Jaya Ekadasi: జయ ఏకాదశి 2026 – భీష్మ ఏకాదశి విశిష్టత, పూజా విధానం, ఉపవాస మహిమ

 

మాఘమాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని జయ ఏకాదశి అంటారు. పురాణాల్లో ఈ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇదే తిథిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతంలోని మహావీరుడు భీష్ముడు మోక్షం పొందిన పవిత్ర దినం కావడం వల్ల ఈ ఏకాదశికి విశేష గౌరవం ఉంది.

ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తే పాప విముక్తి కలుగుతుందని, మోక్ష మార్గం సుగమమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి.

జయ ఏకాదశి పూజా విధానం

  • తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి శుభ్రత చేసుకోవాలి.
  • అనంతరం తలస్నానం చేసి పూజా గదిని శుభ్రంగా అలంకరించాలి.
  • ఏకాదశి రోజున శ్రీమహావిష్ణు పూజకు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.

పూజాగదిలో పీట ఏర్పాటు చేసి శ్రీ విష్ణుమూర్తిలక్ష్మీదేవి, వీలైతే శ్రీకృష్ణుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలి.

  • పసుపు, కుంకుమ, గంధం, పూలతో ప్రతిమలను అలంకరించాలి.
  • నైవేద్యం సమర్పించి, శుద్ధి చేసిన వెన్నతో దీపారాధన చేయాలి.
  • తులసి ఆకులతో మాల అలంకరణ చేయవచ్చు. అయితే ఏకాదశి నాడు తులసి ఆకులు కోయరాదు, కాబట్టి ముందురోజే సిద్ధం చేసుకోవాలి.
  • అనంతరం “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  • వీలైతే విష్ణు చాలీసా పఠించాలి.
  • చివరగా హారతి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి.
  • ఈ రోజున ఉపవాసం చేయడం అత్యంత శుభకరమని పండితులు సూచిస్తున్నారు.

జయ ఏకాదశి విశిష్టత – పురాణ కథ

పురాణాల ప్రకారం, ఒకసారి దేవతలు స్వర్గలోకంలోని నందనవనంలో మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఋషులందరినీ ఆహ్వానించారు. ఆ సందర్భంలో గంధర్వ బాలికల నృత్య–గాన కార్యక్రమాలు జరిగాయి.

ఆ వేడుకలో పుష్యవతి అనే నర్తకి, మాల్యవాన్ అనే గంధర్వుడిని ఇష్టపడింది. ఉత్సవంలో ఉన్నామని కూడా మరచి, ఇద్దరూ తమ పరిమితులను దాటి ప్రవర్తించారు. ఇది గమనించిన ఇంద్రదేవుడు కోపించి,  “ఇక మీకు స్వర్గలోకంలో స్థానం లేదు. పిశాచ లోకంలో విహరించండి”
అని వారిని శపించాడు.

అనంతరం వారు హిమాలయ పర్వత శ్రేణుల్లో పిశాచ రూపాలలో సంచరించారు. తమ తప్పుకు పశ్చాత్తాపపడి మోక్షం కోరగా, నారద మహర్షి వారికి మాఘమాస శుక్ల పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని ధ్యానించమని సూచించాడు.

నారదుని ఉపదేశం ప్రకారం వారు జయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుపూజ చేయడంతో
పిశాచ శాపం నుంచి విముక్తి పొందారు మోక్షాన్ని సాధించారు.

జయ ఏకాదశి ఫలితం

  • ఈ రోజున భక్తితో శ్రీమహావిష్ణువును పూజిస్తే పాప విముక్తి,  పూర్వీకులకు శాంతి, వైకుంఠ ప్రాప్తి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
  • పిశాచ లోకంలో సంచరించే పితృదేవతలకు కూడా సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.

2026 తేదీ

  • జయ ఏకాదశి: జనవరి 29, 2026 (మాఘమాస శుక్ల పక్ష ఏకాదశి)

No comments