జ్యేష్ఠ మాస శుక్ల పౌర్ణమి రోజున ఆచరించే పవిత్రమైన వ్రతాల్లో వట సావిత్రి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని వివాహిత మహిళలు భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కోసం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సావిత్రి తన పతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుంచి భర్త సత్యవంతుని ప్రాణాలను తిరిగి పొందిన సంఘటనకు గుర్తుగా ఈ వ్రతం కొనసాగుతోంది.
2026 సంవత్సరంలో వట సావిత్రి వ్రతం జూన్ 29న ఆచరించబడుతుంది.
వ్రతం ఎప్పుడు చేస్తారు?
- జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.
- కొన్ని ప్రాంతాల్లో జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నుంచి ప్రారంభించి మూడు రోజుల పాటు ఆచరిస్తారు.
- జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేయలేనివారు జ్యేష్ఠ అమావాస్య రోజున కూడా ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.
వ్రత విధానం
వ్రతానికి ముందు రోజు ఉపవాసం ఉండడం ఆనవాయితీ.
మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి, ఇంటి దేవతలను పూజించిన అనంతరం సమీపంలోని వటవృక్షం (మర్రిచెట్టు) వద్దకు వెళ్లాలి.
అక్కడ:
- వటవృక్షం మొదలును శుభ్రపరచి ముగ్గులు వేయాలి.
- సావిత్రి–సత్యవంతుల ప్రతిమలు, త్రిమూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించి అలంకరించాలి.
- పూజ అనంతరం వటవృక్షానికి 108 ప్రదక్షిణలు చేయాలి.
- ప్రదక్షిణలు చేస్తూ వృక్షానికి పవిత్ర నూలుదారాన్ని చుట్టాలి.
- అనంతరం త్రిమూర్తి స్వరూపంగా భావించే వటవృక్షానికి నమస్కరించి, ముత్తైదువులకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి.
వట సావిత్రి వ్రత కథ
పూర్వం అశ్వపతి మహారాజు–మాళవి దంపతులకు సావిత్రి అనే కుమార్తె జన్మించింది. యుక్తవయస్సు వచ్చిన తర్వాత తనకు నచ్చిన వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఆమెకు ఇచ్చారు.
అరణ్యంలో నివసిస్తున్న, రాజ్యం కోల్పోయిన ద్యుమత్సేన మహారాజు కుమారుడు సత్యవంతుడును సావిత్రి తన భర్తగా ఎంచుకుంది. అయితే, సత్యవంతుడి ఆయుష్షు మరో సంవత్సరం మాత్రమేనని మహర్షి నారదుడు చెప్పినా, సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరకు వారిద్దరి వివాహం జరిగింది.
వివాహానంతరం సావిత్రి భర్తతో పాటు అత్తమామలకు సేవ చేస్తూ ఆదర్శ గృహిణిగా జీవించింది. నిర్ణయించిన గడువు ముగిసే రోజు సత్యవంతుడు అడవికి సమిధలు, పుష్పాలు తీసుకురావడానికి వెళ్లగా సావిత్రి కూడా అతనితో వెళ్లింది.
చెట్టు నుండి దిగిన సత్యవంతుడు అలసటతో సావిత్రి ఒడిలో తలపెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా యమధర్మరాజు ప్రత్యక్షమై అతని ప్రాణాన్ని తీసుకెళ్లసాగాడు. సావిత్రి కూడా యముడిని అనుసరిస్తూ వెళ్లింది.
సావిత్రి పతివ్రత్యం
యముడు పలుమార్లు వెనక్కి వెళ్లమని చెప్పినా, భర్త ఉన్న చోటే తన స్థానం అని సావిత్రి ధైర్యంగా సమాధానం చెప్పింది. ఆమె పతివ్రత్యాన్ని మెచ్చిన యముడు వరాలు కోరమన్నాడు.
సావిత్రి వరుసగా:
- అంధుడైన తన మామ ద్యుమత్సేనుడికి తిరిగి చూపు రావాలని,
- ఆయన కోల్పోయిన రాజ్యం తిరిగి లభించాలని,
- తాను పుత్రవతిగా మారాలని కోరింది.
యముడు మూడు వరాలూ ప్రసాదించాడు. మూడో వరం ఫలించాలంటే సత్యవంతుడు జీవించి ఉండాల్సిందేనని గ్రహించిన యముడు చివరకు అతని ప్రాణాలను తిరిగి ప్రసాదించాడు.
సావిత్రి తిరిగి అడవిలోని వటవృక్షం వద్దకు వచ్చేసరికి సత్యవంతుడు మళ్లీ జీవించి లేచాడు. అనంతరం వారిద్దరూ రాజ్యానికి చేరుకోగా, యముడు ప్రసాదించిన వరాలన్నీ నెరవేరాయి.
వ్రత విశిష్టత
సావిత్రి తన పతివ్రత్య మహిమతో భర్తను తిరిగి పొందిన సంఘటనకు గుర్తుగా వివాహిత మహిళలు వటవృక్షాన్ని పూజిస్తూ వట సావిత్రి వ్రతం ఆచరిస్తున్నారు. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
