Magha Month Importance: మాఘమాసం వ్రతాలు, పర్వదినాలు, విశిష్టతలు
చంద్రుడు మఘ నక్షత్రంలో ఉండే మాసాన్ని మాఘమాసం అంటారు. “మఘం” అనే పదానికి యజ్ఞం అనే అర్థం ఉంది. యజ్ఞాలు, యాగాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనదని పండితులు చెబుతారు. అలాగే “అఘం” అంటే పాపం, మాఘం అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థం కూడా ఉంది. ఈ మాసం మాధవ ప్రీతికరం అని శాస్త్రవచనం.
మాఘస్నానం – మాస ధర్మం
మాఘమాసంలో ముఖ్యంగా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానం చేయడం వ్రతంగా భావిస్తారు.
నది, చెరువు, కొలను, మడుగు, బావి వంటి జలాశయాలలో స్నానం చేస్తే ప్రయాగ స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి.
ఈ మాసంలో:
- ఉదయాన్నే దీపారాధన
- నువ్వులతో హోమం
- తిలదానం
- తిల భక్షణం
చేయడం ఎంతో శ్రేయస్కరమని గ్రంథాలు సూచిస్తున్నాయి.
శుక్ల పక్ష తిథుల విశేషాలు
- శుద్ధ విదియ: బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. పార్వతీ పూజ, లలితావ్రతం, హరతృతీయ వ్రతం చేస్తారు.
- శుద్ధ చవితి: ఉమాపూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చేయాలి. మొల్ల పువ్వులతో శివపూజ, తిలదానం గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తాయి.
- శుద్ధ పంచమి (శ్రీపంచమి): సరస్వతీ పూజ చేయడం విశేషం. దీనినే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవంగా జరుపుకుంటారు.
- శుద్ధ షష్టి: విశోక షష్టి, మందార షష్టి, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజు వరుణదేవుని ఎర్రచందనం, ఎర్ర వస్త్రాలు, పుష్పాలతో పూజిస్తారు.
- శుద్ధ సప్తమి (రథసప్తమి): సూర్య జన్మోత్సవం. రథసప్తమి వ్రతం అత్యంత విశిష్టమైనది.
- శుద్ధ అష్టమి: భీష్మాష్టమి. ఈ రోజు భీష్ముడికి తర్పణం విడవాలి.
- శుద్ధ నవమి: నందినీ దేవి పూజ. దీనినే మధ్వనవమి అంటారు.
- శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి. ఈ రోజున భీష్మ ఏకాదశి వ్రతం చేస్తారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది.
- శుద్ధ ద్వాదశి: వరాహ ద్వాదశీ వ్రతం.
- శుద్ధ త్రయోదశి: విశ్వకర్మ జయంతి.
- మాఘ పూర్ణిమ: అత్యంత పవిత్రమైన తిథి. కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో, ప్రయాగలో త్రివేణీ సంగమంలో స్నానం విశేష ఫలదాయకం. ఈ తిథినే సతీదేవి జన్మదినంగా కూడా చెబుతారు.
కృష్ణ పక్ష తిథుల విశేషాలు
- కృష్ణ పాడ్యమి: సౌభాగ్య ప్రాప్తి వ్రతం
- కృష్ణ సప్తమి: సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్య వ్రతాలు
- కృష్ణ అష్టమి: మంగళా వ్రతం
- కృష్ణ ఏకాదశి: విజయ ఏకాదశి – రామసేతు నిర్మాణం పూర్తయిన రోజుగా భావిస్తారు
- కృష్ణ ద్వాదశి: తిల ద్వాదశీ వ్రతం
- కృష్ణ త్రయోదశి: ద్వాపర యుగాది
- కృష్ణ చతుర్దశి: మహాశివరాత్రి పర్వదినం
- కృష్ణ అమావాస్య: పితృశ్రాద్ధం చేయడం అత్యంత ఫలప్రదం
మాఘమాసం మహిమ
ఇలా మాఘమాసంలో అనేక వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతల పూజలు ఉంటాయి. అందుకే ఈ మాసానికి పూర్వకాలం నుంచే అత్యంత విశిష్టత ఉంది.

Post a Comment