Kommala Lakshmi Narasimha Swamy Temple: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2026, చరిత్ర, విశేషాలు, జాతర

వరంగల్ మహానగరానికి సుమారు 15 కి.మీ దూరంలో, వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై కొమ్మాల సమీపంలో ఈ పవిత్ర క్షేత్రం సుందరంగా దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక మహిమతో పాటు చారిత్రక విశిష్టతను కలిగిన ఈ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది.

స్వయంభు క్షేత్ర మహిమ

సుమారు 50 అడుగుల ఎత్తైన రాతిగుట్టపై రాతి గుహలో స్వామివారు స్వయంగా వెలిసినట్లు పురాణ విశ్వాసం ఉంది. దాదాపు 700 ఏళ్లుగా ఇక్కడ జాతర కొనసాగుతున్నట్లు వంశపారంపర్య అర్చకులు చెబుతున్నారు.
స్థలపురాణం ప్రకారం పాండవులు స్వామివారిని ఇలవేల్పుగా కొలిచినట్లు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి కూడా స్వామివారి కల్యాణోత్సవానికి హాజరయ్యేదని ప్రతీతి.

ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి 2 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

500 ఏళ్ల నాటి రథం – ఆలయ వైభవ చిహ్నం

సుమారు 500 ఏళ్ల క్రితం రాతి చక్రాలతో నిర్మించిన ఐదంతస్తుల మహారథం ఈ ఆలయ ప్రాచీన వైశిష్ట్యానికి నిదర్శనం. బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులను అశ్వ, హనుమ, సింహ, ఏనుగు, శేష వాహనాలపై ఆసీనులుగా ఉంచి ఈ రథంపై ఆలయ గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.
రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి పాల్గొనడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ.

బ్రహ్మోత్సవాల వివరాలు

ఫిబ్రవరి 23 నుండి మార్చి 9 వరకు పక్షం రోజులపాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

  • ఫిబ్రవరి 23 – అధ్యయనోత్సవం
  • 24 – ప్రబంధసేవ
  • 25 – నిత్యవిధి, పరమపదోత్సవం
  • 26 – అంకురారోపణం, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం
  • 27 – రాత్రి 10 గంటలకు కల్యాణోత్సవం
  • ఫిబ్రవరి 28 – హనుమత్సేవ, వాహనసేవ
  • మార్చి 1 – నిత్యహోమం, సింహవాహన సేవ
  • 2 – గరుడవాహన సేవ, పర్వతబలి
  • 3 – శకటయానోత్సవం, జాతర
  • 4–6 – మొక్కుబడులు, వాహనసేవలు, అర్చనలు
  • 7 – రథోత్సవం
  • 8 – పారువేట, పుష్పయాగం, నాగవెల్లి
  • మార్చి 9 – శతఘటాభిషేకం, పండిత సన్మానాలు

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం ద్వారా

  • వరంగల్ నుండి సుమారు 15 కి.మీ దూరంలో ఉంది.
  • వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై కొమ్మాల గ్రామ సమీపంలో ఆలయ ప్రధాన ద్వారం కనిపిస్తుంది.
  • వరంగల్ నుండి తరచుగా బస్సులు, ఆటోలు, క్యాబ్ సౌకర్యాలు లభిస్తాయి.
  • స్వంత వాహనంతో కూడా సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా

  • సమీప రైల్వే స్టేషన్: వరంగల్ రైల్వే స్టేషన్
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 30–40 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

No comments