Vontimitta Rama Temple: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం – చరిత్ర, విశిష్టతలు, ఉత్సవాలు

ఈ విశ్వంలోని సద్గుణాలన్నింటినీ తనలో నింపుకుని సర్వకాలాలకు ఆదర్శప్రాయుడిగా, పూజనీయుడిగా నిలిచిన శ్రీరామచంద్రమూర్తి, శ్రీసీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి సమేతంగా కొలువుదీరిన ప్రాచీన దివ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ క్షేత్రం భక్తి, చరిత్ర, శిల్పకళల సమ్మేళనంగా ప్రసిద్ధి పొందింది.

ఒంటిమిట్ట అనే పేరుకి మూలం

పూర్వం ఒంటోడు, మిట్టడు అనే ఇద్దరు సోదరులు చోరవృత్తితో జీవనం సాగించేవారు. స్వామివారి దర్శనంతో వారి జీవితం మారి, ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించారని కథనం. వారి పేర్లపై ఈ క్షేత్రానికి “ఒంటిమిట్ట” అనే పేరు వచ్చింది.

అదేవిధంగా, ఒకే శిలలో సీతారామలక్ష్మణులు కొలువుదీరినందున ఈ ప్రదేశాన్ని “ఏకశిలానగరం” అని కూడా పిలుస్తారు.

స్థలపురాణ విశేషం

ఈ క్షేత్రానికి రామాయణం తో గాఢమైన సంబంధం ఉంది.

అరణ్యవాస సమయంలో శ్రీరాముడు సీతా, లక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఒకసారి సీతాదేవికి దాహం వేయగా, రాముడు మరియు లక్ష్మణుడు బాణాలతో నీటిని సృష్టించారని కథనం. ఆ తీర్థాలు నేటికీ “రామతీర్థం”, “లక్ష్మణతీర్థం”గా ప్రసిద్ధి చెందాయి.

తర్వాత సీతాన్వేషణలో భాగంగా జాంబవంతుడు ఈ ప్రాంతానికి వచ్చి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ చరిత్ర

విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఉదయగిరి ప్రాంత పాలకుడైన కంపరాయలు (1340–1355) ఆలయ నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషించినట్లు చరిత్ర చెబుతుంది.

తరువాత విజయనగర చక్రవర్తులు, మట్లి రాజులు గోపురాలు, ముఖమండపాలను నిర్మించి ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు.

ఆంధ్ర వాల్మీకి గా ప్రసిద్ధి చెందిన వావిలికొలను సుబ్బారావు ఆలయ పునరుద్ధరణకు కృషి చేసి, రథం, రథశాలను నిర్మింపజేశారు. పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని ప్రాచీన కట్టడంగా గుర్తించింది.

ఆధ్యాత్మిక వారసత్వం

ఈ క్షేత్రం అనేక మంది కవులు, భక్తులకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యంగా బమ్మెర పోతన ఇక్కడ నివసిస్తూ భగవతాన్ని రచించాడని విశ్వాసం.

అలాగే తాళ్ళపాక అన్నమాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి మహానుభావులు కూడా ఈ క్షేత్రాన్ని సేవించి కీర్తించారు.

నేటి ఉత్సవ వైభవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణం అధికారికంగా నిర్వహించబడుతోంది. 2015 నుండి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది.

ఆలయ నిర్మాణ వైభవం

ఒంటిమిట్టలో ప్రధాన రహదారి పక్కనే తూర్పు ముఖంగా ఈ ఆలయం నిర్మించబడింది. 1652లో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జాన్ బాప్టిస్టే టావెర్నియర్ ఈ ఆలయాన్ని భారతదేశంలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా ప్రశంసించాడు.

ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ ద్వారాలు ఉండగా, వాటిపై గోపురాలు నిర్మించబడ్డాయి. ప్రధాన తూర్పు గోపురం సుమారు 160 అడుగుల ఎత్తుతో ఐదు అంతస్తులతో భవ్యంగా దర్శనమిస్తుంది.

