Konda Bitragunta Brahmotsavam 2026: కొండబిట్రగుంట బిలకూట ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2026 షెడ్యూల్, ఉత్సవ విశేషాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆరాధ్యదైవంగా, అపార కరుణాసాగరుడిగా ప్రసిద్ధి పొందింది. వైఖానస ఆగమశాస్త్రానుసారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి సుదీర్ఘ ఆనవాయితీ.
ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అనంతరం జరిగే రథోత్సవం నేత్రపర్వంగా భక్తులను అలరిస్తుంది. “ఆపద మొక్కులవాడు”గా ప్రసిద్ధి చెందిన స్వామివారిని దర్శించేందుకు ఉత్సవకాలంలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా గరుడసేవ, మొక్కుబడులు, కళ్యాణోత్సవం రోజుల్లో బిలకూట క్షేత్రం భక్తజనసంద్రంగా మారిపోతుంది.
స్థలపురాణ మహిమ
స్థలపురాణం ప్రకారం సప్త ఋషుల కోపానికి గురైన నారద మహర్షి శాపవిమోచనం కోసం ఈ క్షేత్రంలోని గుహలో తపస్సు చేశాడు. గజేంద్రుని రక్షించేందుకు పరుగున వెళ్లిన మహావిష్ణువు, తిరుగు ప్రయాణంలో నారదుని తపస్సుకు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు.
నారద మహర్షి కోరిక మేరకు విష్ణుమూర్తి ప్రసన్న వదనంతో “ప్రసన్న వెంకటేశ్వర” స్వరూపంలో కొండపై అంగుష్ట ప్రమాణంలో వెలసేందుకు అంగీకరించినట్లు ప్రతీతి. అనంతరం నారద మహర్షి స్వయంగా ప్రతిష్ఠ నిర్వహించాడని స్థలమహిమ చెబుతుంది.
చక్రస్నానం ప్రత్యేకత
ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం విశేష ప్రాధాన్యం పొందింది. ఈ మహోత్సవ సమయంలో స్వామివారిని దర్శిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. వాహనసేవల్లో పాల్గొంటే కోరికలు నెరవేరుతాయని, గరుడసేవలో పాల్గొంటే మోక్షప్రాప్తి కలుగుతుందని పండితులు విశదీకరిస్తారు.
భక్తుల సౌకర్యార్థం:
- భారీ చలువపందిర్లు
- చలివేంద్రాలు
- తాగునీటి సదుపాయాలు
రాత్రివేళల్లో విద్యుద్దీపాల అలంకరణతో బిలకూట కొండ దివ్య కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
2026 బ్రహ్మోత్సవాల షెడ్యూల్
బిలకూట క్షేత్రంపై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26, 2026 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా సేవల వివరాలు:
ఫిబ్రవరి 26 – గిరి ప్రదక్షిణ, అంకురార్పణ
ఫిబ్రవరి 27 – తిరుమంజనం, ధ్వజారోహణం (కొడి ముద్దలు), శేష వాహన సేవ
ఫిబ్రవరి 28 – చందన అలంకరణ, హనుమాన్ వాహన సేవ
మార్చి 01 – మోహినీ ఉత్సవం, గరుడ వాహన సేవ
మార్చి 02 – మొక్కుబడులు, గజ వాహన సేవ
మార్చి 03 – కళ్యాణోత్సవం, వసంతోత్సవం
మార్చి 04 – రథోత్సవం, తెప్పోత్సవం
మార్చి 05 – సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ
మార్చి 06 – కల్పవృక్ష వాహన సేవ, అశ్వ వాహన సేవ
మార్చి 07 – చక్రస్నానం, ధ్వజావరోహణం
మార్చి 08 – పుష్పయాగం, ఏకాంత సేవ

Post a Comment