Shattilla Ekadasi: షట్తిల ఏకాదశి 2026 – తిల స్నానం, తర్పణం, దానం మహత్యం
పుష్య మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్తిల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు నువ్వులతో చేసే ఆచారాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది.
ఈ రోజు తలస్నానం చేసేటప్పుడు ముందుగా నువ్వుల పిండిని శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. స్నానానంతరం తిల తర్పణం వదలాలి.
తెల్ల నువ్వులతో దేవతలకు నివేదన, నల్ల నువ్వులతో పితృ దేవతలకు తర్పణం అర్పించాలి.
నువ్వులను నీటిలో వేసి ఆ నీటిని ప్రసాదంగా సేవించాలి. ఒక రాగి లేదా కంచు పాత్రలో నువ్వులు పోసి దానం చేయాలి. నువ్వులను దేవునికి నివేదించి, అందరికీ నువ్వుల ప్రసాదం పంచాలి.
ఏకాదశి వ్రతం పూర్తి చేసిన తరువాత నువ్వుల ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని పక్కన ఉంచాలి. ద్వాదశి రోజున పారణ అనంతరం ఆ ప్రసాదాన్ని భుజించాలి.
షట్తిల ఏకాదశి పేరు వెనుక కారణం
“షట్” అంటే ఆరు, “తిల” అంటే నువ్వులు.
షట్తిల ఏకాదశి రోజున నువ్వులతో ఆరు విశిష్ట కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అనే పేరు వచ్చింది.
నువ్వులతో చేయవలసిన ఆరు ముఖ్య కార్యక్రమాలు
-
తిలాస్నానం – నువ్వులతో స్నానం చేయడం
-
స్నానానంతరం నువ్వుల చూర్ణాన్ని శరీరానికి పట్టించడం
-
ఇంటిలో తిల హోమం నిర్వహించడం
-
పితృ దేవతలకు తిల ఉదకం (తర్పణం) సమర్పించడం
-
నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం
-
చివరగా తిలాన్నం భుజించడం
(బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేసి చేసిన అన్నమే తిలాన్నం)

Post a Comment