Kotha Amavasya 2026: ఫాల్గుణ బహుళ అమావాస్య 2026 – కొత్త అమావాస్య, పితృదేవతా ఆరాధన, మత్స్య జయంతి విశేషాలు

పాల్గుణ బహుళ అమావాస్యను “కొత్త అమావాస్య”గా పిలుస్తారు. కొత్త తెలుగు సంవత్సరానికి ముందుగా వచ్చే అమావాస్య కావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. చాంద్రమాన సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. దీని మరుసటి ఉదయం వచ్చే ఉగాదితో నూతన సంవత్సర ఆరంభమవుతుంది.

2026 సంవత్సరంలో కొత్త అమావాస్య – మార్చి 18

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

ఈ అమావాస్య ఆత్మపరిశీలనకు, శుద్ధికి సంకేతం. పాత సంవత్సరానికి ముగింపు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సంధికాలం ఇది. అందుకే కొన్ని క్రతువులు, ఆధ్యాత్మిక సాధనలకు ఈ రోజు అనుకూలంగా భావిస్తారు. సాధకులు ఈ రాత్రిని తాంత్రిక సాధనలకు ఉపయోగించుకుంటారు.

ఈ రోజున దేవతారాధనతో పాటు పితృదేవతల ఆరాధన చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు. పితృతర్పణం, దీపారాధన, దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటాయి.

పరమశివారాధన

శాస్త్రోక్తంగా ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడును భక్తితో ఆరాధించాలి అని చెప్పబడింది. రాత్రివేళ శివనామస్మరణ, రుద్రాభిషేకం, లింగార్చన చేయడం శుభప్రదంగా భావిస్తారు.

 రైతులకు ప్రత్యేక విశ్వాసం

ఈ శుభదినాన ఏరువాక ప్రారంభించే రైతులకు సిరిసంపదలు, పంటలాభాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. అందుకే అన్నదాతలకు ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.

గ్రామదేవతల ఉత్సవాలు

కొత్త అమావాస్య సందర్భంగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పంచభూతాలను ఆరాధించే విధానంలో గ్రామదేవతల పూజకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయుల జీవన విధానంలో గ్రామదేవతలు ఒక అవిభాజ్య భాగం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంస్కృతి.

నీటి వనరుల శుద్ధి – మత్స్య సంబంధం

ఈ అమావాస్యకు మత్స్యంతో అనుబంధం ఉన్నదనే విశ్వాసంతో చెరువులు, సరస్సులు, నదులు వంటి నీటి వనరులను శుభ్రపరచడం శ్రేయస్కరం అని చెబుతారు. ప్రకృతి పరిరక్షణకు ఇది సంకేతం.

ఇక సమీపంలో వచ్చే మత్స్య జయంతిను దృష్టిలో ఉంచుకుని, ఈ రోజు నుంచే మత్స్యావతార వర్ణనలు చదవడం, మత్స్య పురాణం పారాయణం ప్రారంభించి జయంతి నాటికి ముగించడం శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల పాపచింతనలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం.

ఈ రోజు చేయదగినవి

  • దేవ, పితృ ఆరాధనలు
  • అన్నదానం
  • ఒక పూట ఉపవాసం
  • శివారాధన
  • గ్రామదేవతల పూజ
  • నీటి వనరుల శుద్ధి
  • మత్స్య పురాణ పారాయణ ప్రారంభం

No comments