Tirumala Rathasaptami: తిరుమల రథసప్తమి 2026: ఏడు వాహనాల సేవల సమయాలు, ఆర్జిత సేవల మార్పులు
సూర్య జయంతిని పురస్కరించుకుని జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు ఒకే రోజున ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రమైన మాఘమాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమిగా పిలుస్తారు. ఈ అత్యంత పుణ్యదినాన శ్రీ సూర్యదేవుడు అవతరించి లోకానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాలు పేర్కొంటున్నాయి. రథసప్తమిని “మినీ బ్రహ్మోత్సవాలు”గా కూడా అభివర్ణిస్తారు. ఈ పర్వదినానికి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానుండటంతో, టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వాహన సేవల షెడ్యూల్
- ఉదయం 5.30 నుంచి 8.00 వరకు (సూర్యోదయం ఉదయం 6.45కి) – సూర్యప్రభ వాహనం
- ఉదయం 9.00 నుంచి 10.00 వరకు – చిన్నశేష వాహనం
- ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు – గరుడ వాహనం
- మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 వరకు – హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు – చక్రస్నానం
- సాయంత్రం 4.00 నుంచి 5.00 వరకు – కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6.00 నుంచి 7.00 వరకు – సర్వభూపాల వాహనం
- రాత్రి 8.00 నుంచి 9.00 వరకు – చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు – మార్పులు
రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అయితే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించబడతాయి.

Post a Comment