శ్రుతకీర్తి మహారాజు శృతదేవ మహామునితో వైశాఖమాసంలో ఛత్రదాన మహాత్యమును గురించి వివరించమని కోరగా ముని చెప్పిన విశేషాలు నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.
నారద అంబరీషుల సంవాదం
నారద మహర్షి అంబరీషునితో "ఓ రాజా! వైశాఖ మాసంలో ఛత్రదానం చేయడం పరమ పుణ్యం. ఈ విషయాన్ని శ్రుతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని ఏ విధంగా వివరించాడో సవివరంగా చెబుతాను జాగ్రత్తగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
శ్రుతకీర్తి మహారాజుకు శృతదేవ మహామునుల సంవాదం
వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం
శ్రుతదేవమహాముని శృతదేవ మహారాజుతో "రాజా! వైశాఖ మాసంలో ఎండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు, బ్రాహ్మణోత్తములకు ఎండ వల్ల బాధ లేకుండా గొడుగులు దానం చేసిన వారి పుణ్యం అనంతం. ఆ పుణ్యఫలాన్ని వివరించే కథను చెబుతాను. జాగ్రత్తగా ఆలకింపుము" అంటూ చెప్పసాగెను.
హేమాకాంతరాజు కథ
పూర్వం కృతయుగంలో వంగ దేశమున సుకేతుడనే మహారాజు కుమారుడు హేమకాంతుడనే రాజు ఉండేవాడు. ఇతను ఒకసారి వేటకు వెళ్లి అడవిలో అనేక జంతువులను వేటాడి అలిసిపోయి, సమీపంలో ఉన్న మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలోని మునులందరూ తపోదీక్షలో మునిగి ఉన్నారు. హేమకాంతుడు ఆ మునులను పలకరించబోగా వారెవ్వరు సమాధానం చెప్పలేదు. దానితో ఆగ్రహించిన హేమకాంతుడు మునులను చంపబోయేను.
ఆశ్రమంలో శిష్యులను సంహరించిన హేమకాంతుడు
తపోదీక్షలో ఉన్న మునులను చంపబోతున్న హేమకాంతుని చూసి ఆశ్రమంలోని శిష్యులు పరుగు పరుగున వచ్చి అతనిని అడ్డుకున్నారు. హేమకాంతునితో శిష్యులు "మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేరు, గౌరవింపలేరు. తపోదీక్షలో ఉన్న మునులపై కోపించడం సరికాదని" వారు హితవు పలికిరి.
ఆతిధ్యం కోరిన రాజు
హేమకాంతుడు ఆశ్రమంలోని శిష్యులతో "మీ గురువులు తపోదీక్షలో ఉంటే, వేటలో అలిసిపోయిన నాకు మీరు ఆతిధ్యం ఇవ్వండి" అని అడిగాడు. శిష్యులు రాజుతో "రాజకుమారా! మేము భిక్షాన్నం తినేవారం. మీకు ఆతిధ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు, కాబట్టి మేము మీకు ఆతిధ్యం ఇవ్వలేము" అని చెప్పిరి.
ఆగ్రహించిన రాజు
శిష్యుల మాటలకు హేమకాంతునికి ఆగ్రహం కలిగింది. వారితో "మేము ఈ రాజ్యానికి ప్రభువులం! మిమ్మల్ని క్రూర జంతువుల నుంచి కాపాడుతాం. మేమిచ్చిన అగ్రహారాలు పుచ్చుకుని మాకు ఆతిధ్యం ఇవ్వకపోవడం సబబు కాదు. ఇలాంటి కృతఘ్నులైన మిమ్మల్ని చంపినా తప్పు లేదు" అంటూ వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి. తరువాత హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు.
సుకేతుని ఆగ్రహం
తన కుమారుడు మునుల ఆశ్రమాన్ని పాడు చేసి శిష్యులను సంహరించిన విషయం తెలుసుకొని సుకేతుడు హేమకాంతునిపై కోపించి అతనికి రాజ్యబహిష్కరణ శిక్ష విధిస్తాడు. దేశబహిష్కృతుడైన హేమకాంతుడు అడవులలో నివసిస్తూ కిరాతుడై జీవించసాగాడు. ఆశ్రమంలోని శిష్యులను చంపడం వల్ల కలిగిన బ్రహ్మ హత్య దోషంతో ఒకచోట ఉండలేక అడవులు పట్టి తిరగసాగాడు.
