Nemaligundla Ranganayaka Swamy Temple Brahmotsavam: నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం – నల్లమల గిరుల పవిత్ర క్షేత్రం, బ్రహ్మోత్సవాలు 2026

ప్రకృతి కాంత రమణీయ సోయగాలకు అలవాలమైన నల్లమల గిరులు మధ్య భక్తుల పాలిట కొంగుబంగారంగా శోభిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం. ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం రాచర్ల మండలం పరిధిలోని జేపీ చెరువు గ్రామానికి పడమటి దిక్కున సుమారు 9 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య ఆవిర్భవించింది.

స్వామివారి పాదాల చెంత ప్రవహించే గుండ్లకమ్మ నది ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి సోయగాలను కూడా అందిస్తుంది. గుండ్లకమ్మ నది గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల గిరుల్లో సుడులు తిరుగుతూ, కొండ కోనలు దాటి నెమలిగుండం వద్ద ప్రవహిస్తుంది. అక్కడి నుంచి వాగులు, వంకల రూపంలో జనావాసాల్లోకి చేరి ప్రజల దాహార్తిని తీర్చే జీవనదిగా మారుతుంది.

అరుదైన క్షేత్ర పవిత్రత

నెమలిగుండంలో మునిగి స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తే అసత్యం పలికిన వారిపై స్వామివారు తిరుగులేని శిక్ష విధిస్తారని స్థానికుల గాఢ విశ్వాసం. ఆ కారణంగా అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు ఎవరికీ నిర్లక్ష్యంగా ప్రమాణాలు చేయనీయరు.

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి, విదియ తిధుల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. లక్ష్మమ్మ వనంలో ఉత్సవమూర్తుల కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది.

ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచీ తరలి వస్తారు. పుట్టువెంట్రుకలు తీయించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. జనావాసాలకు దూరంగా ఉన్నా భక్తులకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన సత్రాలు నిర్వహిస్తారు.

శ్రీ రంగనాయక స్వామి చరిత్ర

నల్లమల అడవిలోని చెంచుగూడెంలో బయన్న–బయక్క దంపతులకు జన్మించిన రంగా అనే యువతి, మహావిష్ణువునే తన వరుడిగా స్వీకరించాలనే సంకల్పంతో గూడెం విడిచి నెమలిగుండం చేరింది. అక్కడ మయూర మహర్షి సన్నిధిలో తన మనోభిలాష వెల్లడించింది.

మహర్షి సూచనతో తపస్సు ఆచరించగా మహావిష్ణువు ప్రత్యక్షమై రంగను భార్యగా స్వీకరించి, మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే శ్రీరంగ పర్వతంపై స్వయంభూ రూపంలో వెలసి భక్తుల ఆరాధ్యదైవంగా నిలిచాడు.

భూలోకానికి వచ్చిన మహావిష్ణువును వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఇక్కడికి చేరి, రంగసమేతుడైన స్వామిని చూసి కినుక వహించి సమీప కొండపై తిష్టవేసిందని విశ్వాసం. అందుకే స్వామివారి దర్శనం ముందు ఆదిలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీ. ఆ ప్రాంతాన్ని “లక్ష్మమ్మ వనం” అని పిలుస్తారు.

మయూర మహర్షి తన ముక్కుపుడముతో తవ్విన గుండం మరుసటి ఉదయానికి జలమయమైందని ప్రతీతి. నెమలి ముఖాకారంతో ఉన్నందున అది “నెమలిగుండం”గా ప్రసిద్ధి చెందింది. స్వయంభూ రూపంలో వెలసిన స్వామివారు “శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి”గా భక్తుల పాలిట వెలుగొందుతున్నారు.

2026 బ్రహ్మోత్సవాల వివరాలు (ఏప్రిల్ 2 – 5)

 బ్రహ్మోత్సవాలు ఈ విధంగా జరుగుతాయి:

ఏప్రిల్ 2: అంకురార్పణ, ధ్వజారోహణం, శేషవాహనం, హనుమంతవాహనం, గజవాహనం
ఏప్రిల్ 3: స్వామివారి కల్యాణోత్సవం, గరుడవాహనం, గజవాహనం
ఏప్రిల్ 4: తెప్పోత్సవం, దివ్య రథోత్సవం
ఏప్రిల్ 5: చక్రస్నానం తదితర కార్యక్రమాలు

ప్రకృతి నడుమ ఆధ్యాత్మికత, విశ్వాసం, పురాణ గాథలు సమ్మిళితమైన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు అపూర్వ అనుభూతిని అందిస్తుంది.

No comments