Uyyuru Veeramma Talli Tirunallu 2026: ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు 2026 – మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల ఉత్సవాలు, గండదీపాలు, సిడిబండి వైభవం

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే కాకుండా, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్ల సందర్భంగా ఉయ్యూరు పట్టణం మాత్రమే కాకుండా, పరిసర గ్రామాల్లోని ఇళ్లు బంధుమిత్రులు, స్నేహితులతో సందడిగా మారతాయి.

మెట్టినింటి నుంచి ఉత్సవ ఆలయానికి అమ్మవారు

ఈ నెల 28వ తేదీ రాత్రి అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరి, 29వ తేదీ రాత్రికి ఉత్సవ ఆలయాన్ని చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరమ్మతల్లి, చింతయ్య విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

పోలీసు శాఖ సంప్రదాయం

తిరునాళ్ల ప్రారంభ రోజు అమ్మవారికి పోలీసు శాఖ తరఫున ప్రథమ పసుపు–కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్ అధికారి దంపతులు స్టేషన్‌లో పూజలు నిర్వహించి, అనంతరం డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.
ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేస్తారు.

గండదీపాల మొక్కులు

అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరిన సమయం నుంచి ఉత్సవ ఆలయ ప్రవేశం వరకు వేలాది మంది భక్తులు గండదీపాల మొక్కులు తీర్చుకుంటారు.
మొదటి రోజు ఎదురు గండదీపాలు, రెండో రోజు వరకు అమ్మవారితో గ్రామోత్సవంలో పాల్గొనే వారు తిరుగుడు గండదీపాల మొక్కులు చెల్లిస్తారు.
అమ్మవారు రెండో రోజు ఉత్సవ ఆలయంలో ప్రవేశించడానికి ముందు ఊయల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు లక్ష మంది వరకు భక్తులు హాజరవుతారని అంచనా.

ఫిబ్రవరి 7న సిడిబండి ఉత్సవం

తిరునాళ్లలో భాగంగా 11వ రోజు సాయంత్రం (ఫిబ్రవరి 7) ఆలయ ప్రాంగణంలో ప్రసిద్ధమైన సిడిబండి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శివాలయం రోడ్డులోని పాత ట్యాంకు వద్ద సిడిబండిని తయారు చేసి, ఊరేగింపుగా ఉత్సవ ఆలయానికి తీసుకొస్తారు. అనంతరం పట్టణంలోని ఎస్సీవాడకు చెందిన త్వరలో వివాహం కాబోయే యువకుడిని సిడిబండి గంపలో కూర్చోపెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఈ సమయంలో ఆ యువకుడిని అరటికాయలతో కొట్టడం సంప్రదాయం.
ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Comments