వైశాఖ శుద్ధ తదియను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజునే అక్షయ తృతీయ అని పిలుస్తారు. “అక్షయ” అంటే క్షయం లేకుండా ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండేది అని అర్థం. ఈ రోజు చేసే పూజలు, హోమాలు, దానాలు, పితృతర్పణాలు అనంతమైన పుణ్యఫలాలు అని పురాణాలు వివరిస్తున్నాయి.
2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 20 (సోమవారం) నాడు వస్తుంది.
అక్షయ తృతీయ ప్రత్యేకత
పురాణాల ప్రకారం ఈ రోజున తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం వంటి దోషాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా అది విజయవంతమవుతుందని విశ్వాసం.
మత్స్య పురాణం మరియు భవిష్య పురాణం ప్రకారం, ఈ రోజున చేసిన ప్రతి శుభకార్యం “అక్షయ ఫలితాన్ని” ఇస్తుంది. కృతయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదేనని చెప్పబడింది.
పూజలు మరియు ఆరాధన
ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిసి, అలాగే పరమేశ్వరుడును గౌరీదేవితో కలిసి పూజించడం శ్రేష్ఠంగా భావిస్తారు. ఈ పూజల వల్ల వైకుంఠప్రాప్తి, శివలోకప్రాప్తి లభిస్తాయని శాస్త్రవచనం చెబుతోంది.
కొన్ని ప్రాంతాలలో గౌరీదేవికి డోలోత్సవం, శ్రీకృష్ణుడుకు చందనలేపనం చేసే సంప్రదాయం ఉంది.
దానాల ప్రాముఖ్యత
ఈ రోజున చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. నీటితో నిండిన కుండలు, గోధుమలు, శనగలు, పెరుగు అన్నం వంటి దానాలు చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది.
జలదానం చేయడం ద్వారా సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. అన్నదానం చేయడం వల్ల సమస్త దేవతలను పూజించిన ఫలితం పొందుతారు. వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం వంటి దానాలు శాశ్వత శుభఫలాలను ఇస్తాయి.
మామిడిపండ్లు దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. గొడుగు దానం, విసనకర్ర దానం వంటి ఆచారాలు కూడా ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఉపవాసం మరియు ఆచరణ
ఈ రోజున ఉపవాసం ఉండడం ఎంతో శ్రేష్ఠం. పగటిపూట ఆహారం తీసుకోకుండా, రాత్రి సాత్వికాహారం—పాలు, పండ్లు తీసుకోవడం ఉత్తమంగా భావిస్తారు. ఈ విధంగా ఉపవాసం ఉండడం ద్వారా పూజల ఫలితం మరింత పెరుగుతుందని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది.
బంగారం కొనుగోలు ఎందుకు?
ఈ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి బంగారంలో నివసిస్తుందని విశ్వాసం. అందువల్ల ఈ రోజున పసిడి కొనుగోలు చేయడం ద్వారా ఐశ్వర్యం, సంపద పెరుగుతాయని భావిస్తారు.
ప్రత్యేక సంఘటనలు
ఈ రోజున పరశురాముడు జన్మించాడు. అందువల్ల సాయంత్రం ప్రదోషకాలంలో ఆయనను పూజించడం శ్రేష్ఠం.
పాండవులకు అక్షయ పాత్ర లభించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. దీనివల్ల ఎంతమందికి భోజనం పెట్టినా అది ఎప్పటికీ తక్కువ కాకుండా ఉండేది.
అలాగే సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి జరిగే చందనోత్సవం ఈ రోజునే ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఆ రోజున స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.
అక్షయ తృతీయ అనేది భక్తి, దానం, పూజల ద్వారా జీవితాన్ని శుభమయం చేసుకునే మహత్తర అవకాశం. ఈ రోజున చేసిన చిన్న శుభకార్యమూ అనంత ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం.
.jpg)