Mangalagiri Brahmotsavam 2026: మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2026 షెడ్యూల్ & పానకాల స్వామి వైభవం

కృష్ణానదీ తీరాన వెలసిన పవిత్ర నారసింహ క్షేత్రం మంగళగిరి. భక్త రక్షణార్థం అవతరించిన దయామయుడు శ్రీ నరసింహస్వామి ఇక్కడ మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు – కొండ దిగువన లక్ష్మీనరసింహస్వామి, కొండపై పానకాల స్వామి, శిఖరంపై గండాల నరసింహస్వామి.

ఫాల్గుణ మాస శుద్ధ షష్టి నాడు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చతుర్దశి నాడు శాంత నరసింహస్వామి వారికి శ్రీదేవి, భూదేవులతో దివ్య కల్యాణం కడు రమణీయంగా నిర్వహిస్తారు. మరుసటి రోజు పౌర్ణమి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. లక్షలాది భక్తులు పాల్గొని మహారథాన్ని లాగడానికి పోటీ పడతారు. రథపు తాళ్లు తాకినా పుణ్యమేనని విశ్వసిస్తారు.

పానకాల స్వామి మహిమ

మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురం. హిరణ్యకశిపుని వధానంతరం రౌద్రరూపంలో ఉన్న స్వామిని శాంతింపజేయడానికి శ్రీలక్ష్మిదేవి ఇక్కడ తపస్సు చేసి అమృతం సమర్పించిందని పురాణగాథ. ఆ తరువాత స్వామి శాంతస్వరూపుడయ్యారు. కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరంలో పాలు, కలియుగంలో బెల్లపు పానకం సమర్పించడం ఆనవాయితీగా మారింది.

పానకాలస్వామి ఆలయంలో స్వామి ముఖం మాత్రమే దర్శనమిస్తుంది. భక్తులు సమర్పించే పానకాన్ని పూజారి స్వామి నోటిలో పోస్తారు. సగం వరకు స్వీకరించినట్లు “గుటక” శబ్దం వినిపిస్తుందని విశ్వాసం. మిగతాది ప్రసాదంగా ఇస్తారు. ఎంతో పానకం వినియోగమవుతున్నా అక్కడ చీమలు కనిపించకపోవడం విశేషంగా భావిస్తారు.

మూడు ఆలయాల విశిష్టత

  • కొండ దిగువన: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
  • కొండపై: పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
  • కొండ శిఖరంపై: గండాల నరసింహస్వామి – విగ్రహం లేకుండా దీపారాధన ప్రధానంగా ఉంటుంది. గండాలు తొలగాలని మొక్కులు చేసుకునే క్షేత్రం.

2026 బ్రహ్మోత్సవాల షెడ్యూల్ (ఫిబ్రవరి 22 నుంచి మార్చి 5 వరకు)

  • 22న – పెండ్లికుమారుని ఉత్సవం, గ్రామోత్సవం
  • 23న – ధ్వజారోహణం, గరుడపతక ఆవిష్కరణ, గరుడముద్దల ప్రసాదం
  • 24న – హనుమంత వాహనం
  • 25న – రాజాధిరాజ వాహనం
  • 26న – ఉదయం ముత్యాలపల్లకి, రాత్రి యాలి వాహనం
  • 27న – చిన్నశేషవాహనం, రాత్రి సింహవాహనం
  • 28న – హంసవాహనం, రాత్రి గజవాహనం
  • మార్చి 1 – కల్పవృక్ష వాహనం, రాత్రి పొన్న వాహనం
  • మార్చి 2 – దివ్య కల్యాణ మహోత్సవం
  • మార్చి  04 - వసంతోత్సవం
  • మార్చి  05 - పుష్పయాగం 

మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 2 గంటలకు బంగారు గరుడవాహనంపై స్వామివారిని ఆలయ మాడవీధుల్లో మాత్రమే ఊరేగింపజేస్తారు. అదే రోజు మధ్యాహ్నం జరగాల్సిన రథోత్సవం రద్దు చేసి, ఉదయం 7 గంటలకు రథంపై ఆశీనులైన స్వామి అమ్మవార్లకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

మార్చి 6 నుంచి 18 వరకు ఆస్థాన అలంకారోత్సవాలు జరుగుతాయి.

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం ద్వారా:

  • విజయవాడ నుంచి సుమారు 12 కి.మీ
  • గుంటూరు నుంచి సుమారు 20 కి.మీ
  • విజయవాడ–గుంటూరు జాతీయ రహదారి (NH-16)పై ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు సులభంగా లభిస్తాయి.

రైలు మార్గం ద్వారా:

  • సమీప రైల్వే స్టేషన్: మంగళగిరి (సుమారు 3 కి.మీ)
  • ప్రధాన రైల్వే జంక్షన్: విజయవాడ (సుమారు 12 కి.మీ)

విమాన మార్గం ద్వారా:

  • సమీప విమానాశ్రయం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం – సుమారు 25 కి.మీ

ఆలయ ప్రత్యేకతలు

  • కృష్ణానదీ తీరాన వెలసిన అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రం.
  • మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉండటం విశేషం:
  • కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
  • కొండపై పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
  • కొండ శిఖరంపై గండాల నరసింహస్వామి క్షేత్రం
  • పానకాల స్వామికి బెల్లపు పానకం సమర్పించే అరుదైన సంప్రదాయం ప్రపంచ ప్రసిద్ధి.
  • పానకం ఎంతగా వినియోగించినా అక్కడ చీమలు కనిపించకపోవడం అద్భుతంగా భావిస్తారు.
  • ఫాల్గుణ మాస బ్రహ్మోత్సవాలు, దివ్య కల్యాణ మహోత్సవం, రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి.
  • భక్తుల ఆపదలు వెంటనే తొలగించే క్షిప్ర ప్రసాదుడుగా నరసింహస్వామి ప్రసిద్ధుడు.

No comments