ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు పాంచాహ్నిక దివ్య కల్యాణ మహోత్సవాలు
రాజహేంద్రవరం గోదావరి గట్టున వెలసిన ప్రసిద్ధ శ్రీ ఉమా మార్కండేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి 18వ తేదీ వరకు స్వామివారి పాంచాహ్నిక దివ్య కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ మహోత్సవాలకు సంబంధించి జనవరి 29వ తేదీన పందిరిరాట ముహూర్తం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
2026 మహాశివరాత్రి ఉత్సవాల షెడ్యూల్
ఫిబ్రవరి 14:
సాయంత్రం 3.50 గంటలకు మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 15 (మహాశివరాత్రి):
ఆదివారం తెల్లవారుజామున 1 గంట నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, లక్ష బిల్వార్చన జరగనుంది. అలాగే పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం ధూప ప్రాకార సేవలు, అనంతరం స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
ఫిబ్రవరి 16:
సాయంత్రం సదస్యం, వేదపఠనం, నీరాజనం, పండిత సత్కారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి రథోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షించనుంది.
ఫిబ్రవరి 17:
ఉదయం హోమం, అభిషేకాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక అలంకరణతో స్వామివారి వాహనోత్సవం, ఊంజల్ సేవ జరుగుతాయి.
ఫిబ్రవరి 18:
ఉదయం 6.15 గంటలకు మార్కండేయ ఘాట్లో త్రిశూల స్నానం జరుగుతుంది. రాత్రి 7.40 గంటలకు పుష్పోత్సవంతో మహోత్సవాలు ముగియనున్నాయి.
