Naina Devi Temple: నైనీతాల్ నైనా దేవి ఆలయం – శక్తి పీఠం, నేత్రవ్యాధి నివారణ క్షేత్రం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అందమైన పర్వత ప్రాంతమైన నైనీతాల్‌లో నైనా దేవి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయం శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నైనా దేవిని దర్శించుకుంటే ఎలాంటి నేత్ర సంబంధిత వ్యాధులైనా నయమవుతాయనే అచంచల విశ్వాసం భక్తుల్లో ఉంది.

నైనా దేవి ఆలయ పౌరాణిక నేపథ్యం

వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం, దక్ష ప్రజాపతి తన యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని, ఆమె భర్త శివుడిని ఆహ్వానించలేదు. శివుడు వారించినప్పటికీ, పుట్టింటి మీద మమకారంతో సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ శివనిందను భరించలేక, తనకు మరియు తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. అనంతరం సతీదేవి శరీరంతో తాండవం చేయగా, లోకక్షేమార్థం విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండ ఖండాలుగా విభజించాడు. ఆ శరీర భాగాలు భూమిపై పడిన ప్రాంతాలే శక్తి పీఠాలుగా అవతరించాయి.

సతీదేవి నేత్రం పడిన ప్రదేశంలో వెలసిన ఆలయమే నైనా దేవి ఆలయం. ‘నైనా’ అంటే కళ్ళు అని అర్థం కావడంతో, ఈ దేవతను నైనా దేవిగా పూజిస్తారు.

ఆలయ విశేషాలు

  • నైనా దేవి ఆలయం నైనీతాల్ సరస్సుకు ఉత్తర భాగంలో కొలువై ఉంది.
  • నైనా దేవి నైనీతాల్ ప్రజల ప్రధాన ఆరాధ్య దేవత.
  • గర్భాలయంలో నైనా దేవి, గణేశుడు, అమ్మవారి మరో రూపమైన కాళీ దేవి దర్శనమిస్తారు.

మనోభీష్టాలు నెరవేర్చే ఎర్రని వస్త్రం

నైనా దేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా విస్తరించి ఉంటుంది. అమ్మవారి పూజలో ఉపయోగించి ఇచ్చిన ఎర్రని వస్త్రాన్ని ఈ చెట్టుకు కడితే మనోభీష్టాలు నెరవేరుతాయనే విశ్వాసం ఉంది.

బంగారు నేత్రాల సమర్పణ

నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడే భక్తులు నైనా దేవిని దర్శించుకుని మొక్కుకున్న తరువాత వ్యాధి నయమైతే అమ్మవారికి బంగారు నేత్రాలను సమర్పించడం ఇక్కడి సంప్రదాయం.

ఉత్సవాలు – వేడుకలు

  • ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నంద అష్టమి రోజున నైనా దేవి మహోత్సవం ప్రారంభమవుతుంది.
  • ఈ ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి.
  • ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో నైనా దేవిని ఉయ్యాలలో ఆలయ ప్రాంగణంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
  • ఐదు రోజుల పూజల అనంతరం ఉయ్యాలను నగరం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లి రాత్రి నైనీతాల్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.
  • ఈ సందర్భంగా సమీప మైదానంలో నైనా దేవి జాతర నిర్వహిస్తారు.
  • ఈ జాతరకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు నైనీతాల్‌కు తరలివస్తారు.
  • అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతాయి.

ఎలా చేరుకోవాలి?

  • దిల్లీ → కత్గోడం వరకు రైలులో ప్రయాణించాలి
  • అక్కడి నుంచి టాక్సీ లేదా బస్సులో సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి నైనీతాల్‌కు చేరుకోవచ్చు

No comments