Jubilee Hills Peddamma Temple: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం 2026 – చరిత్ర, రథోత్సవం, పూజా వివరాలు

ముగ్గురమ్మల మూలపుటమ్మగా, కొలిచే వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లిగా భక్తుల నమ్మకం పొందిన జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. మొక్కు పెట్టిన వెంటనే ఫలితం లభిస్తుందన్న విశ్వాసంతో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో ఆలయం భక్తులతో నిండిపోతుంది. పెళ్లి కానివారు, సంతానలేమి, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా అమ్మవారిని ఆశ్రయిస్తున్నారు. కాలక్రమేణా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని పంచుతోంది.

ఆలయ చరిత్ర

పౌరాణిక గాథల ప్రకారం ప్రజలను పీడిస్తున్న రాక్షసులను సంహరించేందుకు వచ్చిన శక్తి స్వరూపిణి పెద్దమ్మ తల్లి, అప్పట్లో కొండలు, గుట్టలతో నిండిన (నేటి జూబ్లీహిల్స్) ప్రాంతంలోని ఒక బావి వద్ద సేదతీరుతూ అక్కడే కొలువుదీరినట్లు పండితులు చెబుతున్నారు. ఆ సమయంలోనే అమ్మవారి చిన్న విగ్రహం అక్కడ వెలిసిందని చరిత్ర చెబుతోంది.

అమ్మవారి విగ్రహం ఉన్న విషయం గమనించిన గిరిజనులు అక్కడ చిన్న గుడిసె ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అనంతరం అది క్రమంగా చిన్న ఆలయంగా మారింది. చుట్టూ అడవిలా ఉండటంతో అప్పట్లో చాలామంది ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయపడేవారు. ఆదివారం, మంగళవారం రోజుల్లో కొందరు ఉదయాన్నే వచ్చి వనభోజనాలు చేసుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేవారు.

భక్తుల సంఖ్య పెరగడంతో 1994లో హంపి శంకరాచార్యుల ఆధ్వర్యంలో, బిజ్జుమళ్ల సిద్ధాంతి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారు. పీజేఆర్ ఏ శుభకార్యం చేసినా ముందుగా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.

జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో జనసంచారం పెరిగి, ఆలయ విస్తరణ కూడా జరిగింది. నేడు ఆలయంలోని కట్టడాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ప్రధాన గోపురంపై శిల్పకళ ఉట్టిపడుతుండగా, ఆలయం ముందు మధురై నుంచి తెప్పించిన దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

2026 వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు

ఈనెల 23న:

  • ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లి అభిషేకం, మంత్రపుష్పం
  • విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం
  • యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం
  • అఖండ దీపారాధన, వేదపారాయణం
  • నవగ్రహ జపములు, రుద్రాభిషేకం
  • సాయంత్రం ఉత్సవ మూర్తి పల్లకి సేవ

ఈనెల 24న:

  • మండప పూజలు, వేదపారాయణం
  • ఆరుణ, పంచోపనిషత్, దేవీ భాగవత, మహావిద్య
  • చండీ పారాయణం
  • సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చనలు

రథసప్తమి ప్రత్యేక రథోత్సవం

మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున పెద్దమ్మ తల్లి ఆలయంలో రథోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహం రథసప్తమి రోజునే ప్రతిష్ఠించబడిన నేపథ్యంలో, ప్రతి ఏడాది ఉత్సవ మూర్తిని రథంపై ప్రతిష్టించి పలు వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడడం ప్రత్యేక ఆకర్షణ.

  • ఈనెల 25న రథోత్సవం
  • ఈనెల 26న పుష్కరిణిలో అవభృత స్నానంతో వార్షికోత్సవాల ముగింపు

No comments