శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ యాజమాన్యం వెల్లడించింది.
ఈ నిర్ణయం మేరకు అంతరాలయ దర్శనానికి టికెట్ ధరను రూ.500గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతరాలయ దర్శనం చేసుకున్న భక్తులకు ఉచితంగా అభిషేక లడ్డూ అందజేయనున్నట్లు వివరించారు. భక్తులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య ఈ దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే, 2026 ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే సంకటహర గణపతి వ్రతాన్ని భక్తుల కోరిక మేరకు గతంలో ఉన్న రెండు విడతల స్థానంలో మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్రత టికెట్ ధరను గతంలో ఉన్న రూ.350 నుంచి రూ.500కు పెంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వ్రతానికి ఒక్కరినే అనుమతించగా, ఇకపై ఇద్దరిని అనుమతించనున్నట్లు తెలిపారు.
సంకటహర గణపతి వ్రతం
- ఉదయం 10–11 గంటలు,
- మధ్యాహ్నం 2–3 గంటలు,
- సాయంత్రం 5–6 గంటల సమయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
