసం జలదానం వంటివి పనికి వస్తే పరలోక సుఖస్థితి పొందాలంటే సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవ అనే మూడింటిని తప్పక ఆచరించాలి. సజ్జనులకు అప్రియమైనవి చేస్తే అరిష్టం జరుగును. ఇందుకు ఉదాహరణగా ఓ కథను చెబుతాను విను" అంటూ శివుడు పార్వతికి చెప్పసాగెను.
దక్షయజ్ఞం
దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి శివుని ఇల్లాలు. శివుడు స్మశానవాసి అని, పుర్రెల మాల ధరిస్తాడని. బూడిద పూసుకుంటాడని దక్షునికి శివుడంటే చిన్నచూపు. ఒకసారి దక్షప్రజాపతి అపూర్వమైన యాగాన్ని తలపెట్టాడు. శివుని యజ్ఞానికి ఆహ్వానించడానికి దక్షుడు కైలాసానికి వెళ్తాడు. శాస్త్రం ప్రకారం పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానమైనా, దేవదేవుడగు శివుడు దక్షుని చూసి లేచి నిలబడితే అది దక్షునికి శ్రేయస్సు కాదు. ఈ విషయం తెలియని అజ్ఞానంతో దక్షుడు తనను చూసి కూడా శివుడు లేచి నిలబడలేదని ఆగ్రహిస్తాడు. దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. అనేకవిధాలుగా శివుని నిందించి వారిని యజ్ఞానికి ఆహ్వానించకుండానే వెళ్లిపోయాడు.
యజ్ఞానికి విచ్చేసిన సకల దేవతలు
యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినా పరమేశ్వరుని నిందిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరు దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు ఇలా ఒకరేమి, అందరూ దక్షుని యజ్ఞానికి వచ్చారు.
ఆహ్వానం లేకుండా దక్షయజ్ఞానికి వెళ్లిన సతీదేవి
పుణ్యాత్మురాలాగు సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞం చూడాలని, యజ్ఞానికి వచ్చిన బంధువులను చూడాలని తపించింది. యజ్ఞానికి వెళదామని శివుని ప్రాధేయపడింది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళితే అవమానమని ఎంత చెప్పినా వినకుండా సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్లాలని పట్టుబడుతుంది. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి పార్వతికి ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్లాయి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.
దక్షయజ్ఞంలో సతీదేవికి ఘోర అవమానం
యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు పలకరించలేదు. దానిని సతిదేవిని గమనించి కూడా భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక వద్దకు పోయెను. తండ్రితో పాటు అక్కడ ఉన్న పరివార జనులు కూడా సతీదేవిని పలకరింపక మౌనంగా ఉండిరి. దక్షుడు యజ్ఞములో హవిస్సులు ఇచ్చే సమయంలో పరమశివుని ఉద్దేశించి చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలకు మాత్రం హవిస్సులను సమర్పిస్తాడు.
సతీదేవి దుఃఖం
తండ్రి చేసిన అకృత్యమును గమనించిన సతీదేవి కన్నీళ్లతో "తండ్రి! ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. నీవు చేసిన ఈ అవమానము నీకు శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త-లోకభర్త. అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇవ్వకపోవడం సమంజసం కాదు. ఈ పాడు బుద్ధి నీకే పుట్టిందా లేక ఎవరైనా ప్రేరేపించారా! అని సతీదేవి పలికెను.
శివనింద చేసిన సభాసదులు
సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి, మరికొందరు మహర్షులు సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. దక్షుడు కూడా సతీదేవిని, శివుని అనేక రకాలుగా నిందించెను.
సతీదేవి దేహత్యాగం
రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి తన భర్త అయిన శివనింద విన్నందుకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞవేదికలోని అగ్నికుండములోకి దూకి అగ్నికి ఆహుతి అయ్యి శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకు సతీదేవి ప్రాణత్యాగం గురించి తెలిపారు.
పార్వతికి పరమ శివుడు చెబుతున్న కథను ఇక్కడవరకు చెప్పి శృతదేవ మహాముని ముగించాడు. ఈ విషయాలను నారదుడు అంబరీషునికి వివరిస్తూ తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం
