మన సాంప్రదాయంలో అనేక పండుగలు, పర్వదినాలు, వ్రతాలు ఉన్నాయి. కామ్యఫలాలను ప్రసాదించే వ్రతాలలో పుత్ర గణపతి వ్రతం ఒక విశిష్టమైనది. ఫాల్గుణ శుద్ధ చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సంతానం ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ శ్రీ గణపతిని ఆరాధించే పవిత్ర వ్రతమే ఇది.
“కలౌ చండీ వినాయకౌ” అని శాస్త్రవచనం. కలియుగంలో త్వరగా అనుగ్రహించే దైవం గణపతి. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆచరించే వరసిద్ధి వినాయక వ్రతం నుండి సరిగ్గా 180 రోజుల తర్వాత, అంటే ఆరు నెలలకు ఈ పుత్ర గణపతి వ్రతం రావడం విశేషంగా భావించబడుతుంది.
“పుత్ర గణపతి” అనే పేరులో “పుత్ర” అన్న పదాన్ని కేవలం కుమారసంతానం అని మాత్రమే భావించరాదు. ఇక్కడ “పుత్ర” అంటే సంతానం అనే విస్తృత అర్థంలో గ్రహించాలి. సంతాన ప్రాప్తి, వంశవృద్ధి, కుటుంబ సౌఖ్యాల కోసం ఈ వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు.
వినాయక చతుర్థి రోజున గణపతిని ఏ విధంగా పూజిస్తామో, అదే విధానంతో ఈ రోజున కూడా పూజ నిర్వహించాలి.
గణపతి శబ్దబ్రహ్మ స్వరూపుడు. ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నిటికీ ముందు ఓంకారం ఉన్నట్లే, అన్ని శుభకార్యాలకు ఆది గణేశపూజే. గణేశుడు ఆద్యంతరహిత ఆనందమూర్తి, సకల సంపత్తులను ప్రసాదించే సిద్ధిదేవత. ఓంకార నాదం నుండి ఉద్భవించిన దైవ స్వరూపమే గజాననుడు అని ఆధ్యాత్మిక భావన.
“గణపత్యథర్వశీర్షం” లో కూడా గణపతిని ఓంకారస్వరూపుడిగా వర్ణించారు. దేవతాగణాలకు నాయకుడై, అధిపతిగా వెలసినందున గణనాథుడు, గణేశుడు, గణపతి అనే నామాలు ప్రసిద్ధి చెందాయి.
వ్రత విధానం
- ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టాలి.
- శ్రీ గణపతిని షోడశోపచారాలతో పూజించాలి.
- స్వామివారికి ఇష్టమైన పండ్లు, పిండివంటలు నైవేద్యంగా సమర్పించాలి.
- నువ్వులతో చేసిన నైవేద్యాలు ప్రత్యేకంగా సమర్పించడం శ్రేయస్కరం.
- సాయంత్రం మరల పూజించి అనంతరం ఉపవాస విరమణ చేయాలి.
- పూజ అనంతరం ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టి, ఎరుపు రంగు పంచెను దక్షిణ తాంబూలాలతో సమర్పిస్తే గణపతి శీఘ్ర అనుగ్రహం లభిస్తుందని శాస్త్రోక్తి.
నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి.
2026 సంవత్సరంలో పుత్ర గణపతి వ్రతం : ఫిబ్రవరి 21
