వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయంలో అశూన్య శయన వ్రతం గురించి శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన విధానాన్ని నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం
నారదుడు అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు వివరించిన అశూన్య శయన వ్రతం గురించి ఈ విధంగా చెప్పసాగెను.
శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం
మహత్తరమైన కుమార సంభవం గురించి వివరించిన శృతదేవ మహామునికి నమస్కరిస్తూ శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! మన్మధుని భార్య రతీదేవి ఆచరించిన అశూన్యశయన వ్రతం ఎలా ఆచరించాలి? ఆ వ్రతవిధానం, వ్రతఫలం, చేయాల్సిన దానముల గురించి దయచేసి తెలియజేయండి" అని ప్రార్ధించగా అందుకు శ్రుతదేవుడు "మహారాజా! వినుము.
అశూన్యశయన వ్రతం విశిష్టత
అశూన్యశయనమను వ్రతం సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సకల శుభాలనిచ్చును. ఈ వ్రతం ఆచరించి గృహస్థధర్మముల పాటించిన వారు సర్వసంపదలను పొందుతారు.
అశూన్యశయన వ్రతవిధానం
శ్రావణమాసమున శుద్దవిదియ రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించే వారు నాలుగు నెలలపాటు యజ్ఞంలో సమర్పించిన హవిష్యాన్నమునే పాయసమునే భోజనంగా స్వీకరించాలి. చివరగా పారణదినమున లక్ష్మీసమేతుడగు శ్రీమహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను తయారుచేసి నివేదన చేయాలి. కుటుంబము కలిగిన సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనంగా ఇవ్వాలి. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలలు, సుగంధ వస్తువులతో పూజించాలి. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణమాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజించాలి.
తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణ మాసాలలో శ్రీలక్ష్మీ నారాయణుని పూజించాలి. అనంతరం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడ మాసాలలో శ్రీహరిని రుక్మిణీ సహితంగా ఎరుపురంగు పుష్పాలతో పూజించాలి. ఈ విధంగా ఆషాఢ శుద్ధ విదియ రోజు వ్రతం ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలయును.
మార్గశిరం మొదలుగా గల నాలుగు నెలల వ్రతం పారణలో విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్ర మాసం మొదలుకొని నాలుగు మాసాల వ్రతం పారణలో పురుష సూక్త మంత్రములచే హోమము చేయాలి. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను.
శ్రావణ మాసం మొదలుకొని నాలుగు మాసాల వ్రతం పారణలో కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తిగ వస్త్రాలంకారములు, దక్షిణతో ఇవ్వాలి. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచంపై పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.
అశూన్య శయన వ్రతాన్ని భార్యలేని పురుషుడును, భర్తలేని స్త్రీ, దంపతులు ఎవరైనా చేసికొనవచ్చును. భక్తిశ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే దంపతులుగా చిరకాలం దాంపత్యసౌఖ్యంతో వర్ధిల్లుతారు" అని శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు చెబుతూ "ఓ ముని! సకల సౌభ్యాలనిచ్చే అశూన్య శయన వ్రతం గురించి తెలుసుకున్నావు కదా! ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా" అని అడుగగా అప్పుడు శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! వైశాఖంలో చేసే ఛత్రదానం మహత్యం గురించి వివరింపు" అని అడుగగా ముని చెప్పడం మొదలు పెట్టాడు.
నారదుడు ఇక్కడ వరకు చెప్పి వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం.
