పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో 30 రోజుల పారాయణలో భాగంగా మూడవ అధ్యాయంలో వైశాఖ మాస మహత్యం గురించి నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
వైశాఖ పురాణం మూడవ అధ్యాయం
నారదమహర్షి మాటలకు అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి మహర్షీ! వైశాఖమాసమున చేయదగిన దానములు ఇవేనా? ఇంకా ఏమైనా ఉంటే అవి ఏమిటి? వాని ఫలితములను దయచేసి వివరింపుమని కోరెను.
నారద అంబరీషుల సంవాదం
నారదుడు అంబరీషునితో "ఓ అంబరీషా! వైశాఖ మాసంలో చేయాల్సిన దానములు ఇంకను ఉన్నవి చెబుతాను సావధానంగా వినుము" అంటూ ఇట్లు చెప్పసాగెను. ఓ రాజర్షి! వైశాఖమాసంలో సద్బ్రాహ్మణునికి చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించే శయ్య అంటే మంచము దానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇహలోకంలో సమస్త సుఖాలను చిరకాలం అనుభవిస్తారు. అంతేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు.
పరుపు దానం
వైశాఖ మాసంలో మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారి వంశంలో అందరూ చక్రవర్తి సమానులై, శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి చెంది, కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తిని పొందుతారు.
దిండు దానం
సద్బ్రాహ్మణునకు మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చిన వారు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ విధంగా సద్బ్రాహ్మణుని సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత పరోపకారియై, యేడు జన్మల వరకు సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమును పొందుతూ మహావైభవముగా జీవించి తుదకు ముక్తిని పొందును.
చాప దానం
వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి, తుంగ మొదలైన వానిచే తయారు చేసిన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతి చెంది తానే దానియందు శయనించును.
పర్యంక శయ్యా దానము
వైశాఖ మాసంలో ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చుతో తయారు చేసినవి, నీటిలో పడినా తడిసిపోని పర్యంక శయ్యా దానము చేసిన వారికి సంసారం సముద్రములోని కష్టాలు బాధించవు. పర్యంక శయ్యా దానం చేయడానికి శక్తి లేనివారు చాపాను దానం చేయవచ్చు.
కంబళి దానం
వైశాఖమాసమున కంబళి దానం చేసిన వారికి అపమృత్యువు, అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలము నిశ్చింతగా సుఖ జీవనం చేయగలరు.
నారదుడు అంబరీషునితో "ఓ రాజార్షి! వైశాఖ మాసంలో మరికొన్ని దానాలు కూడా శ్రేష్టమైనవి. అవేమిటో చెబుతాను వినుము" అంటూ ఇలా చెప్పసాగెను.
సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమును పొందును.
చల్లదనం కలిగించే చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును.
వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తిని పొందును.
కొబ్బరి కాయలు, మామిడిపండ్లు దానమిచ్చినచో ఏడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడుగా ఏడు తరములవారితో కలిసి ముక్తిని పొందును.
బాటసారులు నడుచు బాట పక్కన తోట, చెరువు, నూయి, మండపము వంటివి నిర్మిస్తే పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది.
వైశాఖ మాసంలో వేసవిలో ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ దానం చేసినవారు విద్యావంతులు, ధనవంతులు అవుతారు.
విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున శాశ్వతంగా నివసిస్తారు.
వైశాఖమాసమున బ్రాహ్మణునకు పానకం దానమిచ్చిన వారు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును.
నారదుడు అంబరీషునితో ఈ విధంగా వైశాఖ మాసంలో చేయాల్సిన దానములను గురించి చెబుతూ మూడవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం మూడవ అధ్యాయం సమాప్తం.
.jpg)