ఆలయ ప్రాంగణం మధ్యలో ఎత్తైన వేదికపై ప్రధాన ఆలయం ఉండి, అందులో రంగమండపం, ముఖమండపం, గర్భగుడి సముచితంగా నిర్మించబడ్డాయి.

ముప్పై రెండు శిల్పకళా స్తంభాలతో నిర్మితమైన రంగమండపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి స్తంభం పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలతో అలరారుతుంది.

రంగమండపంలో గరుడాళ్వారు మండపం ఉండగా, ముఖమండప ప్రవేశద్వారానికి ఇరువైపులా జయ, విజయులు ద్వారపాలకులుగా నిలిచివున్నారు. ఇదే మండపంలో బమ్మెర పోతన విగ్రహం దర్శనమిస్తుంది.

ముఖమండపంలో ఆళ్వారులు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమన్నారాయణులు భక్తులకు దర్శనమిస్తారు.

గర్భగుడి విశేషం

ప్రధాన గర్భగుడిలో శ్రీ కోదండరామస్వామి, శ్రీసీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి సమేతంగా ఒకే శిలలో కొలువుదీరి ఉన్నారు.

స్వామివారు కోదండం ధరించి దివ్య తేజస్సుతో దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంటుంది.

ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే—గర్భగుడిలో ఆంజనేయస్వామి విగ్రహం లేకపోవడం. దీనికి కారణంగా, శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హనుమంతుడితో పరిచయం జరగలేదని స్థలపురాణం చెబుతోంది.

ఉపాలయాలు

ఆలయ ప్రాంగణంలోనే శ్రీ రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న స్ఫటిక లింగం దర్శనమిస్తుంది.

అలాగే ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయస్వామి ఆలయం ను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.

ఉత్సవ వైభవం

ప్రతిరోజూ నిత్యపూజలు జరుగుతున్న ఈ ఆలయంలో, చైత్రమాసంలో శ్రీరామనవమి నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు పదిరోజులపాటు వైభవంగా జరుగుతాయి.

వివిధ వాహనసేవలు, రథోత్సవాలు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. అందులో ముఖ్యంగా శ్రీరామకళ్యాణం అత్యంత విశిష్టం.

ఇక్కడ శ్రీరామనవమి రోజున కాకుండా, చతుర్దశి రోజున రాత్రి పౌర్ణమికి ముందురోజు పండు వెన్నెల్లో కళ్యాణం జరగడం ప్రత్యేకత.

చంద్రుని వరం – ఆసక్తికర గాథ

పురాణ కథనం ప్రకారం, శ్రీరాముడికి చంద్రుడంటే ఎంతో ఇష్టం. కానీ శ్రీరాముడి వివాహం పగలు జరిగినందుకు చంద్రుడు బాధపడ్డాడు.

ఈ విషయం తెలిసిన శ్రీరాముడు చంద్రుడిని ఓదార్చి—“వెన్నెల్లో నా కళ్యాణం జరుపుకుంటాను” అని వరం ఇచ్చాడట.

ఆ వరప్రభావంతో ఒంటిమిట్టలో రాత్రి సమయంలో పండు వెన్నెల్లో సీతారాముల కల్యాణం జరగడం ఆనాటి నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది.

వసతి & రవాణా సౌకర్యాలు

భక్తులకు టూరిజం గెస్ట్ హౌస్‌లు, ప్రైవేట్ సత్రాల్లో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ క్షేత్రం కడప నుండి సుమారు 25 కి.మీ., తిరుపతి నుండి సుమారు 120 కి.మీ. దూరంలో కడప–తిరుపతి ప్రధాన రహదారిపై ఉంది.

కడప, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్, శ్రీశైలం, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

అలాగే రేణిగుంట–కడప రైలుమార్గంలో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్‌లో పాసింజర్ రైళ్లు ఆగుతాయి.

Comments