Sri Raghavendra Swamy Jayanti: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురువైభోత్సవాలు 2026: సన్యాసాశ్రమ స్వీకారం, జయంతి


విజయనగర సామ్రాజ్య ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వీణాగాన గాంధర్వ విద్యలో ప్రఖ్యాతి గాంచిన గురువు కృష్ణాచార్యులు. వారి వంశంలో కనకాచల భట్టు, ఆయన కుమారుడు తిమ్మాణ్ణాచార్యులు. తిమ్మాణ్ణాచార్యుల ధర్మపత్ని గోపమ్మ. వీరి ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.

తరతరాలుగా విజయనగరంలో నివసించిన ఈ వంశం, తళ్లికోట యుద్ధం (1565) అనంతరం ధర్మరక్షణ క్షీణించడంతో విజయనగరాన్ని విడిచి చోళరాజ్యంలోని కాంచీపురం పట్టణ అగ్రహారానికి వలస వెళ్లింది. వీరి కుటుంబంలో కూతురు వెంకటమ్మ కుమారుడు గురురాజు. ఈ దంపతులు మరొక పుత్రసంతానం కోరి పరమభక్తితో వేంకటేశ్వరుని ప్రార్థించారు.

వారి భక్తికి మెచ్చిన శ్రీవేంకటేశ్వరస్వామి తేజోమండల స్వరూపంగా స్వప్నదర్శనం ఇచ్చి ఆశీర్వదించగా, ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం రోజున గోపమ్మ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశించే మగ శిశువుకు జన్మనిచ్చింది. అతనికి వెంకటనాథుడు అనే నామకరణం చేశారు.

బాల్యంలోని దివ్య లక్షణాలు

వెంకటనాథుడు బాల్యంలోనే అసామాన్య ప్రతిభ కనబరిచాడు. అతని మాటల్లో లోతైన ఆధ్యాత్మికత కనిపించేది. మూడేళ్ల వయసులో అక్షరాభ్యాసం సమయంలో పలకపై “ఓం” రాసి దిద్దమంటే — “ఈ ఒక్క అక్షరం నారాయణ స్వరూపం ఎలా అవుతుంది?” — అని ప్రశ్నించడంతో పండితులు సైతం ఆశ్చర్యపోయారు. ఇతడు దివ్యాంశ సంభూతుడని భావించారు.

గురురాజుకు ఉపనయనం జరిగిన కొద్దికాలానికే తిమ్మాణ్ణాచార్యులు పరమపదించారు. కుటుంబ బాధ్యతలు గురురాజుపై పడ్డాయి. తమ్ముడు వెంకటనాథుని బావ లక్ష్మీనరసింహాచార్యుల వద్ద విద్యాభ్యాసానికి పంపారు.

విద్యాభ్యాసం – గృహస్థాశ్రమం

వెంకటనాథుడు సమస్త శాస్త్రాలు, నిత్యకర్మానుష్ఠానాలు, వీణావాదనలో ప్రావీణ్యం సంపాదించాడు. తరువాత సరస్వతి అనే సద్గుణసంపన్నురాలితో వివాహం జరిగింది. వీరికి లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించాడు.

సరస్వతీ కటాక్షం ఉన్నా, లక్ష్మీ కటాక్షం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పౌరోహిత్యం చేస్తూ, పిల్లలకు పాఠాలు చెబుతూ కష్టజీవితం గడిపారు.

కుంభకోణం ప్రయాణం

జీవితంలో మార్పు కోసం వెంకటనాథుడు కుటుంబంతో కలిసి కుంభకోణం చేరి మహాయతివరుడు సుధీంద్ర తీర్థులు సన్నిధికి వెళ్లాడు. ఆయన వెంకటనాథుని ప్రతిభను గుర్తించి మఠంలో ఆశ్రయం ఇచ్చారు.

మఠపూజలు, శాస్త్రచర్చల్లో పాల్గొంటూ వెంకటనాథుడు గొప్ప పాండిత్యాన్ని చాటాడు. సర్వజ్ఞ పీఠాన్ని దర్శించడానికి వచ్చిన పండితులందరూ అతని జ్ఞానానికి ముగ్ధులయ్యారు.

పీఠాధిపత్యం – దివ్య ఆజ్ఞ

వెంకటనాథుడే వారసుడని సుధీంద్ర తీర్థులు నిర్ణయించారు. అయితే గృహస్థ బాధ్యతల కారణంగా వెంకటనాథుడు మొదట నిరాకరించాడు.

తరువాత శ్రీరాముడు స్వప్నంలో దర్శనమిచ్చి ఆజ్ఞాపించగా, మరుసటి రోజు సరస్వతీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై — “నీవు కారణజన్ముడు, సమాజానికి మార్గదర్శి కావాలి” — అని ఉపదేశించింది.

భార్య సమ్మతితో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించాడు. సుధీంద్ర తీర్థులు సన్యాసదీక్ష ఇచ్చి “శ్రీ రాఘవేంద్ర తీర్థులు” అనే నామం ప్రసాదించారు.

దేశాటన – మహిమలు

రాఘవేంద్రస్వామి మూలరామ విగ్రహాలతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మధ్వసిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అనేక అద్భుత లీలలు ప్రదర్శించారు. రాజులు, నవాబులు సైతం భక్తులయ్యారు.

ఒక నవాబు పరీక్షార్థం మాంసాహారం కప్పి సమర్పించగా, స్వామి తీర్థం చల్లి దాన్ని పండ్లు, మిఠాయిలుగా మార్చారు. నవాబు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు.

స్వామివారి కోరిక మేరకు తుంగభద్ర తీరంలోని మంచాల ప్రాంతాన్ని దానం చేశాడు. అక్కడ ఆశ్రమం స్థాపించి మూలరామ పూజలు ప్రారంభించారు.

ఆ ప్రాంతమే నేడు ప్రసిద్ధ మంత్రాలయంగా వెలుగొందుతోంది.

గురువైభవోత్సవాలు

  • ఫాల్గుణ శుద్ధ విదియ — సన్యాసాశ్రమ స్వీకార దినం
  • ఫాల్గుణ శుద్ధ సప్తమి — శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి

ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మంత్రాలయంలో గురువైభవోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.

2026 గురువైభవోత్సవ తేదీ: ఫిబ్రవరి 24

No comments