పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో భాగంగా ఐదవ అధ్యాయంలో అంబరీష మహారాజు కోరిక మేరకు నారద మహర్షి వైశాఖ మాస ప్రాశస్త్యాన్ని వివరించిన విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
నారద అంబరీషుల సంవాదం
వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరిస్తున్న నారద మహర్షితో అంబరీషుడు "ఓ మహర్షి! కార్తిక మాఘ వైశాఖం అనే మూడు మాసాలలోనూ వైశాఖ మాసం ఉత్తమం అని సెలవిచ్చారు కదా! ఏ కారణం చేత వైశాఖం ఉత్తమమైనదో వివరించండి" అని అడుగగా నారదుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు.
సృష్టికి శ్రీకారం
మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమయ్యే సమయంలో శ్రీమహావిష్ణువు లోకములను తన తన గర్భంలో దాచుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. ఆ సమయంలో వేదములు శ్రీ మహావిష్ణువును యోగ నిద్ర నుంచి మేల్కొలిపాయి. అప్పుడు శ్రీ మహా విష్ణువు తన ఉదరంలో ఉన్న సమస్త ప్రాణికోటికి కర్మఫలాన్ని అందించడానికి తిరిగి సృష్టి ప్రారంభించాలని అనుకున్నాడు. విష్ణువు తలచినంత మాత్రాన్నే ఆయన నాభి నుంచి సృష్టి కార్యం చేయడానికి సువర్ణ పద్మంలో బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనతో పాటు పద్నాలుగు భువనములను కూడ విష్ణువు సృష్టించెను. శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ఆచరించడానికి ఋషులను కూడా సృష్టించెను.
తన సృష్టిని పరీక్షించదలచిన విష్ణువు
ఇలా తాను సృష్టించిన చాతుర్వర్ణ ప్రజలు, సమస్త ప్రాణికోటి ఆచరించే ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయంగా చూడాలని విష్ణువు భావించి భూలోకానికి వెళ్లదలిచాడు. అయితే ఎప్పుడు వెళ్లాలి అనేది ప్రశ్నగా మారింది. అప్పుడు విష్ణువు ఇలా తలపోశాడు.
విష్ణుమూర్తి అంతర్మధనం
"వర్షాకాలంలో ప్రజలు వర్షాల వల్ల తమ ధర్మాచరణ సరిగా చేయలేరు కాబట్టి ఆ సమయంలో వారిని పరీక్షించి వారిపై ఆగ్రహం చెంది శాపమిచ్చుట తగదు కాబట్టి వర్షాకాలం సరైనది కాదు. ఇక శరత్కాలం, హేమంతఋతు కాలం, శిశిరఋతు కాలం కూడా శీతల గాలులతో, దట్టమైన మంచుతెరలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా ప్రజల ధర్మాచరణ పరిశీలనకు సరైన సమయం కాదు" అని తలపోసి విష్ణువు ఆయా రుతువులలో భూలోక ప్రయాణానికి సరైనది కాదని నిశ్చయించుకున్నాడు.
విష్ణు ప్రీతి వైశాఖం
ప్రజల ధర్మాశక్తిని పరీక్షించడానికి అన్నింటికంటే వసంతఋతువు అనువైనది భావించిన శ్రీహరి ఇలా అనుకున్నాడు. 'వైశాఖ మాసం స్నానదానములకు, యాగభోగములకు, ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము. సమస్త ప్రాణికోటి జీవించడానికి అవసరమైన అన్ని ఆహార పదార్థములు సులభంగా లభించే మాసం వైశాఖ మాసం. సకల ధర్మాలు ఆచరించడానికి, సమస్త దానాలు చేయడానికి అనువైన మాసం వైశాఖ మాసం కాబట్టి శ్రీహరి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను.
సంప్రీతుడైన శ్రీహరి
ఫలపుష్పాలతో కూడిన వనాలు, నిర్మలమైన జలాలతో ప్రవహించే నదులు, ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించే ప్రజలు, ధర్మానుష్టానంలో ఉన్న మునులు, యజ్ఞయాగాదులతో పులకించి పోతున్న ఋషుల ఆశ్రమాలు, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరిస్తున్న భక్తులను శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించసాగెను. యధాశక్తి దానధర్మాలు చేస్తూ చేయుచు అతిధి అభ్యాగతులను ఆదరిస్తున్న పుణ్యాత్ములను, కర్మ పరాయణులను చూసి ప్రీతి చెందిన శ్రీ మహావిష్ణువు అందరికీ అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని ఇచ్చి అనుగ్రహించెను.
నారద అంబరీషుల సంవాదం
నారదుడు అంబరీషునితో "ఓ రాజా! లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలతో కుడి ధర్మాచరణ చేస్తున్న ప్రాణికోటిని చూసి సంతోషించి సంతుష్టుడై వరములు ఇచ్చెను. కావున ఓ రాజా! వైశాఖ మాసం సకల ధర్మాచరణకు అనువైన సమయం కాబట్టి, వైశాఖ వ్రతం ఆచరించడానికి అనుకూలంగా కాబట్టి వైసాఖమాస వ్రతం కార్తీక మాఘ మాస వ్రతముల కంటే ఉత్తమమైనది. అందుకే శ్రీహరి చైత్ర వైశాఖ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలలో భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములు, పూజలు చేస్తూ, శక్తి కొద్దీ దానధర్మములు చేయువారిని అనుగ్రహిస్తాడు". అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఐదవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సమాప్తం
