వైశాఖ మాసం శుక్ల పక్షంలో 11వ రోజును మోహిని ఏకాదశిగా వ్యవహరిస్తారు.ఈ రోజున శ్రీమహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించాడు కనుక ఈ రోజును మోహినీ ఏకాదశి అంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. లోక కల్యాణం కోసం విష్ణువు దాల్చిన అత్యంత అందమైన అవతారం జగన్మోహిని అవతారం.
మోహిని అవతారం దశావతారాలలో కనిపించకపోయినా విష్ణు 21 అవతారాలలో కనబడుతుంది. కలియుగ నాయకుడైన వేంకటేశుని బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజున మోహినీ అవతారంలో శ్రీవారు విహరించడం కనబడుతుంది.
ఉపవాస దీక్ష
మోహినీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అత్యంత ముఖ్యమని పెద్దలు సూచించారు. రోజంతా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండడం అనేక శుభాలు జరుగుతాయి. ఈ రోజున వైష్ణవాలయాలు భక్తులతో కళకళలాడుతుంటాయి. మోహినీ ఏకాదశి ముందురోజు దశమి నాటి సూర్యాస్తమయంనుండి ఉపవాస దీక్ష ప్రారంభించాలి. బ్రహ్మ ముహూర్తం లోనే నిద్రలేచి అభ్యంగనం ఆచరించిన తర్వాతే పూజ ప్రారంభించాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు సూర్యోదయం తర్వాత పాలు సేవించి ఉపవాస దీక్ష విరమించాలి. అనగా దశమి సాయంత్రంనుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఉపవాస దీక్ష చేయాలి. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి మధ్య రాత్రి సమయంలో జాగరణ చేయాలి. ఈరోజున దాన ధర్మాలు చేయడం వలన విషేశ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు పూజలో విష్ణు సహస్ర నామాలు పఠనం చేయడం శ్రేష్ఠం. వివాహం ఆలస్యమవుతున్నవారు ఈ రోజున విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
2026: ఏప్రిల్ 27
