తమిళనాడులోని పవిత్ర శైవ క్షేత్రాలలో ఒకటైన తిరుక్కొళ్లికాడు పొంగు శనీశ్వర ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పరమేశ్వరుడు అగ్నీశ్వరుడిగా, శని భగవానుడు శనీశ్వరుడిగా ఒకేచోట కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం శని దోష నివారణకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించి పూజిస్తే కష్టాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ క్షేత్రాన్ని “పొంగు శనీశ్వర ఆలయం” అని పిలవడానికి కారణం కూడా ఆసక్తికరమే. తమిళంలో “పొంగు” అంటే అభివృద్ధి, ఐశ్వర్యం, ఉత్సాహం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ శనీశ్వరుడిని దర్శిస్తే జీవితంలో ఉన్నత స్థానం, సంపద, శుభాలు పెరుగుతాయని విశ్వాసం.
జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే ఏలినాటి శని
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితంలో సుమారు ప్రతి 30 ఏళ్లకు ఒకసారి “ఏలినాటి శని” లేదా “సాడే సాతీ” అనే దశ వస్తుంది. ఇది మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
ఈ దశ మూడు భాగాలుగా విభజించబడుతుంది:
- వ్యయ శని – తమిళంలో “మంగు” దశ
- జన్మ శని – తమిళంలో “పొంగు” దశ
- ద్వితీయ శని – “మరణ శని” అని కూడా అంటారు
ఈ కాలంలో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతారు. పురాణాల్లో మహాదేవుడు, ధర్మరాజు, నలచక్రవర్తి వంటి మహనీయులే శని ప్రభావంతో కష్టాలు అనుభవించారని కథనాలు ఉన్నాయి.
అయితే తిరుక్కొళ్లికాడులో వెలసిన ఈ శనీశ్వరుని దర్శిస్తే శని ప్రభావం తగ్గి జీవితంలో శుభ మార్పులు వస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
అగ్నీశ్వరుడిగా పరమేశ్వరుడు
ఈ ఆలయం ప్రధానంగా శివాలయం కావడం విశేషం. ఇక్కడ మూలమూర్తి అగ్నీశ్వరర్ ఆలయం గా పరమేశ్వరుడు పూజలందుకుంటున్నారు.
స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి నిర్వహించిన యాగంలో అగ్నిదేవుడు పాల్గొనడం, అలాగే లక్క గృహాన్ని దహనం చేయడం వంటి కారణాలతో పరమేశ్వరుడు అగ్నిదేవునిపై ఆగ్రహించాడు. శివుని శాపంతో తన శక్తులను కోల్పోయిన అగ్నిదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి కఠోర తపస్సు చేశాడట.
అప్పుడు పరమేశ్వరుడు అగ్ని జ్యోతి రూపంలో ప్రత్యక్షమై అగ్నిదేవునికి అనుగ్రహం చేశాడని, అప్పటి నుండి ఇక్కడ అగ్నీశ్వరుడిగా కొలువై ఉన్నాడని పురాణ కథనం చెబుతోంది.
శని భగవానుడు “శనీశ్వరుడు”గా మారిన కథ
మరో పురాణ కథనం ప్రకారం ఏలినాటి శని వల్ల ప్రజలు పడే బాధలకు తననే నిందిస్తున్నారని శని భగవానుడు బాధపడ్డాడట. తనకు విముక్తి మార్గం చూపమని వశిష్ఠ మహర్షిని ప్రార్థించగా, ఆయన శివారాధన చేయమని సూచించాడట.
ఆ సూచన మేరకు శని దేవుడు ఈ క్షేత్రంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ప్రసన్నుడై, ఈ క్షేత్రంలో శనిని దర్శించి పూజించే వారికి శుభఫలితాలు ప్రసాదించాలని వరమిచ్చాడని చెబుతారు.
అంతేకాకుండా తన పేరులోని “ఈశ్వర” పదాన్ని శనికి జోడించి “శనీశ్వరుడు”గా పూజలందుకునే వరం ప్రసాదించాడట. అప్పటి నుండి ఈ క్షేత్రం శని దోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
చోళ రాజుల నిర్మాణ వైభవం
ఆలయ చరిత్ర ప్రకారం ఈ క్షేత్రాన్ని చోళ రాజులు నిర్మించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తమిళ శైవ సంప్రదాయ వైభవానికి నిదర్శనం.
పురాణాల ప్రకారం నల మహారాజు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి శని బాధల నుండి విముక్తి పొందాడని చెబుతారు.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రంలో అనేక విశేషాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
అరుణవర్ణ శివలింగం
సాధారణంగా శివలింగాలు నల్లని రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ గర్భగుడిలో వెలసిన అగ్నీశ్వరుడు అరుణ వర్ణంలో ప్రకాశించడం అత్యంత విశేషం.
మృదుపద నాయకి అమ్మవారు
స్వామివారితో పాటు అమ్మవారు “మృదుపద నాయకి”గా భక్తులకు దర్శనమిస్తారు.
సంపదలను ప్రసాదించే శని
ఇక్కడ శనీశ్వరుడు తన వాహనమైన కాకితో పాటు ఒక చేతిలో నాగలి, మరో చేతిలో అభయ హస్తంతో దర్శనమిస్తాడు. మహాలక్ష్మి సన్నిధి సమీపంలోని కుబేర స్థానంలో శని కొలువై ఉండడం ప్రత్యేకత.
ఈ శనిని దర్శిస్తే:
- శని దోషాలు తొలగుతాయి
- ఆర్థిక సమస్యలు తగ్గుతాయి
- ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది
- అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి
అని భక్తుల విశ్వాసం.
ధనుర్ధారిగా సుబ్రహ్మణ్యుడు
ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి లో స్వామివారు ధనుర్బాణంతో దర్శనమివ్వడం అరుదైన విశేషంగా చెప్పబడుతుంది.
నవగ్రహాల ప్రత్యేకత
సాధారణంగా ఇతర ఆలయాల్లో నవగ్రహాలు ఒక్కో దిక్కుకు ఎదురుగా ఉంటాయి. కానీ ఇక్కడ నవగ్రహాలు పరస్పరం ఎదురెదురుగా ఏర్పాటు చేయబడ్డాయి.
అలాగే శివార్చనలో బిల్వదళాలకు ఉన్న ప్రాధాన్యం లాగానే, ఇక్కడ శని పూజకు జమ్మి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది.
పూజలు, ఉత్సవాలు
ఈ ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతాయి. ముఖ్యంగా:
- ప్రతి సోమవారం
- ప్రతి శనివారం
- శని త్రయోదశి
- శని జయంతి
- మహాశివరాత్రి
రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
శని జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.
ఎలా చేరుకోవాలి?
ఈ ఆలయం తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడు గ్రామంలో ఉంది.
రైలు మార్గం
విమాన మార్గం
బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
