Magha Month: మాఘమాసం 2026 – తిధులు, పూజలు, స్నానాలు, మహాశివరాత్రి ప్రత్యేకతలు
హిందూ కేలండర్ ప్రకారం మాఘ మాసం 11వ నెల. “మాఘం” అనే సంస్కృత పదానికి పాపాలను హరించే మాసం అనే అర్థం ఉంది. అందుకే ఈ మాసానికి శాస్త్ర, పురాణాలలో అత్యంత ప్రాధాన్యం కలదు.
మాఘ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. పల్లకీ ఆకారంలో ఉండే అయిదు నక్షత్రాల మండలంలో ముఖ నక్షత్రం ముఖ్యమైనది. ఆ ముఖ నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు చంద్రుడు పూర్ణకళలతో ప్రకాశిస్తాడు. అందుకే ఈ మాసానికి “మాఘ మాసం” అనే నామం వచ్చిందని శాస్త్రోక్తి.
ఈ మాసంలో సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. ఈ మాసానికి అధిష్ఠాన దేవత శ్రీ వినాయకుడు. మాఘమాసంలో వినాయక ఆరాధన చేయడం సర్వవిఘ్ననాశినిగా భావిస్తారు.
మాఘ స్నాన మహిమ
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో, మాఘ మాసంలో నది లేదా సముద్ర స్నానాలకు అంతటి ప్రాధాన్యం ఉంది.
ఈ మాసంలో సూర్యుని కిరణాలు భూమిపై ఉన్న జలాలను తేజోమయంగా మారుస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి.
మాఘమాసంలో చేసే
- నది స్నానాలు
- సముద్ర స్నానాలు
ప్రత్యేకంగా అరుణోదయ స్నానం సంపూర్ణ ఆరోగ్యం, తేజస్సు, శక్తిని ప్రసాదిస్తుందని విశ్వాసం.
పవిత్ర తీర్థాలలో మాఘ స్నానం
శ్రీ కాళహస్తి స్వర్ణముఖి నది, రామేశ్వరం సేతు సంగమం, ప్రయాగ త్రివేణీ సంగమం వంటి పవిత్ర తీర్థాలలో చేసే మాఘస్నానాలు పుణ్యబలంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తాయి.
ఎక్కడైనా గంగానదిలో స్నానం చేస్తే అది కురుక్షేత్ర సమాన పుణ్యఫలం ఇస్తుంది.
వింధ్యవాసినిలో చేస్తే పది రెట్లు, కాశీలో చేస్తే నూరు రెట్లు పుణ్యం లభిస్తుందని పురాణోక్తి.
మాఘ మాస దాన ధర్మాలు
ఈ మాసంలో
- తిల దానం
- సాలిగ్రామ దానం
- వేణి దానం
మాఘ శుద్ధ పక్ష తిథుల ప్రాముఖ్యత
శుద్ధ తదియ
శివజగదంబలకు ప్రీతికరం.
ఈ రోజున లవణం, బెల్లం దానం చేయాలి.
శుద్ధ చతుర్థి
శ్రాద్ధ కర్మలకు శుభదినం.
తిలచతుర్థి అని కూడా అంటారు.
ఒకపూట భోజనం చేసి, తిలలతో శివపూజ చేస్తే సంపదలు కలుగుతాయి.
శుద్ధ పంచమి
మదన పంచమి, శ్రీ పంచమిగా ప్రసిద్ధి.
తెల్లని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మి, సరస్వతి దేవిని పూజించాలి.
శుద్ధ సప్తమి
రథసప్తమి / సూర్య జయంతి.
జన్మజన్మల పాపాలను నశింపజేసే తిథి.
ఈ రోజు సముద్ర స్నానం శ్రేష్ఠం.
శుద్ధ అష్టమి
భీష్మ అష్టమి.
ఈ రోజు చేసే తిలతర్పణం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుంది.
శుద్ధ ఏకాదశి
భీష్మ పంచక వ్రతం,
విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.
త్రిపద్మ వ్రతం చేస్తే సుఖజీవనం లభిస్తుంది.
శుద్ధ ద్వాదశి
వరహ ద్వాదశి.
ఈ రోజున విష్ణు ఆరాధన శుభప్రదం.
శుద్ధ త్రయోదశి
వరాహ వ్రతకల్పం ఆచరిస్తే శుభఫలాలు కలుగుతాయి.
పౌర్ణమి
నువ్వులు, వస్త్రం, పాత్రలు దానం చేయాలి.
మాఘ బహుళ పక్ష విశేషాలు
బహుళ ద్వాదశి
తిల ద్వాదశిగా ప్రసిద్ధి.
శివ, కేశవ, పితృ దేవతలకు ప్రీతికరం.
తిల స్నానం చేసి, శ్రీహరిని అర్చించి, తర్పణాలు చేస్తే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
బహుళ చతుర్దశి
మహాశివరాత్రి పర్వదినం.
పుష్కర స్నానం, రుద్రాభిషేకం, బిల్వార్చన మహా పుణ్యప్రదం.
సోమవారంతో కూడిన చతుర్దశి అత్యంత ఉత్తమం.
శివనామ స్మరణ ముక్తిప్రదం.
వసంత ఋతువు ఆరంభం
ఈ మాసంలోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతి కొత్త అందాలతో, పుష్ప పరిమళాలతో ముస్తాబవుతుంది. ఇది ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉత్తమమైన కాలం.

Post a Comment