వైశాఖ నియమాలు పాటించిన హేమకాంతుడు
ఒకసారి హేమకాంతుడు ప్రయాణిస్తున్న అడవిలో త్రితుడనే ముని కూడా ప్రయాణించసాగాడు. వైశాఖ మాసం ఎండ వేడిమికి తట్టుకోలేక ఆ ముని దప్పికతో మూర్ఛిల్లెను. అదే సమయంలో అక్కడకు వచ్చిన హేమకాంతుడు ఆ మునిని చూసి జాలిపడి మోదుగాకులతో గొడుగు తయారుచేసి మునికి ఎండ తగలకుండా ఛత్రం పట్టాడు. తనవద్ద ఉన్న సొరకాయ బుర్రలోని నీటిని మునికి తాగించి అతనికి స్వస్థత కలిగించాడు. త్రితుడు కూడా హేమకాంతుడు చేసిన ఉపచారాలకు సేదతీరి, అతనిచ్చిన మోదుగకుల గొడుగుతో ప్రయాణించి ఒక గ్రామానికి చేరి సుఖంగా ఉండెను.
పాపాల నుంచి విముక్తి పొందిన రాజు
తెలిసో తెలియకో వైశాఖ మాసంలో ఒక ధర్మాత్ముడికి గొడుగు, జలం ఇచ్చి సపర్యలు చేసిన పుణ్యానికి హేమకాంతుని పాపాలన్నీ తొలగిపోతాయి. కొంతకాలానికి హేమకాంతునికి రోగగ్రస్తుడై అంత్యకాలం సమీపించగా, యమభటులు అతని వద్దకు వస్తారు. వైశాఖమున మోదుగాకుల గొడుగును, సొరకాయ బుర్రనీటిని యిచ్చిన పుణ్యఫలం చేత హేమకాంతునికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.
హేమకాంతుని పట్ల శ్రీహరి కరుణ
దయాశాలియైన శ్రీ మహావిష్ణువు తన సేనాధిపతి విశ్వక్సేనుని పిలిచి "ఈ హేమకాంతుడు వైశాఖ వ్రత నియమాలు పాటించి నాకు ప్రీతి కలిగించాడు. నువ్వు ఇతనిని యమభటులు నుంచి కాపాడి వాని తండ్రి వద్దకు తీసుకొనిపోయి, అతనికి రాజ్యార్హత కల్పించామని నా మాటగా చెప్పమని చెప్పి" పంపిస్తాడు.
తండ్రిని చేరిన హేమకాంతుడు
శ్రీహరి యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమకాంతుని వద్దకు పోయి యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి వారిని పంపివేస్తాడు. హేమకాంతుని తీసుకుని అతని తండ్రి సుకేతుని వద్దకు పోయి శ్రీహరి ఆదేశాన్ని వివరిస్తాడు. సుకేతుడు కూడా సంతోషించి రాజ్యాన్ని హేమకాంతునికి అప్పజెప్పి తాను వానప్రస్థానానికి వెళ్లిపోతాడు.
హేమకాంతునికి మోక్షం
హేమకాంతుడు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ప్రతి ఏడూ వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ దానధర్మాలు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. బ్రహ్మజ్ఞానియై ధర్మమార్గము అవలంబించి సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను.
శృతదేవ మహాముని "ఓ శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు సాటిలేనివి. ఇవి ఎంతో సులభ సాధ్యములు పుణ్య ప్రదములు. సకల పాపాలను పోగొట్టి, ధర్మార్థకామమోక్షములను కలిగించునవి. అని వివరించెను.
ఈ కథను ఇక్కడవరకు నారదుడు అంబరీషునకు చెప్పి వైశాఖ పురాణం పద్నాలుగో అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం
