నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస మహత్యాన్ని ఇంకను ఇలా వివరించసాగాడు. "ఓ రాజా! యుగాలలో కృత యుగం, మాసాలలో వైశాఖ మాసం, దానాలలో జలదానం, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం శ్రేష్టమైనవి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించని వారు మరుజన్మలో పిశాచులై పుడతారు.
ఈ ఒక్క దానం అన్ని పుణ్యాలతో సమానం
వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును. వైశాఖ మాసంలో సకల తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం, ఈ మాసంలో జలదానం చేస్తే వస్తుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండే వైశాఖ మాసంలో జలదానంకు ఎంతో విశిష్టత ఉంది.
జలదానం విశిష్టత
శాస్త్రంలో చెప్పిన అన్ని దానాలు చేసిన ఫలం వైశాఖ మాసంలో ఒక్క జలదానం చేయడంతో వస్తుంది. ఈ మాసంలో బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి జల దానం చేసిన వారి వంశంలోని వారందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. బాటసారులు నడిచే బాట పక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేసిన వారికి సకల దేవతలు, పితృ దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి.
బ్రాహ్మణులు ఇవి దానం చేయాలి
వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలము, గొడుగులు, విసనకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుండను దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు మరుసటి జన్మలో చకోర పక్షిగా జన్మించును.
విసనకర్ర దానం
దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి రాజసూయాగములు చేసిన పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి, బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచారం చేయగలడు. బ్రాహ్మణునకు పవిత్రమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము పొందును.
ఛత్రదానం
వైశాఖ మాసంలో ఛత్రం అంటే గొడుగును దానం చేస్తే ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును.
పాదుకా దానం
వైశాఖమాసంలో పాదుకల దానం, అంటే చెప్పులు దానంగా చేసిన వారికి యమ బాధలుండవు. వారు నేరుగా విష్ణులోకము చేరి చిరకాలం సుఖంగా ఉంటారు. చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి చెప్పులు దానం చేసిన వారు మరుసటి జన్మలో చక్రవర్తి అవుతాడు.
అతిధి దేవోభవ!
వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్న సమయంలో పిలవకుండానే ఇంటికి వచ్చిన అతిధిని ఆదరిస్తే విష్ణువు ప్రీతి చెందుతాడు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకలితో అన్నార్తుడై ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి ఆదరిస్తే బహుపుత్రలాభం కలుగుతుంది. అన్నదానంతో సమానమైన దానము మరొకటి లేదు. ఆకలితో ఉన్నవారికి ఆహరం పెట్టే అన్నదాత తల్లిదండ్రుల కంటే ప్రియమైన బంధువు.
కాబట్టి "ఓ అంబరీష మహారాజా! వైశాఖ మాసంలో జలదానం, ఛత్రదానం, పాదుకలు దానం, అన్నదానం చేసిన వారు సహస్రకల్పముల కాలం పాటు విష్ణులోకాన్ని పొందుతారు" అని నారదుడు వైశాఖ మాసంలో దాన మహత్యాన్ని వివరిస్తూ రెండవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం రెండవ అధ్యాయం సమాప్తం.
.jpg)