Bhishma Ashtami: భీష్మాష్టమి 2026 – తేదీ, ఆచరణ విధానం, తర్పణం, దానాలు




వ్యాసమహర్షి రచించిన పద్మ పురాణం – హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి విశేష వివరణ పొందుపరచబడింది. దాని ప్రకారం మాఘ శుక్లపక్ష అష్టమి భీష్మ పితామహుని నిర్యాణ దినంగా భావిస్తారు.

వ్రతోత్సవ చంద్రిక గ్రంథం ప్రకారం, భీష్మాష్టమి భారతదేశమంతటా ఆచరించవలసిన మహత్తర పర్వదినం.

భీష్మ ప్రతిజ్ఞ – త్యాగానికి ప్రతిరూపం

శంతన మహారాజు, గంగాదేవి పుత్రుడే భీష్ముడు. స్వచ్ఛంద మరణ వరం పొందిన మహానుభావుడు. తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్య వ్రతం పాటించిన త్యాగధనుడు.
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరఫున యుద్ధం చేసి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఉండి, మాఘ శుద్ధ అష్టమి రోజున తన శరీరాన్ని విడిచిన మహావీరుడు భీష్మ పితామహుడు.

పంచప్రాణాల విశేషం

భారత యుద్ధంలో తీవ్రంగా గాయపడిన భీష్ముడు, దక్షిణాయనంలో ప్రాణత్యాగం చేయక, ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై ఉండాడు.
మాఘ శుక్ల సప్తమి నుంచి ఐదు రోజుల పాటు రోజుకొక ప్రాణాన్ని విడిచాడని పురాణ కథనం.
భీష్ముడు మొత్తం 58 రోజులు అంపశయ్యపై ఉన్నట్లు మహాభారతంలో స్పష్టంగా పేర్కొనబడింది.

భీష్మునికి తిల తర్పణం – సంతాన ప్రాప్తి విశ్వాసం

స్మృతి కౌస్తుభం ప్రకారం, ఈ రోజున ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం సమర్పించాలి.
భీష్ముడు ఘోరక బ్రహ్మచారి కావడంతో ఆయనకు సంతానం లేదు. అందువల్ల ఆయనను పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున తిలాంజలి సమర్పించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
ఈ విధంగా తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం.

భీష్మాష్టమి రోజు చేయవలసిన విధులు

  • సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానం చేయాలి
  • ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేయాలి
  • గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు వేయాలి
  • తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి
  • ఆ రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేయాలి

విష్ణుపూజ విధానం

  • విష్ణుమూర్తి చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి
  • తామరవత్తులతో ఆవునేతి దీపారాధన చేయాలి
  • తులసి దళాలు, తామర పువ్వులు, మల్లెపూలతో అర్చన చేయాలి
  • అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి

భీష్మాష్టమి నాడు శ్రేష్ఠమైన దానాలు

  • బ్రాహ్మణ కుమారులకు ఒడుగు కోసం అయ్యే ధనాన్ని దానంగా ఇవ్వడం
  • గోవుకు గ్రాసం వేయడం
  • పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం
  • బ్రాహ్మణులకు ఛత్రదానం, పాదరక్షలు, వస్త్రదానం చేయడం

ఇలాంటి దానాల ద్వారా పితృదేవతలు సంతోషిస్తారని శాస్త్రవచనం.

భీష్మాష్టమి తేదీ – 2026

జనవరి 26, 2026 (మాఘ శుక్ల అష్టమి)

No comments