కనగల్ శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – స్థల పురాణం, ఉత్సవ షెడ్యూల్

ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కనగల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబైంది. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈసారి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించడంతో, స్వామివారి కల్యాణోత్సవాన్ని పాల్గుణ బహుళ పాడ్యమి (ఈ నెల 4వ తేదీ)న నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

2026 బ్రహ్మోత్సవాల కార్యక్రమాల వివరాలు

  • మార్చి 2వ తేదీ – ధ్వజారోహణం, గరుడపూజ
  • 4వ తేదీ – శ్రీ స్వామివారి కల్యాణోత్సవం
  • 5వ తేదీ రాత్రి – రథోత్సవం
  • 6వ తేదీ – రథసేవ
  • మార్చి  7వ తేదీ – శ్రీ పుష్పయాగం, ఏకాంతసేవతో ఉత్సవాల ముగింపు

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

స్థల పురాణం

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పూర్వకాలంలో కుందూరు దేశాయుల పాలనలో నిర్మితమైనదని స్థానికుల కథనం. ఒకసారి కనగల్ గ్రామం మీదుగా ప్రయాణిస్తున్న కుందూరు రాజు రాత్రివేళ ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాత్రి రాజుగారి కలలో వేణుగోపాలస్వామి ప్రత్యక్షమై “ఇక్కడే నాకు ఆలయం నిర్మించాలి” అని ఆజ్ఞాపించాడట. ఆ దివ్యదర్శనంతో ప్రేరణ పొందిన రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పురాణగాథ చెబుతోంది.

కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరినప్పటికీ, అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న అక్కినేపల్లి వంశస్థులు ఆలయాన్ని పునర్నిర్మించి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

ఎలా చేరుకోవాలి?

ఈ దివ్యక్షేత్రం నల్గొండ పట్టణానికి సుమారు 20 కి.మీ. దూరంలో, నల్గొండ–దేవరకొండ ప్రధాన రహదారిపై కనగల్ గ్రామంలో ఉంది. నల్గొండ నుంచి దేవరకొండ, చండూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు కనగల్ రహదారి కూడలి మీదుగా ప్రయాణిస్తాయి. అక్కడి నుంచి ఆటోలు, ఇతర స్థానిక వాహనాల ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

No comments