విష్ణు ప్రీతి వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారు ఆచరించాల్సిన నియమాలు గురించి నారదుడు అంబరీషునికి ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
అంబరీష నారదుల సంవాదం
అంబరీష మహారాజు నారద మహర్షితో "ఓ మహర్షి! వైశాఖ మాసంలో ఎలాంటి ధర్మాలు ఆచరించాలి వివరించండి" అని కోరగా నారదుడు "అంబరీషమహారాజా! నీ ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వైశాఖ మాసంలో వైశాఖ వ్రతం ఆచరించే వారు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటో చెబుతాను వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
వైశాఖ మాసంలో పాటించాల్సిన ధర్మాలు
నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగన స్నానం చేయరాదు.
పగటిపూట నిద్రించరాదు.
లోహపు పాత్రలలో భుజించరాదు. అంటే అరటిఆకులో కానీ, విస్తరిలో కానీ భుజించాలి.
రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి.
ఉల్లి వెల్లుల్లి, మద్యమాంసాలు, స్త్రీ సంగమం నిషిద్ధం.
భూశయనం చేయాలి.
అని నారదుడు ఈ విధంగా వైశాఖ వ్రతం ఆచరించే వారికి నిషిద్ధ కర్మలు గురించి చెప్పి, ఇక వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఈ విధంగా చెప్పసాగెను.
వైశాఖ మాసంలో నదీస్నానం తప్పకుండా చేయాలి. ఎవరైతే శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానం చేస్తారో వారు గత మూడు జన్మలలో చేసిన పాపములు పరిహరింపబడతాయి.
ప్రాతఃకాలంలో సూర్యోదయ సమయమున సముద్ర స్నానం చేసినవారికి ఏడు జన్మల పాపాలు పోతాయి.
వైశాఖ మాసంలో సూర్యోదయ సమయాన జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి అనే సప్త గంగలలో స్నానం చేసి శ్రీహరిని పూజిస్తే కోటి జన్మల పాపాలు కూడా నశించిపోతాయి.
వైశాఖ మాసంలో దరిద్రుడైనా, ధనవంతుడైనా తమ తమ శక్తి కొద్దీ వైశాఖ వ్రతాన్ని ఆచరించి, సద్బ్రాహ్మణులకు కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, విస్తరాకు, నీరు, మజ్జిగ వంటి ద్రవ్యములు దానం చేస్తే వచ్చే ఫలితం అనంతం. వైశాఖ వ్రతాన్ని ఆచరించగల ఆరోగ్యం, శక్తి ఉండి కూడా ఆచరించని వారు మరుసటి జన్మలో పిశాచులై పుడతారు.
వైశాఖ వ్రత మహత్యం
కాబట్టి పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున నదీ స్నానం చేసి తులసీదళాలతో శ్రీమహావిష్ణువును పూజించి, విష్ణు కధా శ్రవణం చేయువారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు శాస్త్రంలో చెప్పిన దానాలు చేయువారు తమ పరివారంతో కలిసి విష్ణులోకాన్ని చేరుతారు. అయితే వైశాఖ వ్రతం చేయు వారు శ్రీ మహావిష్ణువుపై నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. అని అంబరీషునికి చెబుతూ నారదుడు నాలుగవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం
