Dadhichi Kund: నైమిశారణ్యం దధీచి కుండం – మహర్షి దధీచి పురాణ గాథ, పాపనాశిని పవిత్రత
నైమిశారణ్యం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్న పవిత్ర క్షేత్రం. ఇది పురాణాలు పుట్టిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యంలో, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ నైమిశారణ్యంలో ఋషులు, మునులు తపస్సు చేయాలని ఆదేశించినట్లు చెప్పబడింది. అందువల్ల ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైన తపోభూమిగా పరిగణించబడుతోంది.
ఈ మహా పుణ్యక్షేత్రంలో ఉన్న పవిత్ర తీర్తమే దధీచి కుండం. ఈ కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా లేదా స్నానం చేసినా 88 వేల నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం చెబుతోంది. ఇలా స్నానం చేయడం వల్ల పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని విశ్వాసం.
ఘనత వహించిన మన మహర్షులు
మన భారతదేశం ఆధ్యాత్మికతలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం ఈ పుణ్యభూమిపై జన్మించిన అనేకమంది మహర్షులు. వారు చేసిన యజ్ఞాలు, తపస్సులు, ధర్మాచరణలు దేశానికి శాంతి, సంపదలను ప్రసాదించాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహనీయుల జీవితాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమే.
ఎవరు దధీచి మహర్షి?
దధీచి మహర్షి అథర్వణ ఋషి మరియు చితి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. అందువల్ల ఆయన సరస్వతి నది తీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఘోర తపస్సు చేసేవారు.
తన తపస్సుతో ప్రసన్నమైన శ్రీ మహావిష్ణువు దధీచికి ఒక ప్రత్యేక వరం ఇచ్చాడు — తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ప్రాణాలు విడిచే వరం.
సురాసురుల యుద్ధం
ఒకసారి రాక్షసులు వృత్తాసురుడు ఆధ్వర్యంలో దేవతలపై యుద్ధానికి దిగారు. దేవతల వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను స్వాధీనం చేసుకోవడమే వారి లక్ష్యం.
ఆ యుద్ధంలో రాక్షసులను ఎదుర్కోలేక దేవతలు పారిపోతూ తమ ఆయుధాలను దధీచి మహర్షి వద్ద దాచిపెట్టారు. దధీచి తేజస్సును చూసి రాక్షసులు ఆయన ఆశ్రమానికి దగ్గరగా రాలేక వెనుదిరిగారు.
అస్త్రశస్త్రాలను అవపోసన పట్టిన దధీచి
దేవతలు తిరిగి వస్తారని భావించి దధీచి మహర్షి చాలా కాలం వేచి చూశారు. కానీ వారు రాకపోవడంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి అవపోసన పట్టుకున్నారు.
మహావిష్ణువును ఆశ్రయించిన దేవతలు
వృత్తాసురుడి బారి నుంచి రక్షణ కోసం ఇంద్రుడు సహా దేవతలు శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి, దధీచి మహర్షి ఎముకలతో తయారైన ఆయుధంతో మాత్రమే వృత్తాసురుడిని సంహరించగలమని చెప్పారు.
దధీచి త్యాగం
దేవతలు దధీచి మహర్షిని వేడుకోగా, లోకకల్యాణం కోసం తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అయితే మరణించే ముందు భూమిపై ఉన్న అన్ని నదుల్లో స్నానం చేయాలని తన కోరికను చెప్పారు.
అప్పుడు ఇంద్రుడు నైమిశారణ్యంలో 88 వేల నదుల జలాలను సమకూర్చి ఆయనకు స్నానం చేయించాడు. ఆ తర్వాత దధీచి మహర్షి తన వరప్రభావంతో ప్రాణాలను విడిచారు.
అనంతరం కామధేనువు ఆయన శరీరంలోని మాంసాన్ని తొలగించి ఎముకలను బయటకు తెచ్చింది. ఆ ఎముకలతో వజ్రాయుధం తయారు చేసి ఇంద్రుడు వృత్తాసురుడిని సంహరించాడు.
దధీచి కుండం ఎలా ఏర్పడింది?
దధీచి మహర్షికి దేవతలు 88 వేల నదీ జలాలతో స్నానం చేయించినప్పుడు ఆ నీరు చేరి ఏర్పడిన పవిత్ర తీర్తమే దధీచి కుండం.
పాపనాశిని దధీచి కుండం
నైమిశారణ్యం వెళ్లే భక్తులు ఈ కుండంలోని నీటిని గంగానదికి సమానమైన పవిత్ర జలంగా భావిస్తారు. ఈ నీటిని తలపై చల్లుకున్నా లేదా స్నానం చేసినా 88 వేల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఇలా స్నానం చేయడం ద్వారా పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
Post a Comment