Mutyalamma Jatara Turpu Kanupuru 2026: చిల్లకూరు తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర 2026 – పోలేరమ్మ వెలనంపు విశేషాలు

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న Muthyalamma Temple, Turpu Kanupuru లో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ పక్షం తృతీయార్థంలో ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతూ భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

ఈ జాతరలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, గ్రామీణ సంప్రదాయాలు భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ముత్యాలమ్మతో పాటు ఆమె సోదరి Poleramma అమ్మవారికి నిర్వహించే కార్యక్రమాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి.

పోలేరమ్మ నిలుపు కార్యక్రమం

జాతర ప్రారంభానికి ముందురోజు అర్థరాత్రి ఆలయానికి తూర్పు దిక్కున పోలేరమ్మ నిలుపు కార్యక్రమం నిర్వహిస్తారు.

ఉదయం ఘటోత్సవం నిర్వహించి తూర్పు కనుపూరుతో పాటు పరిసర గ్రామాలలో ఘటాలను ఊరేగిస్తారు. వాటిలో ముఖ్యమైన గ్రామాలు:

  • ఈదలవారిపాళెం
  • పోసినవారిపాళెం
  • రావులవారిపాళెం
  • కొమరావారిపాళెం

రాత్రి పన్నెండు గంటల సమయంలో అందరూ కలిసి గంగమిట్ట వద్దకు చేరుకుంటారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలో కుమ్మరి తయారు చేసిన పోలేరమ్మ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు.

తప్పెట్లు, తాళాల నాదం మధ్య రజకులు పోలేరమ్మ విగ్రహాన్ని మోసుకువచ్చి గంగమిట్టపై ఏర్పాటు చేసిన గుడిసెలో కొలువుదీర్చి ఉంచుతారు. అనంతరం గణాచారులు, కుమ్మరులు, తమ్మళ్లు, చాకలి, గొల్లలు కలిసి అమ్మవారికి కుంభం పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

భక్తుల మొక్కులు

జాతర సందర్భంగా భక్తులు వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటారు.

  • చిల్లులున్న కుండలను నెత్తిపై పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తారు
  • అమ్మవారికి అంబలి సమర్పిస్తారు
  • పూలంగి సేవ, సామూహిక పల్లకీ సేవ నిర్వహిస్తారు

ఈ సమయంలో ముత్యాలమ్మను శాకంబరి అలంకారంలో అలంకరిస్తారు. జాతరలో ముఖ్యంగా బుధవారం, గురువారం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

“అక్కా… వెళ్లొస్తా!” సంప్రదాయం

ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతరకు నాలుగు రోజుల పాటు విచ్చేసి చివరిరోజు తిరిగి వెళ్లేటప్పుడు తన అక్క అయిన ముత్యాలమ్మకు “అక్కా… వెళ్లొస్తా!” అని చెప్పి వెళ్తుందనే సంప్రదాయం ఉంది.

ఈ సందర్భంగా భక్తులు పోలేరమ్మకు చీరలు పరిచి సాగిలపడతారు. ఇది జాతరలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టంగా భావిస్తారు.

పోలేరమ్మ వెళ్లనంపు

జాతర చివరి రోజు గంగమిట్టపై కొలువుదీరిన పోలేరమ్మకు వేకువజామున అన్నం రాశిగా పోసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం పోలేరమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్తారు.

ఈ సమయంలో:

  • బాణాసంచా పేలుస్తారు
  • గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి చేరుకుంటారు
  • మహిళలు చీరలు పరిచి వాటిపై పడుకుని అమ్మవారిని సాగనంపుతారు

తర్వాత ముత్యాలమ్మ ఉత్సవమూర్తిని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించి గణాచారి పూజలు నిర్వహిస్తారు. డప్పులు మోగిస్తూ ఆసాది వంశస్తులు పోలేరమ్మ కథను ఆలపిస్తారు. దీనితో జాతర ముగిసినట్లు భావిస్తారు.

2026 ముత్యాలమ్మ జాతర కార్యక్రమాల 

మార్చి 10, 2026 – జాతర ప్రారంభం

  • ఉదయం 5:00 గంటలకు – అమ్మవారికి దిష్టి తిర్పు
  • ఉదయం 6:00 గంటలకు – అమ్మ నిజపాద దర్శనం
  • సాయంత్రం 6:00 గంటలకు – సింహ వాహన సేవ

మార్చి 11, 2026

  • ఉదయం 6:30 గంటలకు – పూలంగి సేవ
  • ఉదయం – అమ్మవారి నిలుపు & శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవం (గ్రామ ప్రదక్షిణ)
  • రాత్రి – ఉయ్యాల సేవ

మార్చి 12, 2026

  • ఉదయం 6:30 గంటలకు – బంగారు చీరలో అమ్మవారి దర్శనం

మార్చి 13, 2026 – జాతర ముగింపు

  • ఉదయం 6:00 గంటలకు – వెలనంపు ఉత్సవం

No comments