శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో కైలాసంలో పార్వతి పరమేశ్వరుల సంవాదాన్ని ఈ విధంగా తెలిపాడు. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన సంగతి ప్రమథగణాలు పరుగుపరుగున వెళ్లి పరమశివునికి తెలిపారు.
వీరభద్రుని ఉద్భవం
ఆగ్రహించిన పరమ శివుడు తన జటాజూటం నుంచి ఒక జటను తీసి నేలకేసి కొట్టగా వీరభద్రుడు ఉద్భవించాడు. వేయిబాహువులు, మహాబలశాలియైన వీరభద్రుడు పరమేశ్వరునకు నమస్కరించి తనను సృష్టించిన కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు శివుడు దక్షయజ్ఞంలో శివనింద జరిగిందని, అది సహింపలేని సతీదేవి దేహత్యాగం చేసింది కాబట్టి వెంటనే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయమని ఆదేశించాడు.
దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వీరభద్రుడు
పరమేశ్వరుని ఆజ్ఞ అనుసరించి వీరభద్రుడు ప్రమథగణాలు, శివ పరివారంతో కలిసి వెళ్లి దక్షయజ్ఞశాలకు చేరుకొని యజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. యజ్ఞానికి విచ్చేసి శివనింద చేసిన వారిని, శివనింద చేస్తుంటే విన్న సకల దేవతలను, రాక్షసులను, మహావీరులను చితక్కొడతారు. సతీదేవిని చూసి పరిహసించిన శివుని దంతాలను విరగ్గొట్టారు. దక్షుని శిరస్సును ఖండించడానికి వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు దక్షుని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధంగా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడివారిని తగురీతిలో శిక్షించి పరమశివుడు తన పరివారంతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు.
బ్రహ్మను శరణు వేడిన దేవతలు
ప్రాణాలతో బతికి బట్టకట్టిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి శరణు వేడుతారు. బ్రహ్మ వారందరిని తీసుకొని కైలాసానికి వెళ్లి ఆగ్రహంతో ఉన్న రుద్రుని పరిపరి విధాలా స్తుతించి శివునితో గలసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరూ శివుని అనుగ్రహంతో తిరిగి జీవించారు. పరమ శివుడు దక్షుని గర్వభంగానికి గుర్తుగా అతనికి మేక ముఖాన్ని అమర్చెను. గడ్డం దువ్వి సతీదేవిని పరిహసించిన భృగు మహర్షి శివుని ఆగ్రహంతో గడ్డము కోల్పోగా శివుడు మహర్షికి మేక గడ్డాన్ని తెచ్చి అమర్చాడు. సతిదేవుని చూసి నవ్విన పాపానికి దంతాలు కోల్పోయిన సూర్యునికి మాత్రం శివుడు దంతాలు తిరిగి ఇవ్వలేదు. కానీ మెత్తని పిండి మాత్రం తినే శక్తిని సూర్యునికి ఇచ్చాడు. యజ్ఞశాల యీ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందెను. యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరల చేసి పూర్తి చేసిరి.
తపోదీక్షలో మునిగిన శివుడు
శివుడు మాత్రం యజ్ఞశాలను వీడి సతీదేవి వియోగంతో దుఃఖంతో గంగానది తీరంలోని పున్నాగ వృక్షం కింద తపస్సు చేసుకోసాగాడు.
పార్వతిగా జన్మించిన సతీదేవి
దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనకహిమవంతుల పుత్రికగాజన్మించి హిమాలయాలలో పెరుగుచుండెను.
తారకాసుర సంహారానికి బీజం
ఆ సమయంలో తారకాసురుడనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి శివుని పుత్రునితో తప్ప మరెవ్వరి నుంచి మరణం లేకుండా వరం పొందాడు. భార్య వియోగంతో తపస్సు చేసుకుంటున్న శివునికి పుత్రుడే కలగడని తారకాసురుడు అలాంటి వరం కోరుకుంటాడు. వరగర్వంతో వాడు దేవతలను, ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడు. బ్రహ్మాది దేవతలు శివపార్వతుల కల్యాణానికి నాంది పలకడానికి సమావేశమవుతారు.
శివుని సేవకు పార్వతి
నారదుని హిమవంతుని వద్దకు పంపి గతజన్మలో శివుని పత్ని సతీదేవి ఈ జన్మలో హిమవంతుని ఇంట పెరిగే పార్వతి అని, ఆమెకు శివునికి కళ్యాణం జరిగితే వారికి జన్మించే పుత్రుని వలన తారకాసుర సంహారం జరగగలదని వివరిస్తారు. హిమవంతుడు పార్వతిని శివుని సేవించమని చెబుతాడు.
మన్మధుని ప్రేరేపించినా దేవతలు
శివుని మనసులో ప్రేమబీజాలు నాటేలా చేయమని దేవతలు మన్మధుని ప్రేరేపిస్తారు. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞ పాటించి మిత్రుడగు వసంతునితోను, భార్యయగు రతీదేవితోను, మలయానిలాది పరివారముతోను శివుడున్న తపోభూమికి పోయెను.
అకాల వసంతం
శివుడు తపస్సు చేస్తున్న తపోభూమిలో అకాల వసంతం వ్యాపించెను. అదే సమయంలో శివుని సేవించడానికి ఫలపుష్పాలతో పార్వతి వస్తుంది. పార్వతితో సంభాషిస్తున్న శివుని చూసిన మన్మధుడు శివపార్వతుల సమాగమమునకు ఇదియే తగిన సమయమని తలచెను.
శివునిపై మన్మధ బాణప్రయోగం
మన్మధుడు శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండి ఒక పూల బాణాన్ని శివునిపై ప్రయోగించెను.
చలించిన శివుని మనసు
అకారణంగా తన మనస్సు చలించడం గ్రహించిన శివుడు అందుకు కారణం ఏమిటా అని ఆలోచించి రెండవ బాణాన్ని ప్రయోగిస్తున్న మన్మధుని చూస్తాడు. మన్మధుని బాణంతో కామవికారం కలిగిన శివుడు పార్వతిపై నుంచి దృష్టి మరల్చి ఆగ్రహంతో మన్మధునిపై ఆ నిటలాక్షుడు తన మూడవ కన్నును తెరచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని, అతని ధనుర్బాణములతో సహా దహించెను.
పరుగులు తీసిన దేవతలు
జరిగింది చూసి తాము తలపెట్టిన కార్యం ఏమవుతుందో అన్ని భయపడి దేవతలు పరుగులు తీశారు.
ఇక్కడవరకు చెప్పిన శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! మన్మధుడు చేసిన పని దేవతలకు, శివునకు యిష్టమే అయినను మన్మధునకు మాత్రం అనర్ధం జరిగింది. ఇక్ష్వాకు వంశమువాడైన హేమాంగదుడు సత్పురుషులను, సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితము కలిగించాడు. అంగ వైకల్యము కలవారిని, అప్రసిద్ధులను ఆదరించి, అపాత్రదానం చేసి గౌరవించుటచే శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్యకర్తవ్యము. అనాధల పట్ల దయజాలి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలయునని శ్రుతదేవుడు వివరించెను. పరమశివునికి అయిష్టమైన పని చేయుటచే మన్మధుడు తరువాతి జన్మలలో బాధలుపడెను." కావున పరమాత్మకు ప్రీతికరమైన సజ్జన సత్పురుషులను విస్మరించరాదని" శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించాడు.
ఈ కథను ఇక్కడవరకు చెప్పి నారదుడు వైశాఖ పురాణం పదవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పదవ అధ్యాయం సమాప్తం
